ఆధ్యాత్మికం: బాధ.. నిరాశ.. నిస్పృహలకు శ్రీకృష్ణుడి వివరణ ఇదే..!

ఆధ్యాత్మికం: బాధ.. నిరాశ.. నిస్పృహలకు శ్రీకృష్ణుడి వివరణ ఇదే..!

ప్రతి మానవుడు ఆనందంగా ఉండాలనుకుంటాడు.. కాని దానికి భిన్నంగా ఎప్పుడూ.. నిరాశ.. నిస్పృహలతో  జీవిస్తుంటాడు.  ఇది సహజలక్షణమే అయినా బాధపడుతుంటాడు.అసలు బాధ అంటే ఏమిటి..నిరాశ .. నిస్పృహల విషయంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో తెలుసుకుందాం. . 

మానవుడు ఆనంద స్వరూపుడైన భగవంతునికి ప్రతిరూపం. ఆనంద స్వరూపుడైన మనిషి ఆనందంగా ఉండాలి కాని... దానికి భిన్నంగా ఉండటం అసహజం. మనిషికి బ్రతుకులో ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అన్నింటినీ సమానంగా స్వీకరించితే ఉండేది ఆనందమే. కాని..  ఎందుకో గాని మనిషి ఎన్నో సందర్భాలలో దుఃఖపడుతూ ఉంటాడు. అది సహజ లక్షణం కాదు. 

సహజత్వంలో సుఖం ఉంటుంది. అయితే మనిషి తన సహజ లక్షణాన్ని మర్చిపోయి, ప్రపంచంలో ఉన్న దుఃఖభారం అంతా తానే మోస్తున్నట్లు ఆయాస పడిపోతూ ఉంటాడు.  యుద్ధం చేయటానికి భయపడి, వణికిపోతున్న అర్జునుడికి సహజ లక్షణాన్ని గుర్తు చేశాడు శ్రీకృష్ణుడు. పైగా ప్రస్తుతం ఉన్న స్థితి ఉండకూడదు అని నిశ్చయంగా చెప్పాడు. ఎందుకు ఏడవకూడదో కారణాలని కూడా సహేతుకంగా వివరించాడు. 

Also Read :- కౌగిలింతలో.. ప్రేమ పుంత.. హ్యాపీ హగ్ డే..!

ఒక శతకానికి ఉన్న మకుటంలాగా కొన్ని శ్లోకాల చివర ఒకే విషయం మరీ మరీ నొక్కి వక్కాణించటం జరిగింది. మరెక్కడా ఈ విధంగా చెప్పలేదు. అంటే బాధ పడే అధికారం లేదు అన్న మాటకి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ....నాను శోచితుమర్హసి.......శైవం శోచితు మర్హసి....సత్వం శోచితు మర్హసి.... అంటూ ఎన్నోసార్లు నీకు శోకించే అధికారం లేదు.... అని తీర్పు చెప్పాడు శ్రీ కృష్ణుడు.  

ఒక పని చేయటానికి మనిషికి కొన్ని అర్హతలు ఉంటాయి. అటువంటి వాటిలో శోకించటానికి ఏ అర్హతా.. అధికారం లేదు మనిషికి . శోకం మనిషిని క్రుంగదీస్తుంది. అప్పుడు మనస్సు... శరీరం తమ శక్తిని పరిపూర్ణంగా వ్యక్తం చెయ్యలేవు. పనిలో సమర్థత దెబ్బతింటుంది. మనస్సు వత్తిడికి లోనవుతుంది. ఉత్సాహం నశిస్తుంది. వినాళ గ్రంథుల నుండి స్రవించే హార్మోనులు మనస్సుని నిరాశా నిస్పృహలకి లోనుచేస్తాయి. సంతోషంగా ఉండి చేసిన పని త్వరగా ఫలిస్తుంది.


-వెలుగు,లైఫ్-