కరోనా తర్వాత పిల్లల చదువులపై ప్లానేంటి?

కరోనా తర్వాత పిల్లల చదువులపై ప్లానేంటి?

కరోనా వైరస్​ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏడాదికిపైగా స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. దాదాపు 150 కోట్ల మంది స్టూడెంట్లు చదువుకు దూరమయ్యారు. ఇండియాలో 20 కోట్ల మంది, తెలంగాణలో కోటి మంది స్టూడెంట్లు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లలేకపోయారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత స్కూళ్లు, విద్యా సంస్థలు ప్రారంభించి పిల్లలకు డెరెక్ట్​ క్లాసులు జరిగేలా ఏర్పాట్లు చేయాలి. అకడమిక్ ఇయర్​లో కచ్చితంగా ఇన్ని క్లాసులు/రోజులు లభిస్తాయని అంచనా లేనప్పటికీ 100 నుంచి 150 రోజుల పనిదినాలు దృష్టిలో ఉంచుకొని క్లాసులు, సబ్జెక్టుల వారీగా లెస్సన్స్, లెర్నింగ్​ స్కిల్స్ పెరిగేలా ప్లాన్ చేసుకోవాలి.

తగిన ప్లాన్​ రెడీగా ఉండాలి
ఇప్పటికే ఒక అకడమిక్ ఇయర్​ నష్టపోయినందున కోల్పోయిన క్లాస్​కు సంబంధించిన సబ్జెక్టుల సారం పిల్లలకు ప్రారంభంలోనే చెప్పడానికి తగిన ప్లాన్​తయారు చేసుకోవాలి. బ్రిడ్జిటీచింగ్ జరగాలి. కోల్పోయిన క్లాసుకు సంబంధించిన అంశాలు, భాషలు టీచ్​ చేసేందుకు కొత్త క్లాస్ సబ్జెక్టులను కోఆర్డినేట్ చేయాలి. స్టూడెంట్లకు లెక్కల్లో ఇంతకు ముందు క్లాస్ లోని విషయాలపై అవగాహన లేకపోతే తర్వాత క్లాస్​లో సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం కష్టం. కనుక ప్రైమరీ, సెకండరీ లెవల్లో సబ్జెక్టు టీచర్లకు అవసరమైన ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకు కావలసిన క్లాసులు, సబ్జెక్టులు మాడ్యూల్స్ గా తయారుచేసి టీచర్లకు అందించాలి. ఇవన్నీ డెరెక్ట్​ క్లాసులు మొదలైనప్పడు ఉపయోగపడేలా తయారు చేయాలి. ఫస్ట్ క్లాస్ పూర్తికాకుండానే సెకండ్ క్లాస్ కు వచ్చిన స్టూడెంట్ల కోసం అక్షరాలు, నంబర్లతో కూడిన లెస్సన్ ప్లాన్ రూపొందించాలి. ఇందుకోసం టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి.

ఆన్​లైన్, డిజిటల్​ క్లాసులతో అబ్బిన చదువెంత​ 
విద్యా హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర విద్యా శిక్షణా పరిశోధనా సంస్థ(ఎస్​సీఈఆర్​టీ) అకడమిక్ అథారిటీ. చదువులు, క్లాసులకు సంబంధించి ఆ సంస్థ సూచనలను విద్యాశాఖ అమలుచేయాలి. జాతీయ స్థాయిలో జాతీయ విద్యా పరిశోధన సంస్థ (ఎన్​సీఈఆర్​టీ) పిల్లల చదువులపై సూచనలు ఇస్తుంది. కేంద్రంలో ఎన్సీఈఆర్టీ, రాష్ట్రంలో ఎస్సీఈఆర్టీ కోఆర్డినేషన్​తో ఈ విద్యా విపత్తును ఎదుర్కొనడానికి, పిల్లల చదువులు కొనసాగడానికి రిసెర్చ్, సూచనలు చేసి, టీచర్లను సమాయత్తం చేయాలి. కరోనా ఫస్ట్ వేవ్​లో ఈ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖలు సరైన ప్లానింగ్ లేక ఫెయిల్ అయ్యాయి. కేవలం ఆన్​లైన్ క్లాసులు, డిజిటల్ క్లాసులు వంటి అంశాలకు పరిమితమై చేతులు దులుపుకున్నాయి. అయితే సరైన యాక్షన్​ ప్లాన్​ లేక అవన్ని మొక్కుబడిగా సాగాయి. దీంతో 80 శాతం గ్రామీణ విద్యార్థులు చదువు దెబ్బతిన్నది. ఇంటర్నెట్ సౌకర్యం, సెల్​ఫోన్లు , కంప్యూటర్లు లేక వాటిని సమకూర్చుకునే ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడ్డారు. కొత్త ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ ఇబ్బందులు ఉండే విషయాన్ని విద్యాశాఖ అంచనా వేయలేకపోయింది. ఆన్​లైన్, డిజిటల్ క్లాసులు ఎంత మంది పిల్లలకు ఏ మేరకు చేరాయి? ఎంతవరకు అర్థమయ్యాయి? వంటి వాటిపై పరిశీలనే లేదు. మధ్యాహ్న భోజనం, ఉచిత దుస్తులు ఆసరాగా ఉంటాయన్న ఆశతో స్కూల్​కు వచ్చే పిల్లలు ఉన్న మన వ్యవస్థలో ఆన్​లైన్ క్లాసులు సక్సెస్ కావడం ప్రశ్నార్థకమైంది. అనేక మంది పిల్లలు చదువుకు దూరమై బాలకార్మికులుగా మారారు. బాలికలు అనేక లైంగిక వేధింపులకు గురయ్యారు. ఇంకా అవుతున్నారు. బాల్యవివాహాలు కూడా పెరుగుతున్నాయి. విద్యారంగ పరిస్థితులు ఇంత ప్రమాదకరంగా ఉంటే ఎన్సీఈఆర్టీ, ఇటు ఎస్సీఈఆర్టీ ముందస్తు ఆలోచనలు లేకుండా రొటీన్ గా వ్యవహరించడం శోచనీయం. ఈ పరిస్థితిలో ఆన్​లైన్, జూమ్ ద్వారా మే నెలలో రకరకాల శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

ఈ టైమ్​లో టీచర్లకు ఈ వేస్ట్​పై ట్రైనింగా..!​
నిష్ట 2.0 పేరుతో సెకండరీ స్కూళ్ల హెచ్​ఎంలు, టీచర్లకు ఇ–వేస్ట్ మేనేజ్మెంట్, కొవిడ్–19 రెస్పాన్సివ్ బిహేవియర్, యాక్షన్ రీసెర్చ్ వంటి అంశాలపై ట్రైనింగ్ జరుగనుంది. దీక్ష పేరుతో మరో ఆన్​లైన్ శిక్షణ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ప్రథమ్ ఫౌండేషన్ స్కిల్ డెవలప్​మెంట్​పై మరో ట్రైనింగ్ జరుగుతోంది. సందట్లో సడేమియాగా టీచర్ల సెల్ఫ్ అసెస్ మెంట్ చేయాలని విద్యాశాఖ మరోవైపు నిర్బంధిస్తోంది. రాష్ట్రంలో ఎస్సీఈఆర్టీ తీసుకొచ్చే ఆన్​లైన్ బై మంత్లీ మ్యాగజైన్ ద్వారా పిల్లల రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహం, బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి చర్చిస్తున్నాయి. పిల్లల ఇన్​వెన్షన్ల కోసం యూట్యూబ్ లో ఒక చానల్ కూడా విద్యాశాఖ ప్రారంభించింది. ఇదే కాకుండా స్కూల్ లీడర్​షిప్ అకాడమీ శాలసిద్ధి అప్ డేటింగ్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని ఆదేశిస్తోంది. సాధారణ పరిస్థితులలో ఇవన్నీ అవసరమైనప్పటికీ, కరోనా పాండమిక్ పరిస్థితిలో, టీచింగ్ ఆగిపోయిన సందర్భంలో వీటి వల్ల ఫాయిదా ఏముంది? కనీసం కరోనా పరిస్థితుల్లో స్పెషల్ యాక్షన్ ప్లాన్ గురించి ఆలోచించక పోవడం. విద్యాశాఖల ఆలోచనలు ఎంత మూసపద్ధతిలో ఉన్నాయో అర్థమవుతోంది. ఇవి రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి టీచర్లను, విద్యాశాఖ అధికారులను రెడీ చేస్తున్నట్లు లేవు. ప్రత్యామ్నాయ ప్రణాళికల తయారికి సంబంధించిన ఆలోచనలు చేస్తున్నట్లు లేదు. ఇది మన విద్యాశాఖ బాధ్యతారాహిత్యం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా మాత్రమే మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోగలం. అందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో సన్నద్ధత చర్యలు ప్రారంభం కావాలి . అప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తును కాపాడగలం.

క్లాసులు ఎప్పుడు చాలైతయ్?
కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత స్కూళ్లు ప్రారంభమై విద్యా బోధన కొనసాగుతుందని అంతా అనుకున్నారు. అయితే స్కూళ్లు స్టార్టైన నెలలోనే సెకండ్ వేవ్ మొదలైంది. ఏప్రిల్ 27 నుండి వేసవి సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు, వైరాలజిస్టులు, శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం దీని తర్వాత థర్డ్ వేవ్ ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సిన్. కానీ ఇంకా చిన్న పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఎప్పటికి వస్తుందో తెలియదు. దీంతో వచ్చే అకడమిక్ ఇయర్ కూడా అనుకున్న టైమ్​కు ప్రారంభమవడం అనుమానమే. ప్రారంభమైనా థర్డ్ వేవ్​తో సక్రమంగా కొనసాగడం అనుమానమే. ప్రస్తుత అంచనాల ప్రకారం 2021–2022 ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కనుక పిల్లల చదువుల గురించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకు రాష్ట్ర సర్కార్, విద్యాశాఖ చొరవ తీసుకోవాలి.

60 లక్షల మంది పిల్లలు చదువుకు దూరం
మన రాష్ట్రంలో కోటి మంది పిల్లలు కరోనా వల్ల చదువుకు దూరం కాగా, వీరిలో స్కూల్ పిల్లలే 60 లక్షల మంది ఉంటారు. గత మార్చి 22న మూతపడిన స్కూళ్లు 2021  ఫిబ్రవరిలో తెరుచుకున్నాయి. పిల్లలు 11 నెలల చదువులకు దూరమయ్యారు. గ్రౌండ్​ లెవెల్లో ప్రైమరీ క్లాసులు పిల్లల లెర్నింగ్ మరింత దెబ్బతిన్నది. ముఖ్యంగా ఫస్ట్ క్లాస్​లో జాయిన్​ అయ్యే వయసున్న పిల్లలు స్కూల్లో అడ్మిషన్ ​పొందినా, పొందకపోయినా విద్యా సంవత్సరంలోని 220 పనిదినాల్లో నేర్చుకోవాల్సిన స్కిల్స్ వారు పొందలేదు. అంటే భాషకు సంబంధించి వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం నైపుణ్యాలు సరిగా రాకుండానే, అంకెల పరిజ్ఞానం లేకుండానే రెండో క్లాస్​కు ప్రమోట్ అయ్యారు. మిగతా క్లాసులు పిల్లలు కూడా ఆయా సబ్జెక్టుల్లో కనీస అభ్యసన లేకుండా 2021–-2022లో పైక్లాసులకు వెళ్లనున్నారు.

కె.వేణుగోపాల్, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అడ్వైజర్​