యాసంగిలో వడ్లు కొనబోమని... ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం చెబితే.. రైతులు ఈసారి వరికి బదులు ఇతర పంటలు సాగు చేశారు. పల్లి, మక్క, శనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర్లు, మినుము పంటలన్ని కొతకోచ్చినయి. సర్కారు మాట విని ప్రత్నామ్నాయ పంటలు పండించిన రైతులకు తీరా మార్కెట్లో మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టడం గానీ, ఆయా పంటలకు ప్రోత్సాహం అందించడం గానీ చేయడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారులు వారికి ఇష్టమొచ్చిన రేటు పెడుతున్నారు. సర్కారు వెంటనే స్పందించి మద్దతు ధరతో పంటలన్నీ కొనాలి. లేదంటే ధర రావడం లేదని రైతులు ప్రత్యామ్నాయ పంటలు శాశ్వతంగా వదిలేసే ప్రమాదం ఉంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫారసుల ప్రకారం ఒక మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజూ 400 గ్రాముల ఆహార ధాన్యాలు(బియ్యం, గోధుమలు, జొన్నలు సహా చిరు ధాన్యాలు), 60 గ్రాముల పప్పులు , 60 గ్రాముల నూనె, 350 గ్రాముల కూరగాయలు , 100 గ్రాముల పండ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్లు, మాంసం, చేపల రూపంలో కొన్ని పోషకాలు ఎలాగూ అందుతాయి. రాష్ట్రంలో దాదాపు3 కోట్ల 80 లక్షల మంది ప్రజలను ఆరోగ్యంగా ఉంచె అన్ని పంటలు ఇక్కడ పండుతాయి. అయితే సాగు భూములను వానాకాలం, యాసంగి సీజన్లలో జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. పాలకులు దశాబ్దాలుగా అనుసరించిన తప్పుడు వ్యవసాయ విధానాల వల్ల , రాష్ట్రంలో పంటల వైవిధ్యం బాగా తగ్గిపోతూ వచ్చింది. వరి, పత్తి లాంటి పంటలు80 శాతం సాగు భూములను ఆక్రమించడంతో పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయల సాగు బాగా పడిపోయింది. వీటన్నిటి కోసం మనం ఇతర రాష్ట్రాల మీద, ఇతర దేశాల మీద ఆధారపడుతున్నం.
పెరిగిన ఇతర పంటలు..
గత కొన్నేండ్లుగా యాసంగి సేద్యం అంటేనే వరి సాగు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఈ యాసంగి నుంచి పారాబాయిల్డ్ రైస్ ను సేకరించబోమని కేంద్రం చెప్పడంతో, రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసింది. కొన్ని ప్రాంతాల రైతులు పంట మార్పిడికి సీరియస్ గా ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల ఇతర పంటల విత్తనాలు దొరకక మళ్లీ వరే పెట్టారు. కొన్ని చోట్ల ఏ పంట వేయకుండా పొలాలను పడావ్పెట్టారు. రాష్ట్రంలో గత యాసంగిలో 52,84,187 ఎకరాల్లో వరి సాగైంది. ఈ యాసంగిలో ప్రభుత్వం వడ్లు కొనబోమని చెప్పడంతో 35,84,187 ఎకరాల్లో మాత్రమే రైతులు వరి పెట్టారు. మిగిలిన పంటల్లో గోధుమ 16,282 ఎకరాల్లో, జొన్న 1,25,809, సజ్జ 9,459, మొక్కజొన్న 5,36,449, రాగులు 2,724, కొర్రలు 771, ఇతర చిరుధాన్యాలు 357 ఎకరాల్లో సాగు చేశారు. పప్పు ధాన్యాల్లో శనగ 3,82,711 ఎకరాల్లో, పెసర38,175, మినుము 84,224, అలసందలు 20,861, ఉలవలు 1,898 ఎకరాల్లో సాగు చేశారు. నూనె గింజల్లో వేరుశనగ 3,57,211 ఎకరాలు, నువ్వులు 77,869, పొద్దు తిరుగుడు 43,258, కుసుమ18,544, ఇతర నూనె గింజలు15,872 ఎకరాలలో సాగయ్యాయి. చాలా కాలం తర్వాత వరి విస్తీర్ణం తగ్గి మిగిలిన పంటల విస్తీర్ణం బాగా పెరిగింది. ఇది మంచి పరిణామం. మొత్తంగా ఈ యాసంగిలో 54,41,985 ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ 2022 మార్చి16న ప్రభుత్వానికి సమర్పించిన వీక్లీ రిపోర్ట్ లో పేర్కొంది. సాధారణ యాసంగి సాగు 46,49,676 ఎకరాల కంటే ఇది17 శాతం ఎక్కువ. కానీ గత సంవత్సరంతో పోల్చినప్పుడు 13 లక్షల ఎకరాల్లో పంటలు తగ్గాయి. ఐసీఎంఆర్సిఫారసుల ప్రకారం నూనె గింజలు, పప్పు ధాన్యాలు రాష్ట్రంలో అందుబాటులోకి రావాలంటే వాటి సాగు మరింత పెరగాలి.
దిగుబడులపై పరిశోధనలేవి..
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో వివిధ పంటల సగటు దిగుబడులు పరిశీలిస్తే గోధుమ ఎకరానికి 824 కిలోలు, జొన్న 524 , మొక్క జొన్న 3,766 కిలోలు , రాగులు 454, ఉలవలు 283, పెసర 435, మినుము 764, కంది 403, శనగ 684, పల్లి1044 కిలోలు, నువ్వులు 251, పొద్దు తిరుగుడు 758 కిలోలుగా ఉంటున్నాయి. యాసంగి పంటల సగటు దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. వ్యవసాయ విశ్వ విద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాల్లో వీటిపై పరిశోధనలు మందగించాయి. ప్రైవేట్ కంపెనీలు అమ్ముతున్న హైబ్రిడ్ విత్తనాలు కూడా దిగుబడులు ఇవ్వడం లేదు. దీంతో రైతులు ఈ పంటల సాగు పట్ల ఆసక్తి కోల్పోతున్నారు. కనీస ఆదాయానికి గ్యారంటీ ఉండే వరి లాంటి పంటలకే రైతులు మొగ్గు చూపడానికి ఇదే కారణం.
వినియోగదారులకు మాత్రం ధర తగ్గట్లే..
యాసంగిలో పప్పు ధాన్యాలు, నూనె గింజలు ఈ సారి విస్తారంగా సాగైనా, రైతులకు మద్దతు ధరలు అందడం లేదు కానీ, వినియోగదారులకు మార్కెట్ లో వాటి ధరలు మండిపోతున్నాయి. రైతులను సహకార సంఘాలుగా, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలుగా నిర్మాణం చేసి, ఆయా సంఘాల ఆధ్వర్యంలో వాటిని నేరుగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించాలి. ఈ సంఘాల ఆధ్వర్యంలోనే పప్పు మిల్లులు, నూనె మిల్లులు ఏర్పాటు చేసి, నేరుగా వినియోగదారులకు అమ్ముకునేలా ప్రభుత్వం సహకరించాలి. అందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టగలిగితే మాత్రమే రైతులకు మద్దతు ధర అందుతుంది. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ యాసంగి తొలి రోజుల మార్కెటింగ్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, రైతులకు మద్దతు ధరలు అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. వానకాలంలో కూడా వరి, పత్తి విస్తీర్ణాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలి.
వరి విస్తీర్ణం తగ్గింది..
వరి విస్తీర్ణాన్ని తగ్గించి, ఇతర పంటల వైపు రైతులను మళ్లించాలంటే, ఆయా పంటలకు సీజన్ ప్రారంభంలో నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడంతో పాటు, సీజన్ చివరిలో రైతులకు కనీస మద్దతు ధరలు దక్కేలా, ఆయా పంటలను సేకరించాలని రైతు సంఘాలు కోరాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకపోయినా రైతులు, ఈ సారి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు. కానీ పంట పండినా.. మార్కెట్లో సరైన ధర లేక వారికి నిరాశే ఎదురవుతున్నది. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఒకటి, రెండు పంటలకు తప్ప, ప్రైవేట్ వ్యాపారులు రైతులకు ఎంఎస్‌పీ చెల్లించడంలేదు. ఇప్పటి వరకు వరి సేకరణ కేంద్రాలు కూడా తెరవక పోవడంతో 1960 రూపాయలు ధర ఉన్న వరికి వ్యాపారులు కొన్ని జిల్లాల్లో 1350 రూపాయలకు మించి ధర పెట్టడం లేదు. ఉల్లిగడ్డ లాంటి ఉద్యాన పంటలకు కూడా ధరలు రావడం లేదు. నాఫెడ్ సంస్థ మూడు పంటలు కొనుగోలు చేస్తానని ముందు చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు శనగ పంటను మాత్రమే చెప్పిన దానిలో సగం వరకు కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం యాసంగి పంటలకు ప్రభుత్వం ఎంఎస్పీ ఇవ్వడానికి అవసరమైన చర్యలు చేపట్టకపోతే, రైతులు వచ్చే సీజన్లో మళ్లీ వరి లాంటి పంటలకే వెళ్లడం ఖాయం.
ఆయా పంటల రేట్లు క్వింటాలుకు(రూలలో)
పంట మద్దతు ధర వ్యాపారులు కొంటున్నది
పెసర 7,275 6,316
శనగ 5,230 4,619
రాగులు 3,377 2,368
మినుము 6,300 5,657
కందులు 6,300 5,590
పల్లి 5,550 5,323
– కన్నెగంటి రవి , రైతు స్వరాజ్య వేదిక