
అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలకు 42 శాతం ఇస్తే తప్పేంటని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కటాను చట్టం చేసిందని, తదుపరి కర్తవ్యం కేంద్రం చేతుల్లో ఉందన్నారు. కేంద్రం ఎందుకు ఈ బిల్లును ఆమోదించడం లేదని ప్రశ్నించారు. బుధవారం (ఏప్రిల్ 2) ఢిల్లీలో జరిగిన బీసీ పోరు గర్జన మహాధర్నా గురించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను కలిసి వివరించిన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాకు 18 నుంచి 20 జాతీయ పార్టీలు సంఘీభావం తెలిపాయని అన్నారు. కానీ బీఆర్ఎస్, బీజేపీ డుమ్మా కొట్టాయని, ఓబీసీలపైన, బీసీ రిజర్వేషన్లపైన వాళ్ల చిత్తశుద్ధి అలాంటిదని అన్నారు. కిషన్ రెడ్డి, ఈటల, బండి సంజయ్ చొరవ తీసుకుని పీఎం అపాయింట్ మెంట్ తీసుకుంటే తాము వస్తామని ఈ సందర్భంగా అన్నారు. లేదంటే తమతో పాటు కలిసి రావాలని కోరారు.
తెలంగాణలో తమ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. బీసీ బిల్లును ఆమోదించి ఉద్యోగాలు, చట్టసభలలో బీసీలకు ప్రాతినిధ్యం ఉండేలా సహకరించాలని కేంద్రాన్ని కోరారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ ప్రధాని అని చెప్పుకుంటూ మోదీ.. బీసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మూడో సారి అధికారంలోకి వచ్చినా కూడా ఓబీసీలకు ఏమీ చేయలేకపోయారు మోదీపై మండిపడ్డారు.
మంత్రి వర్గ విస్తరణ త్వరలోనే ఉంటుందని, బీసీలకు మరో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఉన్నారని, మరో ఇద్దరికి అవకాశం కల్పించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు.