ఫారెస్ట్ ఆఫీసర్లకు రక్షణేది?.. దాడులకు పాల్పడుతున్న అక్రమార్కులు

మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సెక్షన్, బీట్ ఆఫీసర్లు, స్ట్రైకింగ్ ఫోర్స్ స్టాఫ్ కు రక్షణ కరువైంది. అటవీ భూములతో పాటు అక్కడ ఉన్న చెట్లు, మట్టి, రాళ్లు, వన్యప్రాణులను కాపాడడమే వీరు చేసిన తప్పవుతోంది. ఫీల్డ్ విజిట్‌లో భాగంగా మట్టి, రాళ్ల అక్రమ రవాణాను అడ్డుకుంటున్న వీరిపై కొందరు దాడులకు దిగుతున్నారు. తాము ఎమ్మెల్యే, ఫలానా లీడర్‌‌ అనుచరులం.. మమ్మల్ని అడ్డుకుంటారా..? మా ట్రాక్టర్‌‌నే పట్టుకుంటారా..? అని బెదిరిస్తున్నారు. అంతేకాదు అసభ్య పదజాలంతో దూషిస్తూ కర్రలతో, రాళ్లతో దాడులు చేస్తున్నారు.

10,500 హెక్టార్ల అటవీ విస్తీర్ణం

మిర్యాలగూడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 15 బ్లాక్‌లు ఉన్నాయి. దామరచర్ల, కాల్వాపల్లి, తుంగ పహాడ్ సహా 14వ మైల్ తిరుమల గిరి సాగర్, కృష్ణా పరివాక ప్రాంతం వరకు దాదాపు 10, 500 హెక్టార్ల మేర అడవి విస్తరించి ఉంది. మిర్యాలగూడ ఎఫ్ ఆర్‌‌వో ప్రస్తుతం 8 మంది బీట్, ఇద్దరు సెక్షన్ అధికారులు, 10 మంది స్ట్రైకింగ్ ఫోర్స్ విధులు నిర్వహిస్తుండగా.. మరో 7 ఫారెస్ట్ బీట్, ఒక సెక్షన్ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

లోకల్ ప్రజాప్రతినిధుల సపోర్టుతోనే..

అటవీ భూములతో పాటు విలువైన అటవీ సంపద, వన్యప్రాణాలను కాపాడుతున్న ఫారెస్ట్ అధికారులపై అక్రమార్కులు లోకల్ ప్రజాప్రతినిధుల అండతో దాడులకు దిగుతున్నారు. మూడేళ్లలో నాలుగు సార్లు దాడులు చేయడం గమనార్హం. 2020లో ముది మాణిక్యం ఫారెస్ట్ బ్లాక్ నుంచి రాళ్లను తరలిస్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో 21 మంది దాడి చేసి గాయపరిచారు. ఇదే ఏడాది కల్లేపల్లి, గాంధీనగర్ ఏరియాల్లో ఫారెస్ట్ భూమి ఆక్రమణలను అడ్డుకునేందుకు...వెళ్లిన ఆఫీసర్లపై దాడులు చేసి గ్రామ పంచాయతీలో బంధించారు. 2021లో రాగడప ఫారెస్ట్ పరిధిలోని పాల్తీ తండాలో డోజర్‌‌తో ల్యాండ్ చదును చేస్తుండగా... అడ్డుకున్న బీట్‌ అధికారి ప్రవీణ్ రెడ్డిపై దాడి చేశారు. తాజాగా ఈ నెల 1న ఇదే అధికారి మిర్యాలగూడ మండలం కాల్వాపల్లి ఫారెస్ట్ బ్లాక్ నుంచి మట్టి తరలిస్తుండగా అడ్డుకోగా... ఇటుక బట్టీ వ్యాపారితో పాటు మరో ఇద్దరు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలపై కేసులు నమోదైనా దాడులు మాత్రం ఆగడం లేదు. 

కేసులు వద్దని ఒత్తిడి

ఇటీవల దామరచర్ల మండలం గంగ దేవరగట్టు ఫారెస్ట్‌లో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ ఎస్ కె నాగుల్ మీర రెండు ఎకరాల భూమిని ఆక్రమిస్తుండగా.. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఫీల్ట్‌కు వెళ్లి జేసీబీని స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కానీ ఆ జేసీబీని వదిలిపెట్టాలని నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి ఫారెస్ట్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దామరచర్ల మండలం బాండవత్‌ తండా పరిధిలోని దిలావర్ పూర్ ఫారెస్ట్ లో భూమిని ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేయవద్దని హైదరాబాద్‌లో విధులు నిర్వర్తించే ఓ ఎస్సై, నాగర్ కర్నూల్‌లో పనిచేసే కానిస్టేబుల్ ఫారెస్ట్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. పాల్తీ తండా, గంగ దేవమ్మ గుట్ట భూముల ఆక్రమణ విషయంలోనూ ఇదే పరిస్థితి ఉందని ఓ ఫారెస్ట్ అధికారి తెలిపారు. 

ముగ్గురికి రిమాండ్

మిర్యాలగూడ, వెలుగు : ఫారెస్ట్‌ బీట్ ఆఫీసర్‌‌ చింత ప్రవీణ్‌ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌ చేశారని డీఎస్పీ వెంకటగిరి తెలిపారు. శనివారం రూరల్ పీఎస్‌లో కేసు వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్‌‌కు చెందిన ఇటుక బట్టి వ్యాపారి గుంజ  సుబ్బారావు, అతని డ్రైవర్ భూక్యా వీరభద్రు, బంధువు మన్నెం అమర నాథ్  సెప్టెంబర్‌‌ 1న కాల్వపల్లి ఫారెస్ట్  బ్లాక్‌లో అక్రమంగా ప్రవేశించారు.  ఇక్కడ మట్టి తవ్వి ఆలగడప శివారులో ఉన్న ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. డ్యూటీలో భాగంగా అక్కడికి వెళ్లిన  బీట్ అధికారి ప్రవీణ్ రెడ్డి ట్రాక్టర్‌‌ను పట్టుకున్నారు. దీంతో సుబ్బారావుతో, అతని డ్రైవర్, బంధువు కలిసి  బీట్ ఆఫీసర్‌‌ను కర్రతో కొట్టారు.  అనంతరం ప్రవీణ్ రెడ్డి ఫిర్యాదు మేరకు వీరిపై 332, 324, 504, 506, 189, 186, ఫారెస్ట్ యాక్ట్ సెక్షన్ 20 ప్రకారం కేసు చేసి రిమాండ్ చేసినట్లు డీఎస్పీ చెప్పారు. అలాగే సుబ్బారావుపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్లు  తెలిపారు. 


ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయాలి 

ఫారెస్ట్ భూముల రక్షణకు ఫీల్డ్ మీదకు వెళ్తున్న సిబ్బందిపై దాడులను నిరోధించేందుకు ప్రభుత్వం ఫారెస్ట్ శాఖ పరిధిలో సెక్షన్ల వారీగా ప్రత్యేక ఫారెస్ట్  స్టేషన్లు ఏర్పాటు చేయాలి. ఫారెస్ట్ యాక్ట్ ‌‌ల కింద నమోదైన కేసుల్లో నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్ష విధించాలి. స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీసులు మాకు సహకరించాలి

- చింతల ప్రవీణ్ రెడ్డి, బీట్ ఆఫీసర్