కోర్ట్ ఆఫ్ రికార్డ్ అమలుకు దారేది?

కోర్ట్ ఆఫ్ రికార్డ్  అమలుకు దారేది?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామక ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన జీవో 29 విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.  నిరుద్యోగ యువత నిరసన కార్యక్రమాలకు ప్రతిపక్ష పార్టీలు ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ మద్దతు ఇవ్వడంతో అది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పత్రికలన్నీ పతాక శీర్షికలో కథనాల్ని ప్రచురించాయి. ఆ జీవో వల్ల సామాజిక రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందని రద్దు చేయాల్సిందేనని పలు కులసంఘాల నాయకులు, మేధావులు సోషల్ మీడియా వేదికగా పట్టుబడుతున్నారు. 

మరోపక్క జిల్లా కేంద్రాలలో బీసీ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్న కింది కోర్టులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సైతం పెడచెవిన పెడుతున్నాయని అది ‘కోర్ట్ ఆఫ్ రికార్డ్’ ను ముమ్మాటికి ఉల్లంఘించడమే అవుతుందని పలువురు రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల విషయంలో పైకోర్టు ఇచ్చిన పలు తీర్పులలో కింది కోర్టుల ద్వారా అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ‘కోర్ట్ ఆఫ్ రికార్డ్’గా పరిగణిస్తారు. దానికి వ్యతిరేకంగా కింది కోర్టులు తీర్పులు ఇవ్వరాదు. అయితే ఆచరణలో మాత్రం అది విరుద్ధంగా కనబడుతున్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలుకు నోచుకోవడం లేదు. 

దీనికి అనేక దృష్ట్యాంతాలు వెలుగులోకి వచ్చాయి. సామాజిక రిజర్వేషన్లకు చెందిన అభ్యర్థులు ఓపెన్ కోటాలో అవకాశం పొందిననూ వారిని రిజర్వేషన్ కేటగిరీ కింద పరిగణించరాదని సౌరవ్ యాదవ్ కేసులో పేర్కొనగా, సామాజిక రిజర్వేషన్లను అన్ని స్టేజీలలో అమలు చేయాలని దీపేందర్ యాదవ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ రెండు తీర్పులను విభేదిస్తూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 29 అందుకు విరుద్ధంగా ఉన్ననూ, దానిపై తలెత్తిన వివాదానికి హైకోర్టు పరిష్కారం చూపకపోగా తాత్సారం చేస్తోందని సామాజికవేత్తలు, రాజ్యాంగ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు

 మండల్ తీర్పుగా పరిగణించే ఇందిరా సహాని కేసులో సామాజిక రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిన తమిళనాడు రిజర్వేషన్లకు తప్ప మిగతావాటికి ఇది వర్తిస్తుంది. రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే రిజర్వేషన్ల పెంపు చేయాలి. కానీ దానికి విరుద్ధంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వము ఒక జీవో ద్వారా ఎస్టీ రిజర్వేషన్లను 6% నుండి 10% కు పెంచింది. 

దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ సింగిల్ బెంచ్ నుండి డివిజనల్ బెంచ్​కి, డివిజనల్ బెంచ్ నుండి సింగిల్ బెంచ్​కి బదిలీ అవుతూ ఊగిసలాడుతోందే తప్ప పరిష్కారానికి నోచుకోవట్లేదు. మరో పక్క ఉద్యోగ భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ రాష్ట్రాలు అమలు పరుస్తున్న రోస్టర్ విధానాలకు మార్గదర్శక సూత్రాలను సుప్రీంకోర్టు 1996 ఆర్కే సబర్వాల్ కేసులో వెలువరించింది. ఒక కేడర్​కు చెందిన ఏదేని ఒక రిజర్వేషన్ కేటగిరీ 100% స్థాయి పొందితే ఆ తరువాత ఏర్పడ్డ ఖాళీలలో ఓపెన్/రిజర్వేషన్ కేటగిరిలను గుర్తించి సంబంధిత అభ్యర్థుల ద్వారా భర్తీ చేయాలి. 

రిజర్వేషన్​ అమలులో  వివాదాలు

 ఒక కేడర్ స్ట్రెంత్ మొత్తం 200 పోస్టులు ఉన్నాయంటే ఎస్సీలకు 30(15%), ఎస్టీలకు 12(6%), బీసీలలో అన్ని గ్రూపులకు కలిపి 58(29%) వచ్చేవరకు రోస్టర్ విధానం అమలులో ఉంటుంది. ఆ తర్వాత కేడర్ లో ఏర్పడ్డ ఖాళీలో ఏ స్థానాల్లో ఖాళీ ఏర్పడితే సంబంధిత ఓపెన్/రిజర్వేషన్ అభ్యర్థులతో అంటే ‘పోస్ట్ బేస్డ్ రిజర్వేషన్’ విధానంలో భర్తీ చేయాలని స్పష్టంగా ఉన్ననూ దానికి విరుద్ధంగా ఏర్పడ్డ ఖాళీలను బట్టి రిజర్వేషన్ విధానం అంటే 100 పాయింట్స్ సైకిల్ రోస్టర్ ద్వారా ‘వేకెన్సీ బేస్డ్​ రిజర్వేషన్’ ను అమలుపరుస్తున్నారు. దీన్ని సరిచేయవలసి ఉన్నది. ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసే విషయంలో కూడా వివాదం రోజురోజుకు రాజుకుంటూనే ఉన్నది. 

బీసీ,ఎస్సీ,ఎస్టీ సామాజిక రిజర్వేషన్లు పోనూ మిగిలిన 50% ఓపెన్ కోటాలో మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల తీర్పు వెలు వర్చింది. మరోపక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రత్యేక రిజర్వేషన్లని వాటిని హారిజాంటల్​గా అమలు చేయాలని తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది. దానిపై కూడా కోర్టులు ఇంకా ఇంతవరకు ఏమీ తేల్చలేదు. ‘న్యాయం ఆలస్యం అవ్వడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే’ అవుతుందని పలువురు న్యాయ కోవిదులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కోర్ట్ ఆఫ్ రికార్డ్’ను గౌరవిస్తూ కింది కోర్టులు సకాలంలో తీర్పులు వెలువర్చి ఏకీకృత న్యాయ వ్యవస్థను కాపాడాలని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

కోర్టు తీర్పులపై ఉదాసీనత

  రాజేష్ కుమార్  దారియా కేసులో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన తీర్పు వెలువడింది.  బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రమే సామాజిక రిజర్వేషన్లు వర్తిస్తాయని, వాటిని వర్టికల్​గా అమలు చేయాలని మిగిలిన రిజర్వేషన్లు అన్నీ ప్రత్యేక రిజర్వేషన్లుగా పరిగణిస్తూ వాటిని హారిజాంటల్​గా అమలు చేయాలని పేర్కొంది.  తెలంగాణ  ప్రభుత్వంహారిజాంటల్ రిజర్వేషన్​ను అమలు చేయకపోవడాన్ని సవాలు చేయగా వాద ప్రతి వాదనలు జరిగాక మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్లను వర్తింపజేశారు. వికలాంగుల కోటాకు, స్పోర్ట్స్ కోటాలకు కూడా వర్తింప చేయకపోగా వర్టికల్ విధానాన్నే అనుసరిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా సవాలు చేస్తూ మరో పిటిషన్ దాఖలు అయ్యింది. ఇప్పటికీ సుమారు 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు తీర్పు వెలువడలేదు. 

-భాస్కర్ యలకంటి,సోషల్​ ఎనలిస్ట్​-