కరోనా కేసులు పెరగటం.. హైకోర్టు సీరియస్ కావటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉండనుంది. తాజా ఆదేశాల ప్రకారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ రాత్రి కర్ఫ్యూ అమలు కానుంది. కర్ఫ్యూ నుంచి ఎమర్జెన్సీ సేవలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఫార్మసీలు, ల్యాబ్‌లు, మీడియా, పెట్రోల్ బంక్‌లు, శీతల గిడ్డంగులు, గోదాములు, అత్యవసర సర్వీసులకు ఈ మినహాయింపు ఉంది. వ్యాలిడ్ టికెట్‌తో విమాన, రైలు, బస్సు ప్రయాణికులకు కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. బార్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు రాత్రి 8 గంటలలోపు మూసేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. నిర్దేశించిన టైంలోనే పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకు అనుమతిచ్చింది. అంతర్రాష్ట్ర రవాణాకు ఎలాంటి అనుమతులు అవసరంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కరోనా నియంత్రణలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు మండిపడింది. 10 రోజుల సమయం ఇచ్చినా ఏ ఒక్క ఆదేశం అమలు చేయలేదని తప్పుపట్టింది. మీరు చేయకపోతే మేం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాజకీయ ర్యాలీలు.. బార్లు.. సినిమా హాళ్లు... పెళ్లిళ్లు.. అంత్యక్రియల్లో రద్దీని ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించింది. ‘మద్యం దుకాణాలతో వచ్చే ఆదాయంపై ఉన్న దృష్టి ప్రజల ప్రాణాలపై లేదా? వారంరోజుల్లో కేసులు రెట్టింపయ్యాయి. ఇంట్లోనే రక్షణ ఉండడంలేదు’ అని పేర్కొంది. కోర్టుకు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు ఇవ్వకపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలతో పాటు జిల్లాలవారీగా పరీక్షలు, పాజిటివ్‌లు కేసుల గురించి వివరాలడిగితే ప్రభుత్వం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేసింది. ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కొరతపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాత్రిపూట లేదా వారాంతాల్లో కర్ఫ్యూ వంటి నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోలేదని.. మీరు చర్యలు తీసుకుంటారా.. మమ్మల్ని ఆదేశాలివ్వమంటారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దాంతో ప్రభుత్వం హైకోర్టు వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకొని కర్ఫ్యూపై విధించింది.