- కామారెడ్డిలో కలకలం సృష్టించిన ఎస్సై, మహిళా కానిస్టేబుల్, మరో వ్యక్తి సూసైడ్
- చెరువులో నుంచి ఎస్సై డెడ్ బాడీ కూడా వెలికితీత
- కీలకంగా మారిన పోస్టుమార్టం రిపోర్టులు, సెల్ ఫోన్ల డేటా
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, మరో వ్యక్తి చెరువులో పడి మృతి చెందడం కలకలం సృష్టించింది. వీళ్లు ముగ్గురూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు బలమైన కారణం ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే అది ఏంటన్నది మిస్టరీగా మారింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్ఐ సాతెల్లి సాయికుమార్( 31), బీబీపేట పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శృతి (28), బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న తోట నిఖిల్(28).. సదాశివనగర్మండలం అడ్లూర్ఎల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
వీరిలో శృతి, నిఖిల్మృతదేహాలు బుధవారం అర్ధరాత్రి, ఎస్ఐ సాయికుమార్ మృతదేహం గురువారం ఉదయం లభించింది. ముగ్గురి మృతదేహాలకు కామారెడ్డి జిల్లా హాస్పిటల్లో పోస్టుమార్టం చేశారు. అనంతరం డెడ్ బాడీలను కుటుంబసభ్యులకు అప్పగించగా సొంతూళ్లకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఎస్సై, కానిస్టేబుల్డెడ్ బాడీలపై పోలీస్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ హాస్పిటల్‌కు వచ్చి మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. తన బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదని శృతి తండ్రి పుండరీకం అన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని సాయికుమార్ తండ్రి అంజయ్య అన్నారు.
ముగ్గురి మధ్య పరిచయం ఉందా?
మెదక్ జిల్లా కొల్చారానికి చెందిన సాయికుమార్ 2018లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఏడాది క్రితం కామారెడ్డి జిల్లాలోని బీబీపేట పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం భిక్కనూరు ఎస్సైగా ఉన్నారు. ఈయనకు భార్య లక్ష్మీ, మూడేండ్ల కొడుకు ఉన్నారు. లక్ష్మీ ప్రస్తుతం గర్భవతి. ఇక మహిళా కానిస్టేబుల్శృతిది గాంధారి మండల కేంద్రం. పదేండ్ల కింద ఉద్యోగంలో చేరిన ఈమె.. పెండ్లయిన తర్వాత కొన్నాళ్లకు భర్తతో విడాకులు తీసుకుంది. మూడేండ్లుగా బీబీపేట స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నది.
సాయికుమార్ బీబీపేటలో పని చేసినప్పుడు శృతి అక్కడే కానిస్టేబుల్‌గా ఉంది. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మరోవైపు బీబీపేటకు చెందిన నిఖిల్.. కంప్యూటర్లు కూడా రిపేర్ చేస్తుంటాడు. ఈ క్రమంలో పోలీస్స్టేషన్లలో కూడా కంప్యూటర్ రిపేర్లు చేస్తున్నాడు. ఇతని ఇంటికి సమీపంలోనే శృతి కిరాయికి ఉంటున్నది. కాగా, వీళ్ల ముగ్గురి మధ్య పరిచయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ రోజు ఎం జరిగింది?
కానిస్టేబుల్శృతి బుధవారం పొద్దున డ్యూటీ కంప్లీట్ అయిన తర్వాత తన సొంతూరు గాంధారికి వస్తున్నట్టు ఫోన్లో తల్లి విజయకు చెప్పింది. కొద్ది సేపటికి ఫోన్‌చేస్తే తాను సగం దూరం వచ్చానని, కానీ డ్యూటీ ఉందని మళ్లీ స్టేషన్ కు రమ్మంటున్నారని తెలిపింది. మధ్యాహ్నం తర్వాత ఫోన్‌చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఎస్సై సాయికుమార్ బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తన సొంత కారులో క్వార్టర్ నుంచి బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నాననేది ఎవరికీ చెప్పలేదు. వెళ్లేటప్పుడు తాళం కూడా వేయలేదని తెలిసింది.
ఆయన నాలుగు రోజుల క్రితమే భార్య లక్ష్మీని ఇంటి దగ్గర దింపి వచ్చారు. బుధవారం పొద్దున కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడినప్పుడు ఇంటికి వస్తానని చెప్పారు. ఇక నిఖిల్ 11 గంటల వరకు బీబీపేటలోనే ఉన్నాడు. ఇంట్లో తిని బయటకు వెళ్లాడని తల్లి స్వరూప తెలిపింది. కాగా, శృతి ఫోన్ కలవకపోవడంతో కుటుంబసభ్యులు బీబీపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఉన్నతాధికారులకు విషయం తెలిసి సెల్‌ఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా వెరిఫై చేయగా, లోకేషన్ అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఏరియాలో చూపెట్టింది. అక్కడికి సిబ్బంది వెళ్లి చూడగా చెరువు ఒడ్డున సెల్ఫోన్దొరికింది.
సమీపంలోనే ఎస్సై సాయికుమార్కారు ఉంది. అందులో శృతి బ్యాగు ఉన్నట్టు సమాచారం. ఎస్సై సెల్ఫోన్అతని ప్యాంట్ జేబులోనే ఉండగా.. మిగతా ఇద్దరి ఫోన్లు చెరువు గట్టున దొరికాయి. కాగా, వీళ్లు ముగ్గురు కారులోనే వచ్చినట్టు అనుమానిస్తున్నారు. అసలు వీళ్లు ముగ్గురు ఎక్కడ కలుసుకున్నారు? చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ఏదైనా విషయంలో గొడవ జరిగి ఆత్మహత్య చేసుకున్నారా? అనేది తేలాల్సి ఉంది. ఈ కేసు దర్యాప్తులో మృతుల సెల్ ఫోన్లు, పోస్టుమార్టం రిపోర్టులు కీలకం కానున్నాయి. వీళ్లు ఎలా కలిశారు? అనేది సెల్ ఫోన్ డేటా ద్వారా తెలిసే అవకాశం ఉంది.
ఎంక్వైరీ చేస్తున్నం..
ముగ్గురి మృతిపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నం. మరణాలకు కారణాలు ఇంకా తెలియలేదు. పోస్టుమార్టం రిపోర్టు, ఎంక్వైరీ తర్వాతే ఏం జరిగిందనేది తెలుస్తుంది.
– ఎస్పీ సింధూశర్మ