
వినాయకుడికి పాలవెల్లి అలంకరణమే ఒక చక్కని అనుభూతి. మొక్కజొన్న పొత్తులు, వెలగ, కమల మొదలైన పళ్ళు, కాయలు పాలవెల్లి నుండి వ్రేలాడదీసి, మామిడి తోరణాలు, చిన్న అరటి మొక్కలు మొదలైన వాటితో అలంకరించి సర్వసస్యాధిదేవునిగా సర్వ లోకేశ్వరునిగా వినాయకుని పూజిస్తారు. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే...
వినాయకచవితి రోజు పూజలో పాలవెల్లి కడతారు. ఈ పూజలో పాలవెల్లికి ఎంతో విశిష్టత ఉంది. అయితే పాలవెల్లికి ఏ పండ్లు కట్టాలి? తరువాత వాటిని ఏం చేయాలి? అనే అనుమానం చాలామందిలో ఉంటుంది.
గణపతి అంటే గణాలకు అధిపతి , తొలిపూజలందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే కదా! ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అన్నమాట.. అలా పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతికగా భావించవచ్చు.
వినాయకచవితి అందరూ ఇష్టమైన పండుగ. భక్తితో ఆరోజు గణపతిని పూజిస్తారు. పూజలో పాలవెల్లిని ఖచ్చితంగా కడతారు. ఇది లేకపోతే గణపతి పూజ లోటుగా అనిపిస్తుంది. ఆకాశంలోని నక్షత్రాల సమూహాన్ని పాలపుంత అంటాం. దీనిని పాలవెల్లితో పోలుస్తారు. పాలవెల్లిని పాలపుంత అనుకుంటే అందులో ఉండే నక్షత్రాలు మనం కట్టే కాయలు, పండ్లుగా చెబుతారు.
పాలవెల్లికి వెలగపండు, మారేడు కాయ, బత్తాయి, మొక్కజొన్నపొత్తులు, మామిడి పిందెలు, జామ, దానిమ్మ వంటి ఈ సీజన్‌లో దొరికే అన్నింటినీ కడతారు. వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే. అందుకే ఆకులతో పూజ చేస్తారు.
Also Read :- వినాయక నిమజ్జనం వెనుక రహస్యం ఇదే..
పాలవెల్లి అంటే పాలపుంతే అని మరి అందులో నక్షత్రాలను సూచించేందుకు వెలగపండుని కడతాము. దాంతో పాటుగా మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామ, మారేడు, దానిమ్మలాంటి పండ్లనీ కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట.
మట్టి వినాయకుడికి పాలవెల్లి ఏర్పాటు చేసి వెలగ, జిల్లేడు, మారేడు, మామిడి, రేగు, ఉత్తరేణి వంటి 21 రకాల పత్రితో పూజించాలని అంటారు. గరికతో పూజిస్తే చాలు వినాయకుడు విజయాలు ఇస్తాడని శాస్త్రం చెబుతోంది.
ప్రకృతిలో సృష్టి, స్థితి, లయ అనే మూడు స్థితులు ఉన్నట్లే గణేశుని పూజ ఈ మూడు స్థితులకూ ప్రతీకలని చెబుతుంది. ఈ భూమిని (సృష్టి) సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని (స్థితి) సూచించేందుకు పత్రినీ, ఆకాశం(లయం) సూచించేందుకు పాలవెల్లిని ఉంచి పూజిస్తారు.
పాలవెల్లి చతురస్రాకారంలో ఉంటుంది. అంటే నాలుగు దిక్కులు. అన్ని దిక్కుల్లో ఉండే దేవతలను పూజించినట్లే. పసుపు రాసి.. కుంకుమబొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది.
ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా! పైగా గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లిని అమర్చుతారు
పాలవెల్లికి పూజలు చేసిన తరువాత వాటికి కట్టిన పండ్లను ఏం చేయాలని చాలామందిలో అనుమానం ఉంటుంది. ఆ పండ్లను కాలువలో నిమజ్జనం చేయవచ్చు. ఒకరోజే ప్రతిమను ఉంచేవారు ఆ పండ్లను తినవచ్చు. పత్రిని కాలువలో కలపాలి. ఇంట్లో వినాయక పూజ పూర్తి చేసుకున్నాక ... మూడు వినాయకుని మండపాలను దర్శించాలి.