సంఘ్కు బీజేపీకి మధ్య సంబంధం ఎంత.?

సంఘ్కు  బీజేపీకి మధ్య సంబంధం ఎంత.?

2024 లోక్​సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది.  ‘అబ్​కీ బార్​.. చార్​ సౌ పార్’​ అన్నప్పటికీ బీజేపీ 240 స్థానాల దగ్గరే ఆగిపోయింది.  దీంతో  సంఘ్​ వైపు కొందరు వేలెత్తి చూపడం మొదలుపెట్టారు. నాగపూర్​లో జరిగినఓ కార్యక్రమంలో  సంఘ్​చాలక్​ మోహన్​ భాగవత్​ ప్రసంగంలో  చేసిన వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించి  అన్నట్లుగా కాంగ్రెస్​, వామపక్ష చానల్స్​ విపరీత ప్రాచుర్యం కల్పించాయి.  రైట్​ వింగ్​లో ప్రముఖుడైన రతన్​ శారదా ఆర్గనైజర్​లో రాసిన ఓ వ్యాసం కొంత హెచ్చరికలా కనిపించింది. ఈ రెండూ బీజేపీని ఉద్దేశించి చేసిన హెచ్చరికలుగా ప్రచారంలోకి వచ్చాయి. కొందరు మోదీ, షా గర్విష్టులుగా చూపేందుకు ఈ వ్యాఖ్యలు ఉపయోగించుకున్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే బీజేపీ నాయకులతో బీఎల్​ సంతోష్ , అరుణ్, దత్తా, సురేశ్​ సోనీ సమావేశం వాడివేడిగా జరిగిందని పుకార్లు పుట్టించారు. సంఘ్​ మూల భావన తెలిసినవాళ్లెవరూ ఇలాంటి ఊహాగానాలు కల్పన చేయరు. సంఘానికి ఓ నిర్దిష్ట లక్ష్యం ఉంది. అది దేశం పరమ వైభవ స్థితి. సంఘ్​కు రాజకీయం ఓ సాధనం. కానీ లక్ష్యం ఎంతమాత్రం కాదు. దేశాన్ని ప్రేమించే ఎవరినైనా సంఘ్​ ప్రేమిస్తుంది. 


గాంధీ  హత్య తర్వాత ఆర్ఎస్ఎస్​ను  నిషేధించి  గురూజీని  అరెస్టు చేసి  50వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను నిర్బంధించారు.  హిందూ మహాసభ కన్నా ఎక్కువ  వివక్షకు  సంఘ్ గురైంది.  సుప్రీంకోర్టు నిజ నిర్ధారణ తర్వాత సంఘ్​పై  నిషేధం  తొలగింది.  అయితే, ఆర్ఎస్ఎస్​ నిషేధానికి గురై ప్రభుత్వం చేతిలో విధ్వంసం అవుతున్నప్పుడు ఆనాడు ఉన్న ఏ నాయకుడు,  పార్టీ సంఘ్​వైపు నిలబడలేదు. ఇదంతా సంఘ్​లోని అగ్రశ్రేణి నాయకులను ‘అధికారం–రాజకీయం’వైపు ఆలోచింపజేసినా కార్యాచరణ జరగలేదు. అప్పుడు జరిగిన చర్చల్లో ప్రస్తావన వస్తే మాధవ సదాశివ గోల్వాల్క ర్ గురూజీ ​మాట్లాడుతూ.. ‘సంఘ్​ స్వయంగా రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనదు. అదేవిధంగా  ఏ రాజకీయపక్షానికి అనుబంధ సంస్థగా పనిచేయదు’ అన్నారు.  ఆయన మాట ఈ రోజుకూ సంఘ్​ పాటిస్తోంది. ఈ అవగాహనలేనివారు సంఘ్​కు   లేనిపోని రాజకీయాలు అంటగడుతుంటారు. జాతి సమగ్ర,  సాంస్కృతిక పునరుజ్జీవనం  సంఘ్​ లక్ష్యం. 1930ల్లో డాక్టర్జీని శ్యామాప్రసాద్​ ముఖర్జీ కలిసినా..‘దైనందినరాజకీయాలపై మాకు విశ్వాసం లేదు’ అని ఆయన ముఖంమీదే చెప్పేవారు. 

జనసంఘ్ ఆవిర్భావం

సంఘ్ తీవ్ర నిర్బంధం తర్వాత గమనించి ఢిల్లీ ప్రాంత ప్రచారక్​ వసంతరావులాంటి వాళ్ల ద్వారా ముఖర్జీ  గురూజీని కలిశారు.  నూతన రాజకీయ పక్షానికి  పరోక్ష సహకారం  ఇస్తూనే  తమ  జాతీయ  పునర్నిర్మాణ కార్యక్రమం  కొనసాగిస్తామని  చెప్పారు. 1951 జనవరి తర్వాత శ్యామాప్రసాద్​ ముఖర్జీ ప్రయత్నంలో భాగంగా భారతీయ జనసంఘ్​ రూపొందింది.  మొదటితరంలో దీనదయాళ్​ ఉపాధ్యాయ, బలరాజ్​ మధోక్,  నానాజీ  దేశ్​ముఖ్,  ఏబీ వాజ్ పేయి,  ఎల్​కే  అద్వానీ వంటివారు  సంఘ్​వైపు నుంచి పార్టీలో కీలకంగా మారారు. 1951 మే 23 నాడు జనసంఘ్​ ప్రతినిధుల సభ జలంధర్​లో జరిగితే హోర్డింగ్​ బాంబుల కేసులో  అండమాన్​లో యావజ్జీవ శిక్ష విధించబడిన విప్లవకారుడు బల్​రాజ్​ భల్లా (పంజాబ్) అనే విద్యావేత్త అధ్యక్షుడిగా,  బల్​రాజ్​మధోక్​ (ఆర్​ఎస్ఎస్) కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలా జనసంఘ్​ ప్రారంభమైంది. 

జనతా ప్రయోగం..బీజేపీ ఆవిర్భావం

1973లో  నవ  నిర్మాణ సమితి పేరుతో గుజరాత్​కు చెందిన చంద్రకాంత్​ శుక్ల నేతృత్వంలో  మొదలైన కాంగ్రెస్​ వ్యతిరేక ఉద్యమం జేపీ నేతృత్వంలో  దేశాన్ని కదిలించింది. ఇది  సరికొత్త  రాజకీయ సమీకరణలకు  దారితీసింది. జేపీ ఆధ్వర్యంలో 25 జూన్​ 1975 నాటి సంపూర్ణ క్రాంతి శంఖారావంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం అతలాకుతలమైంది. దాంతో  ఆమె దేశంలో  ఎమర్జెన్సీ ప్రకటించి 27 సంస్థలను నిషేధించింది. అందులో ఆర్ఎస్ఎస్​ కూడా ఉంది.  ఇందిరాగాంధీ జైల్లో  బంధించిన వారిలో 107మంది ప్రాణాలు కోల్పోతే, అందులో 55మంది ఆర్ఎస్ఎస్​, జనసంఘ్​ వాళ్లే. 1977 ఎమర్జెన్సీ తర్వాత ఆర్ఎస్ఎస్,  జనసంఘ్​ చేసిన ప్రజాస్వామ్యయుత పోరాటం ఈ సంస్థలపై ప్రజలకు, పార్టీలకు నమ్మకం కల్పించాయి.  జనసంఘ్, స్వతంత్ర పార్టీ, జయప్రకాశ్​ నారాయణ్,​ మొరార్జీ కలిసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి. తర్వాత చరణ్​సింగ్​ వెన్నుపోటు దెబ్బకు 1979లో మొరార్జీ  జనతా ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం జరిగిన అనేక పరిణామాల మధ్య 1980 డిసెంబర్​ 28న బొంబాయిలో 54,632మంది  ప్రతినిధులతో  భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది.  

సంఘ్– బీజేపీ

‘ ఈ కొత్తపార్టీ ఆర్ఎస్ఎస్​తో పార్టీపరంగా  ఎలాంటి సంబంధాలు పెట్టుకోదు.  సంఘ్​తో  సంబంధం కలిగి ఉండటం వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం’  అని ఓ సందర్భంలో  అద్వానీ తేల్చేశారు. బీజేపీ ‘గాంధీయన్​ సోషలిజం’  వాజ్​పేయి నేతృత్వంలో నడుపుతూ వచ్చింది. అది సిద్ధాంతంగా అందరికీ అర్థం కాలేదు. అయితే రాజకీయ వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నం  సంఘ్​ ప్రత్యక్షంగానో,  పరోక్షంగానో చేస్తూ వచ్చింది.  జనసంఘ్​లోకి పంచపాండవుల్లాంటి  యోధులను  పంపినట్లే  అనేకమందిని బీజేపీలోకి  సంఘ్​ పంపింది.  అలాగే సందర్భం వచ్చినప్పుడు సంఘ్​ నిరసన కూడా తెలుపుతుంది. అది ద్వేషపూరితంగా  కాకుండా వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నం.  2003లో వాజ్​పేయి ప్రభుత్వం   బీఎంఎస్  వ్యవస్థాపకుడైన దత్తోపంథ్​ ఠేంగ్డే  కు పద్మభూషణ్​ ఇవ్వాలనుకుంటే సున్నితంగా తిరస్కరించారు.

 స్వతంత్ర సంస్థలుగా ఆర్ఎస్ఎస్, వీహెచ్​పీ

1980కి ముందు ఎన్నికల ప్రచారం కోసం సంఘ్​ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారు. 1983నాటి  ఢిల్లీ ఎన్నికల తర్వాత అప్పటి తీవ్రత  తగ్గింది.  గతంలో  ప్రజాప్రతినిధులుగా ఉన్న  సంఘ్ కార్యకర్తలు కూడా స్తబ్దుగా ఉండిపోయారు. ఆఖరుకు  జనసంఘ్​కు  బలమైన  ఓటుబ్యాంక్​గా  ఉన్న  పంజాబీ  హిందువులు ఎదురు తిరిగారు. పార్టీ  ఘోర పరాజయం పాలైంది. వాజ్​పేయి రాజీనామా చేసేంతవరకు వెళ్లింది. ఇంకెప్పుడూ ఆర్ఎస్​ఎస్​ శక్తిమీద ఆధారపడకూడదని అగ్రనాయకులు ఆలోచించే స్థితి కూడా వచ్చింది. దీంతో ఆర్ఎస్ఎస్, వీహెచ్​పీలు స్వతంత్రంగా మారిపోయి తమ సంస్థల స్వేచ్ఛను కొనసాగిస్తున్నాయి  అని విశ్లేషకులు  చెప్పారు.  బంగ్లాదేశ్​ ఏర్పాటు, అణుపరీక్షలు బహుశా సంఘ్​కు  ఇందిరాగాంధీని నచ్చేటట్లు చేసి 
ఉండవచ్చని ఓ ప్రముఖ  రచయిత రాశాడు. 

జనసంఘ్–ఆర్ఎస్ఎస్​

1925లో   డా. కేశవరావు బలీరాం హెడ్గెవార్​ స్థాపించిన ఆర్ఎస్ఎస్​ అప్పటికే బలమైన  సంస్థగా ఉన్నా  రాజకీయ లక్ష్యం ఎంచుకోలేదు.  మొదట నెహ్రూ మంత్రివర్గంలో  పనిచేసిన డా. శ్యామాప్రసాద్​ ముఖర్జీ మాత్రమే  నెహ్రూ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించి బయటకు వచ్చారు.  నెహ్రూ తర్వాత భారత ప్రధాని అయ్యే అర్హతలు ఈయనకు మాత్రమే ఉన్నాయని భావించే స్థాయికి ముఖర్జీ ఎదిగారు. అయితే శ్యామాప్రసాద్​ ముఖర్జీ తన ఆశయాలకు అనుగుణమైన రాజకీయ వ్యవస్థ కోసం సంకల్పించారు. ఆర్ఎస్ఎస్​కు  మాత్రమే ఆ కాలంలో నెహ్రూతో సమానమైన  జనసమీకరణ  చేయగల సామర్థ్యం ఉండేది.

 మోదీ, సామాన్య కార్యకర్త,,సంఘ్​ దృష్టిలో సమానమే

  సిక్కుల ఊచకోత  తర్వాత సంఘ్​కు  కూడా సంకట పరిస్థితి వచ్చింది. ఓ జాతీయ పార్టీ హిందూత్వాన్ని గుర్తిస్తూ మాట్లాడగా మరో జాతీయపార్టీ ఆ విషయాలు జోలికెళ్లకుండా ముందుకు వెళుతోంది.  సంఘ్​లో  ముఖ్యంగా  ఐక్యత అనుశాసనం అనేవాటికి ప్రాధాన్యత ఎక్కువ.  అందరూ అవి పాటించేవారే. దానివల్ల రెండూ నిలదొక్కుకున్నాయి. ఈ రెండు నియామకాల కోసం ఎందరో అభిప్రాయాలు చెప్పలేక కనుమరుగయ్యారు.  బలరాజ్ మధోక్​ మరో  వాజ్​పేయిలాంటి వాడు. సంఘ్​కు  వ్యక్తులు ప్రధానం కాదు వ్యవస్థలు ముఖ్యం.  బయటకు కనిపించకుండా,  ప్రచార యావ లేకుండా సంఘ్ కార్యకర్తలు  చేసేపని అపరిమితం. అపూర్వం.  అదే సంఘ్​శక్తి.  సంఘ్​కు  దేశాన్ని  పాలించే మోదీ అయినా, వనవాసీలో పనిచేసే  సామాన్య కార్యకర్త  అయినా ఒకే దృష్టి.  సంఘ్​ కూడా అలా అసలు సిసలైన కార్యకర్తలు ఎవరికైనా ధర్మోపదేశం చేస్తుంది. 

డా.  పి. భాస్కరయోగి,
పొలిటికల్, సోషల్​ ఎనలిస్ట్​