చట్టబద్ధ పాలనలో పోలీసుల పాత్ర ఏమిటి? : మంగారి రాజేందర్

ప్రజాస్వామ్య దేశాల్లో పోలీసుల ప్రధాన పాత్ర శాంతి భద్రతల(లా అండ్​ఆర్డర్)ను పరిరక్షించడం. శాంతి భద్రతలను అమలు చేయడం కోసం పోలీసులు చాలా సార్లు చట్టాలను ఉల్లంఘిస్తూ ఉంటారు. దాని వల్ల చట్టబద్ధపాలన ఉందా అన్న అనుమానం అందరికీ వస్తుంటుంది. శాంతి భద్రతలను, శాసనం ద్వారా వచ్చిన అధికారాలను ఉపయోగించి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఓ కొత్త పద్ధతిని అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు, ఉద్యోగులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ధర్నా చేయడానికి అనుమతించడం లేదు. వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్భందిస్తున్నారు. ముందస్తు(నివారక) అరెస్టులు చేస్తున్నారు. వాళ్లు ఇంటి నుంచి బయటకు రాకముందే అరెస్టు చేసే ఈ పద్ధతిని ఏ చట్టంలోనూ పేర్కొన లేదు. క్రిమినల్ ​ప్రొసీజర్​ కోడ్​లోని సెక్షన్ 151 ప్రకారం నివారక అరెస్టులు చేసే అధికారం పోలీసులకు ఉంది. ఎవరైనా వ్యక్తి కాగ్నిజబుల్​ నేరం చేస్తారని పోలీసులకు తెలిసినప్పుడు, ఆ నేరం జరగకుండా నియంత్రించలేనప్పుడు మాత్రమే మేజిస్ట్రేట్​దగ్గర నుంచి ఎలాంటి వారెంట్​ లేకుండా అరెస్టు చేయవచ్చు. అంతే గానీ, ఆ వ్యక్తులు ఇంటి నుంచి బయటకు రాకుండా అరెస్ట్​చేసే అధికారం పోలీసులకు లేదు. వారు అలా చేయడం చట్టవ్యతిరేకం. ఈ పరిస్థితిని ఏ రాజకీయ నాయకుడూ అవసరమైన రీతిలో ప్రశ్నించడం లేదు. కోర్టులు కూడా ప్రేక్షక పాత్రను పోషిస్తున్నాయి. నేను అంటున్నది హైకోర్టు, సుప్రీంకోర్టుల గురించి.

పాలకపక్షానికి అనుకూలంగా..

పోలీసులు పాలకపక్షానికి అనుకూలంగా ఉండటానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. బ్రిటీష్​ వాళ్లు తయారు చేసిన పోలీసు వ్యవస్థ ఆ మూస నుంచి బయటపడకపోవడం మొదటి కారణం అయితే, రెండవది అధికార పార్టీ ఆధిపత్యంలో కొనసాగడం. ఆర్మీ ఏవిధంగానైతే ఉంటుందో, పోలీసు వ్యవస్థనూ బ్రిటీష్​వాళ్లు అలాగే తయారు చేశారు. 1857లో సైనిక తిరుగుబాటు జరిగిన తరువాత,1861లో పోలీసు చట్టాన్ని తీసుకువచ్చారు. తమకు అనుకూలంగా, తాము చెప్పినట్లు వినే విధంగా బ్రిటీష్​వాళ్లు పోలీసు వ్యవస్థను తయారు చేశారు. సైనికుల మాదిరిగానే పోలీసులకు కూడా ఖాకీ బ్యాడ్జీలు, యూనిఫార్మ్​డిజైన్​ చేశారు. డ్రిల్లు, పరేడ్, శారీరక ధారుడ్యం పైన ఎక్కువ శ్రద్ధ కనబరిచారు. క్రిమినల్స్​ను అణచివేయడానికి, శాంతి భద్రతలను కాపాడటానికి చట్టం ప్రకారం పనిచేస్తే సరిపోదని అధికారంలో ఉన్న వాళ్ల భావన. అదే భావన పోలీసుల్లోనూ బలంగా పాతుకుంది. నత్త మాదిరిగా పని చేస్తున్న కోర్టుల వల్ల కూడా ప్రజలకు అలాంటి భావనే ఏర్పడింది. అవసరమైనన్ని కోర్టులను ప్రభుత్వాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల న్యాయవ్యవస్థ పనితీరు బాగుండటం లేదన్న భావన న్యాయమూర్తుల్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ చట్టవ్యతిరేకంగా పోలీసులు పని చేసే పరిస్థితిని ఎవరు సమర్థించినా అది పోలీసు వ్యవస్థను అవినీతిమయం చేస్తుంది. తాము చట్టానికి అతీతులం అన్న భావన వాళ్లలో బలంగా ఉన్నది. పోలీసులు చేసే దుశ్చర్యల వల్ల పోలీసులంటే ప్రజల్లో గౌరవం పోయి భయం ఏర్పడుతున్నది. తెలియకుండానే పోలీసులంటే వ్యతిరేక భావన కలుగుతున్నది. కొన్నిసార్లు పోలీసులు చేసిన మంచి పనులు, ధైర్యసాహసాలను కూడా ప్రజలు ప్రశంసించలేని పరిస్థితి ఏర్పడుతుంది. పాలక పక్షం పోలీసులను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకోవడం వల్ల పోలీసులు బలిపశువులు అవుతున్నారు. 

కేసుల దర్యాప్తులో స్వతంత్రత

న్యాయవ్యవస్థకు ఉన్న విధంగా తమకు స్వతంత్రత లేదని పోలీసులు తరుచూ అంటూ ఉంటారు. ఇది అర్థ సత్యమే. న్యాయమూర్తులకు  కాలానుగుణంగా ప్రమోషన్లు లేవు. ఖాళీలు ఉన్నపుడే ప్రమోషన్లు వస్తాయి. ఐపీఎస్​ అధికారుల పరిస్థితి వేరు. వారికి కాలానుగుణంగా ప్రమోషన్లు వస్తాయి. అయినా కూడా వాళ్లు పాలకపక్షం అధీనంలోనే ఉంటున్నారు. స్వతంత్రత విషయానికి వస్తే పోలీసులు చేసే నేర విచారణల్లో ఎవరూ జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధినేతలు గానీ, కోర్టులు గానీ దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. హైకోర్టులు, సుప్రీంకోర్టుకు మాత్రం ఎప్పుడైనా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. కేసు పురోగతి మాత్రం తెలుసుకునే అవకాశం ఉందని సక్రివాసు వర్సెస్​ స్టేట్ ఆఫ్​ యూపీ కేసులో సుప్రీం​ ప్రత్యేకంగా చెప్పింది. ఎఫ్ఐఆర్ ​విడుదల చేయడంలో, అదే కేసును దర్యాప్తు చేయడంలో, ముద్దాయిలను అరెస్టు చేసి, చార్జిషీట్​దాఖలు చేయడంలో పోలీసులు చట్ట ప్రకారం సర్వస్వతంత్రులు. ఇంత స్వతంత్రత పోలీసులకు ఉన్నప్పటికీ పోలీసులు పాలకపక్షం ఆధిపత్యంలో ఉండటానికి ప్రధాన కారణం బదిలీలు. ఈ అధికారం ప్రభుత్వం చేతిలో ఉంది. ఏదో ఒక కారణం చూపిస్తూ, ఎలాంటి కారణం చూపించకుండానూ ఒక పోలీస్​అధికారి ఏ స్థాయిలో ఉన్నా అతన్ని బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. సర్కారుకు నచ్చని అధికారులు ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ అవుతూ ఉంటారు. కొందరు నెలల తరబడి వెయిటింగ్​లోనూ ఉంటారు. ప్రాధాన్యం లేని పోస్టులో పనిచేయడం ఇష్టంలేక వాళ్లు పాలక పక్షం ఆధీనంలోకి వెళ్లిపోతుంటారు. ఈ పరిస్థితి పోవాలంటే, ప్రాధాన్యం లేని పోస్టులు ఉండకూడదు. అన్ని పోస్టులకు సరైన ప్రాధాన్యత కల్పించాలి. అప్పుడు కొంత మేరకు పరిస్థితి మారుతుంది. 

వ్యవస్థను బలహీనపరచొద్దు

సంఘ వ్యతిరేక శక్తుల అగచాట్లను అణచివేయడానికి పోలీసులకు మనదేశంలో శాసనాలు విస్తృతమైన అధికారాలను ఇచ్చాయి. ఆ అధికారాల వల్ల పౌరుల హక్కులకు భంగం కలుగుకుండానూ నిబంధనలు ఏర్పాటు చేశాయి. అయినా పోలీసులు ప్రజల న్యాయబద్ధమైన హక్కులకు భంగం కలిగిస్తూనే ఉన్నారు. నేరస్తులు చట్టం పరిధి నుంచి తప్పించుకోకుండా చూడటం ఎంత ముఖ్యమో, ప్రజాస్వామ్య విలువలను ప్రజల చట్టబద్ధమైన హక్కులను కాపాడటం కూడా పోలీసులకు అంతే ముఖ్యం. చట్టవ్యతిరేకమైన చర్యలు, చట్టం అనుమతించని చర్యలను ఎంత మంచి కోసం ఉపయోగించినా అవి వ్యవస్థలను బలహీనపరుస్తూనే ఉంటాయి. మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధ పాలన అందించడంలో పోలీసులు ప్రధాన పాత్ర పోషిస్తారు. ప్రభుత్వాల విశ్వసనీయత పోలీసులు నిర్వర్తించే చర్యల మీద ఉంటుంది. పాలకపక్షాలు ఈ విషయాన్ని గుర్తిస్తే మంచి పాలన అందించే అవకాశం ఉంది.

- మంగారి రాజేందర్,
రిటైర్డ్​ జిల్లా జడ్జి