రెవెన్యూ వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగులుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తున్న విలేజ్రెవెన్యూ అసిస్టెంట్స్ (వీఆర్ఏ) కష్టాలను సర్కారు పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన, సామాజిక పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ మొదలుకొని రైతుబంధు, దళిత బంధు వరకు అనేక సర్వేలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వీఆర్ఏలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. రేయింబవళ్లు చాకిరి చేస్తున్నా.. వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు కల్పించాలనే చిత్తశుద్ధి పాలకులకు ఏమాత్రం లేదు. వీఆర్ఎలకు పేస్కేల్, వారసులకు ఉద్యోగాలు, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించి రెండేండ్లు కావస్తున్నది. అయినా నేటికీ అది నెరవేరలేదు. ఇచ్చిన హామీని అమలు చేయాలని అనేక సార్లు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, రెవెన్యూ ఉన్నత అధికారులకు వీఆర్ఏలు దరఖాస్తులు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఇబ్బందులు, తీర్చాలని నిరసనలు తెలిపితే, ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేయించి నిర్బంధిస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అనేక ఆందోళనలు చేసినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 25 నుంచి వీఆర్ఎలు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు దిగాల్సి వచ్చింది.
23 వేల మంది వీఆర్ఏలు..
రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది వీఆర్ఏలు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మూడు వేల మంది నియమితులు కాగా అందులో 50 శాతం మహిళలు, దివ్యాంగులు ఉన్నారు. 2020 సెప్టెంబర్ 9న శాసనసభలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రతిపాదిస్తూ సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. ‘‘వీఆర్ వో వ్యవస్థను రద్దుచేసి, వీఆర్ఏలను కొనసాగిస్తం. వీఆర్ఏలు ఏండ్లుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. వారిలో నూటికి 95 శాతం మంది ఎస్సీ, ఎస్టీలే. అందరూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళిత వర్గాల వారే. వారికీ న్యాయం చేద్దాం. తలెత్తుకొని జీవించేటట్లు వారందరికీ పేస్కేల్ ఇస్తాం. వయసు పైబడిన తండ్రుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తాం. చదువుకున్న వారికి విద్య అర్హతలను బట్టి ప్రమోషన్లు కల్పిస్తాం”అని సీఎం స్వయంగా నిండు అసెంబ్లీలో ప్రకటించారు. ఇది జరిగి నేటికి రెండేండ్లు కావొస్తున్నా.. వాటిల్లో ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. పేస్కేలు వస్తే బతుకులు మారుతాయని, జీతం పెరుగుతుందని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వస్తుందని ఆశించిన వీఆర్ఏలకు నిరాశే మిగిలింది.
ఇప్పటికైనా స్పందించాలె..
ప్రభుత్వ ఉద్యోగులకు11వ పీఆర్సీ ప్రకటించిన రోజు ప్రజా ప్రతినిధులకు, స్కీమ్ వర్కర్లకు, హోంగార్డులకు, వీఆర్ఏలకు కూడా పీఆర్సీ వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన అన్ని రంగాల వారికి జీవోలు ఇచ్చి అమలు చేస్తున్న ప్రభుత్వం వీఆర్ఏలకు మాత్రమే పీఆర్సీ జీవో ఇంత వరకు ఇవ్వలేదు. వీఆర్ఏలు ఏం పాపం చేశారు? నిండు శాసనసభలో ఎమ్మెల్యేల సమక్షంలో రెండుసార్లు, ప్రగతి భవన్ లో రెండు సార్లు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ఎవరికి చెప్పుకోవాలి? అసెంబ్లీలో సీఎం ప్రకటించినప్పుడే పే స్కేల్ జీవో ఇచ్చి ఉంటే, బిశ్వాల్ కమిటీ సూచనల ప్రకారం కింది స్థాయి ఉద్యోగికి నెలకు రూ.19 వేల వేతనం ఇవ్వాలి. దానికి 30 శాతం పీఆర్సీ కలిపి ఇస్తే ఒక్కో వీఆర్ఏకు ప్రస్తుతం వస్తున్న నెలకు10,500, రూపాయలు కాకుండా నెలకు రూ. 25 వేల జీతం వచ్చి ఉండేది. ఒక్కో వీఆర్ఏ ప్రతినెల రూ.15 వేలు కోల్పోయాడు. గడిచిన 22 నెలల్లో ఒక్కో వీఆర్ఏ మూడు లక్షల ముప్పై వేలు నష్టపోయాడు. ఈ రెండేండ్లలో నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. సర్కారు ఇచ్చే జీతం సరిపోలేక అనేక కుటుంబాలు అప్పులు చేస్తున్నాయి. పేస్కేల్ వస్తదని, జీతం పెరుగుతుందని నమ్మి వడ్డీలకు అప్పులు చేసి ఖర్చులు వెళ్లదీసుకున్న చాలా మంది వీఆర్ఏలు అప్పు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇబ్బందులను పైస్థాయి అధికారులకు చెప్పుకుందామంటే సీసీఎల్ఏ పోస్టు ఖాళీ, రెవెన్యూ శాఖకు మంత్రి లేరు. ప్రిన్సిపల్ సెక్రటరీ లేరు. ఎన్ని సార్లు దరఖాస్తులుపెట్టుకున్నా సీఎం అపాయింట్మెంట్ దొరకదు. రెవెన్యూ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా పెంచారు. 74 రెవెన్యూ డివిజన్లు, 594 మండలాలను పెంచారు. పెంపునకనుగుణంగా సిబ్బందిని పెంచలేదు. ఉన్న వీఆర్వో వ్యవస్థను రద్దుచేశారు. ఉన్న సిబ్బందిపై పని భారం పెంచారు. వీఆర్ఏలు వివిధ సమస్యలతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించి వారి డిమాండ్లు నెరవేర్చాలి.
ఇచ్చిన హామీల అమలేది?
ఈ ఏడాది మార్చి బడ్జెట్ సమావేశాల సందర్భంగా వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేసి, జీవోలు విడుదల చేయాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. హామీల అమలు కోసం వీఆర్ఏలు ఈ ఏడాది- ఫిబ్రవరిలో తహసీల్దార్ఆఫీసులు, కలెక్టరేట్ల వద్ద, హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఆ నిరసనల ఫలితంగా సీఎం కేసీఆర్అసెంబ్లీలో వీఆర్ఏల గురించి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ ముచ్చట చెప్పి కూడా నాలుగు నెలలు అవుతోంది. అయినా ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. ప్రతి నెల ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా జీతాలు చెల్లిస్తామని సీఎం గతంలో హామీ ఇచ్చారు. కాగా అది నేటికీ అమలు కావడం లేదు. జులై నెల చివరి వారం వచ్చినా.. వీఆర్ఏలకు ఇంకా జూన్ నెల జీతం రాలేదు.
- వంగూరు రాములు
వీఆర్ఏ జేఏసీ కో కన్వీనర్