తెలంగాణలో భూ సమస్యలకు పరిష్కారం ఏది : ఆకుల రాఘవ

తెలంగాణను పాలించిన నిజాం ‘మరట్వాడ’ సర్వే పద్ధతి ద్వారా భూములను సర్వే చేయించి,  నెంబర్స్ వేయించి, హద్దురాళ్లు పాతించారు. మరట్వాడా సర్వే అంటే ఇనుప గొలుసుతో కొలిచే విధానం. గజం చొప్పున లెక్క గట్టి, భూమిని కొలిచేవారు. ఆంధ్రా ప్రాంతంలో ‘పుంగనూరు’ సర్వే ద్వారా భూములు కొలిచి హద్దురాళ్లు పాతారు. పుంగనూరు సర్వే అంటే టేప్ తో కొలిచేది. తెలంగాణలో గుంట, ఎకరం లెక్కన కొలిస్తే, ఆంధ్రాలో సెంటు, హెక్టార్ గా పిలిచేవారు. నిజాం రాజు సర్వే చేయించి, హద్దురాళ్లు వేసిన సర్వే నెంబర్సే తప్ప నేటికీ తెలంగాణలో ఎలాంటి భూ సర్వే, ఏ ప్రభుత్వం నిర్వహించలేదు? నిజాం రాజు నిర్వహించిన సర్వేలో ఎవరైతే భూములను సాగు చేసి కాస్తు చేసుకున్నారో, వారికే పట్టాలు వచ్చాయి. కొందరికి ఇనాం భూములుగా పట్టా రాసి ఇచ్చారు. బంజరు భూములను, పోడు భూములను, అడవి భూములను వేరు చేసి హద్దురాళ్లు పాతారు. నిజాం కాలంలోనే అడవి భూముల రగడ ఎలా ఉండేదో?  కొమరం భీం ద్వారా యావత్ ప్రపంచానికి తెలుసు! నేటికీ అది సమస్యగానే ఉండిపోయింది. 

ప్రభుత్వాలు మారినా..

చెన్నారెడ్డి సీఎం అయిన తర్వాత జిల్లాల కలెక్టర్లంతా ఆయనతో సమావేశమై గాడి తప్పిన రెవెన్యూ వ్యవస్థ గురించి చెప్పారు. తక్షణమే రికార్డ్స్ సరిగా నిర్వహించకపోతే ఎంతో ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ప్రభుత్వం స్పందించి వెంటనే మూడు గ్రామాలకు ఒక వీఆర్వోను నియమించింది. అయినా, అన్ని సమస్యలు తీరలేదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా భూమి అనే ఒక పోర్టల్​తయారు చేయించారు. ప్రతి రైతు భూమిని అందులో రికార్డ్ చేశారు. అయితే తప్పుల తడకలుగా ఉన్న భూముల రికార్డులన్నీ ఆన్​లైన్​లోకి రాలేదు. పాత రికార్డులు ఏవైనా ఉంటే వాటితో కార్యాలయాల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్​.. ‘నిజాం రాజు చేసిన భూ సర్వే అంతా తప్పుల తడక.. నేను భూ సర్వే చేయించి, జానెడు భూమి తప్పు లేకుండా సరిచేస్తా’ అని ధరణి వ్యవస్థను తీసుకొచ్చారు. రెవెన్యూలో అవినీతి పెరిగిపోయిందని, రైతుల భూయాజమాన్య హక్కులు ఇష్టారీతిని మారుతున్నాయంటూ.. వీఆర్వోలను తొలగించారు. ఇలా ప్రభుత్వాలు మారుతూ వచ్చినా.. భూ సమస్యలకు ఎక్కడా పరిష్కారం దొరకలేదు. గత ప్రభుత్వాలు రెవెన్యూ వ్యవస్థను సరిదిద్ద లేక రైతులను గోదావరిలో ముంచి వెళ్లాయనుకుంటే, ఈ ప్రభుత్వం మళ్లీ రైతులను ధరణి అనే సముద్రంలో ముంచినట్టు అయింది. ధరణి పోర్టల్​లో భూముల వివరాలు తప్పుగా నమోదైన వేలాది మంది రైతులు నిత్యం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ధరణి పోర్టల్​తీసుకొచ్చినా.. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమైంది. ఇప్పటికైన భూసర్వే ప్రారంభించి, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా భూ రికార్డులను నమోదు చేయాల్సిన అవసరం ఉంది.

ఏటా జమాబంది జరగక..

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ఒక గాడిలో పెట్టలేకపోయింది. నిజాం రెవెన్యూ వ్యవస్థనే అమలు చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బంజరు భూములను, పోడు భూములను దళితులకు, గిరిజనులకు పంచింది. పెద్ద పెద్ద చెరువు శిఖాలను కూడా కింది కులాల వారికి పంపిణీ చేసింది. వాటిని చాలా మంది అమ్ముకున్నారు, కొన్నారు.  కొన్న వారు కొందరు వారి పేరు మీద పట్టాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇనాం భూములపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వారు ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తహసీల్దార్ కార్యాలయాలు తీసివేసి, మండల వ్యవస్థను ఏర్పాటు చేసింది. కానీ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంపై శ్రద్ధ చూపలేదు.  దీంతో భూముల రికార్డ్స్ నమోదు గాక, ఏటా జమాబంది జరగక, ఎవరు పట్టాదారో? ఎవరు కాస్తుదారో? ఎవరు కౌలు దారో? ఎవరు కబ్జాదారో? అర్థం కాకుండా పోయింది? రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. 

- ఆకుల రాఘవ, 
సినీ రచయిత, దర్శకులు