టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఏటా 225 టీఎంసీల గోదావరి నీటిని లిఫ్ట్ చేసి 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకూ ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదు. కానీ ఆ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల వేల ఎకరాల పంటలు నీటిపాలవుతున్నాయి. ఏ బ్యారేజీలు లేనప్పుడు ఎలాంటి ముంపు ఉండేది కాదు. అవి కట్టిన తర్వాత గోదావరి తీరంలోని పంటలు ముంపునకు గురవుతున్నాయి. ఇలా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఇప్పటికైనా కాళేశ్వరం బ్యాక్‌వాటర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలి.
తెలంగాణలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటితోపాటు పారిశ్రామిక అవసరాలకు నీరందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత–-చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ చేసింది. కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి కృషితో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఆ ప్రాజెక్టును చేపట్టారు. రూ.17,875 కోట్ల అంచనా వ్యయంతో 2008 డిసెంబర్లో ప్రస్తుత కుమ్రంభీం ఆసిఫాబాద్‌జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి దగ్గర వైఎస్, కాకా వెంకటస్వామి తదితరులు ప్రాణహిత–-చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును 19 ప్యాకేజీలుగా విభజించి ఫండ్స్ కూడా శాంక్షన్ చేశారు. వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మహారాష్ట్రలో ముంపు నష్టం లేకుండా బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించి నిర్మించేందుకు మహారాష్ట్ర సర్కారుతో సీఎం కేసీఆర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. 2014 నాటికి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,500 కోట్లకు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చుపెట్టి తుమ్మిడిహెట్టి నుంచి మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం వరకు 70 కిలోమీటర్లు కాల్వలు తవ్వారు.
కమీషన్ల కోసమే రీడిజైనింగ్
సీఎం కేసీఆర్ రాత్రికి రాత్రే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా తెరపైకి తీసుకొచ్చారు. ప్రాణహిత ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే అవకాశం ఉన్నా.. అక్కడ నీటి లభ్యత తక్కువని చెప్పి కాళేశ్వరం దగ్గర లిఫ్ట్స్కీమ్కు ప్లాన్ చేశారు. రూ.38,500 కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.25 లక్షల కోట్లకు పెంచారు. మూడో టీఎంసీ కోసం అంచనా వ్యయాన్ని మరింత పెంచనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.55 వేల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. కేసీఆర్ కుటుంబం, మేఘా కృష్ణారెడ్డి వేల కోట్లు దోచుకుని తమ సంపదను భారీగా పెంచుకున్నారనడంలో ఎలాంటి అనుమానం లేదు. మేఘా కృష్ణారెడ్డి ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించుకున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమేనని చెప్పక తప్పదు.
బ్యాక్ వాటర్‌తో పంటలకు నష్టం
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్క ఎకరానికి కొత్తగా నీళ్లు రాలేదు. కానీ దాని బ్యాక్ వాటర్‌వల్ల మూడేండ్లుగా మూడు జిల్లాల్లోని 20 వేల ఎకరాల్లో పంటలు నీటమునుగుతున్నాయి. ఈ బ్యారేజీలు లేనప్పుడు గోదావరికి ఎంత పెద్ద వరదలు వచ్చినా ఎలాంటి ముంపు ఉండేది కాదు. బ్యారేజీలు కట్టడం వల్ల వరదలు వచ్చిన ప్రతిసారీ బ్యాక్ వాటర్ గోదావరి తీరంలోని వేలాది ఎకరాల్లో పంటలను ముంచుతోంది. ఈ సంవత్సరం జులై నెలాఖరులో ఒకసారి, సెప్టెంబర్ మొదటి వారంలో రెండోసారి వరదలొచ్చి జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి, ఇతర పంటలు నీటిపాలయ్యాయి. అటు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ 10 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. పత్తి ఎకరానికి రూ.50 వేలు, మిర్చి ఎకరానికి రూ.70 వేల వరకు నష్టపోయినట్టు రైతులు చెప్తున్నారు. ప్రతిసారి అగ్రికల్చర్ ఆఫీసర్లు సర్వే చేసి ప్రభుత్వానికి రిపోర్టు చేస్తున్నా.. ఇప్పటివరకు పైసా నష్టపరిహారం ఇయ్యలేదు. నిరుడు కోటపల్లి మండలం పుల్లగామలో పంట మునిగిపోయి అప్పులపాలై లింగయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులెవరూ అతని కుటుంబాన్ని పరామర్శించలేదు. బీజేపీ ఆధ్వర్యంలో రైతులకు జరుగుతున్న నష్టంపై రెండేండ్లుగా పోరాడుతున్నాం. అయినా సర్కారులో స్పందన లేకపోవడం బాధాకరం. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేలు కౌలు చెల్లించి, మరో రూ.50 వేలు పెట్టుబడి పెడితే వాళ్లకు చిల్లిగవ్వ రాకపోగా అప్పులే మిగులుతున్నాయి. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా చెల్లించడం లేదు. అందుకే ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ముంపు భూములను ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లేదా రైతులకు ఈ భూమికి బదులు మరో చోట భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
వార్దా బ్యారేజీ ఎప్పుడు కడ్తరు?
ప్రాణహిత ప్రాజెక్టు రద్దు కావడంతో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాణహితపై రూ.1,919 కోట్లతో బ్యారేజీ కడతామన్నారు. వైల్డ్‌లైఫ్, ఎన్విరాన్మెంట్ పర్మిషన్ల పేరిట కాలం వెళ్లదీశారు. ఈలోగా బ్యారేజీ అంచనా వ్యయం రూ.2,600 కోట్లకు చేరింది. 2019లో ప్రాణహితకు 200 మీటర్ల ఎగువన వార్దా నదిపై బ్యారేజీ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వ్యాప్కోస్‌తో సర్వేలు చేయించారు. చివరకు అది కూడా ఉత్తదేనని తేలిపోయింది. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఐదారు నెలల కింద ప్రగతిభవన్‌లో సీఎంను కలిసిన సందర్భంగా వార్దా బ్యారేజీ నిర్మించడం లేదని చెప్పినట్టు వార్తలొచ్చాయి. అవసరమైతే చెక్‌డ్యాం కట్టుకోవాలని, లిఫ్టులు పెట్టుకోవాలని సూచించినట్టు సమాచారం. ఇలా పూటకో మాటతో ఈ ప్రాంత రైతాంగాన్ని మభ్యపెట్టడం ఆపి, అసలు వార్దా బ్యారేజీ కడ్తారా? కట్టరా? ప్రభుత్వం స్పష్టం చేయాలి. అలాగే కాళేశ్వరం బ్యాక్‌వాటర్ సమస్యకు ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలి.
- గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు
ఎత్తిపోసుడు.. వదిలేసుడు
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఏటా 225 టీఎంసీల గోదావరి నీటిని లిఫ్ట్ చేసి 40 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆచరణలో ఇది సాధ్యం కావడం లేదు. వానాకాలం భారీ వర్షాలు పడితే ఒక్కపెట్టున ఎల్లంపల్లి నిండుతోంది. దీంతో అప్పటికే ఎత్తిపోసిన నీటిని దిగువకు వదిలేయాల్సి వస్తోంది. పోనీ సీజన్ చివర్లో ఎత్తిపోద్దామంటే మేడిగడ్డ వద్ద నీళ్లే ఉండట్లేదు. 2019--–-20లో 60 టీఎంసీలు ఎత్తిపోశాక భారీ వర్షాలు పడి నీళ్లన్నీ కిందికి వదిలేశారు. ఇక 2020–-21 సీజన్ ప్రారంభంలో భారీ వర్షాల కారణంగా లిఫ్టులను పూర్తిస్థాయిలో నడపలేదు. చివర్లో ఎత్తిపోద్దామన్నా ప్రాణహిత దగ్గర కూడా నీళ్లు లేకుండా పోయాయి. ఈసారి జూన్ ప్రారంభంలోనే దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మహారాష్ట్రలో కూడా వానలు పడటంతో ప్రాణహిత నదికి వరదలు వచ్చాయి. దీంతో జూన్ 16 నుంచి 20 రోజుల్లో 32 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు. కానీ భారీ వర్షాలు, వరదల కారణంగా జులై మూడోవారంలో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఖుల్లా పెట్టి ఎత్తిపోసిన నీళ్లన్నీ మళ్లీ కిందికి వదిలేశారు. ఫలితంగా ఈ మూడేండ్లలో సుమారు 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయి. కాళేశ్వరం ద్వారా 13 జిల్లాల పరిధిలో 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిస్తామని చెప్పినా.. ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు. గడిచిన యాసంగిలో 2.50 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తికాక సాధ్యపడలేదు. దీంతో ఈసారి వానాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనే ప్రతిపాదనను పూర్తిగా పక్కనపెట్టేశారు. దీంతో గడిచిన మూడేండ్లలో కాళేశ్వరం లిఫ్టుల కారణంగా 2 వేల కోట్ల రూపాయల కరెంట్ బిల్లులు మీదపడడం తప్ప రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి ఫాయిదా లేకుండా పోయింది.