కరోనా కంట్రోల్ కు సర్కార్ వ్యూహమేంటి.?

కరోనా కంట్రోల్ కు సర్కార్ వ్యూహమేంటి.?


రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతున్నది. వైరస్ వ్యాప్తి కూడా విస్తృతంగా ఉన్నది. ఎక్కడ నుంచి వస్తోంది? ఎలా వస్తోంది? ఎవరి వల్ల వస్తుందో తెలియని పరిస్థితి. గతేడాది వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరుచుకోవటానికి సమయం కావాలి కనుక లాక్ డౌన్ అవసరం ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నెలలకు పైన లాక్ డౌన్ విధించి ప్రజలందరూ ఇండ్లలోనే ఉండాలని నిర్దేశించాయి. అప్పుడు రోజుకు వెయ్యి కేసులు కూడా లేవు. ఇప్పుడు దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న క్రమంలో లాక్ డౌన్ పెట్టడానికి ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం రోజుకు 4 లక్షలకుపైగా కేసులు వస్తున్నాయి. తెలంగాణలో రోజుకు 5,000 కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో టెస్టులు పూర్తి స్థాయిలో చేయడం లేదు. వాస్తవానికి రోజువారీ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటి? అనేక లోటుపాట్లతో ఉన్న వైద్య వ్యవస్థను మెరుగుపరచటానికి, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి, రోగ నిరోధక శక్తి పెంచటానికి ప్రభుత్వాల దగ్గర ఉన్న వ్యూహాలు ఏమిటి? ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందు ఉన్న వ్యూహం ఏమిటి?

సంప్రదింపుల ద్వారా తీసుకున్న నిర్ణయం కాదు

కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత సీఎం కేసీఆర్ చేసిన మొట్టమొదటి ప్రకటన తెలంగాణలో లాక్ డౌన్ ఉండదని. అయితే లాక్ డౌన్ వద్దని సీఎం చేసిన ప్రకటన సరైనదికాదు. ఎందుకంటే, ఈ నిర్ణయం విస్తృత సంప్రదింపుల ద్వారా చేసింది కాదు. మెడికల్ ఎక్స్​పర్ట్స్, ఆయా రంగాల నిష్ణాతులు, ప్రజలతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. ఎప్పటి లాగే కొందరు అధికారులతో కూర్చుని వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఇంత పెద్ద నిర్ణయానికి కేబినెట్ సమావేశం పెట్టకపోవడం కూడా గమనించాలి. దాదాపు 12 మంది సలహాదారులు ఉన్నారు. వారితో కూడా సమావేశం కాలేదు. జిల్లా అధికారులతో సమీక్ష చేయలేదు. కరోనా సెకండ్ వేవ్​లో ప్రజలు కొట్టుకుపోతుంటే, వైరస్ వ్యాప్తిని నిలువరించటానికి ఉన్న సాధారణ మార్గం లాక్ డౌన్. వైరస్ వ్యాప్తిని ఆపటానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాలు చూపడం లేవు. లాక్ డౌన్ వద్దన్న సీఎం ముందు వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి ఉన్న ప్రణాళిక ఏమిటి? లాక్ డౌన్​తో వైరస్ తగ్గడం లేదన్నప్పుడు, ఇప్పుడు తీసుకుంటున్న చర్యల్లో దేని వల్ల వ్యాప్తి తగ్గుతుందో చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది కదా. కాని, ఆ పని మాత్రం చేయలేదు. రోజుకు వెయ్యి కేసులు కూడా లేనప్పుడు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. అప్పుడు లాక్ డౌన్ విధించటానికి అనేక కారణాలను సీఎం కేసీఆర్.. వెనువెంటనే జరిపిన ప్రెస్ మీట్​లో చెప్పారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షలపైన కేసులు నమోదవుతున్నా.. లాక్ డౌన్ విధించటంలో అలసత్వం స్పష్టంగా కనపడుతోంది. అప్పటి కంటే ఇప్పటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. టెస్టులు చేయకపోవడం, టెస్టింగ్ వ్యవస్థ సామర్థ్యం పెంచకపోవటంతో వైరస్ బారిన పడి తెలియని వాళ్ల సంఖ్య పెరుగుతోందని అంటు వ్యాధుల నిపుణులు చెబుతున్న పరిస్థితులను తెలంగాణ పాలకులు పట్టించుకోకపోవటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వైద్య వ్యవస్థ మెరుగుపడలేదు

రాష్ట్రంలో వైద్య వ్యవస్థ సామర్థ్యం పెరగలేదు. పెంచలేదు. కేవలం మౌలిక సౌకర్యాలే కాదు, మానవ వనరులు కూడా తక్కువగా ఉన్నాయని తెలిసినా, అదనపు వనరులు ఏర్పరచుకోలేదు. ఆస్పత్రుల సంఖ్యా పెరగలేదు. పైగా, ఇతర రాష్ట్రాల వారు పెద్ద సంఖ్యలో హైదరాబాద్​లో ట్రీట్​మెంట్​ కోసం వస్తున్నారని గర్వంగా ప్రకటిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరి ఆ మేరకు తెలంగాణ వాసులకు అన్యాయం జరిగిందనే వాస్తవం ఎందుకు గుర్తించటం లేదు. తెలంగాణ వాసులకు కరోనా వస్తే ఎక్కడికీ పోలేని పరిస్థితి ఉన్నది. హైదరాబాద్​కు రాలేని వాళ్లు ఎంతో మంది ఉన్నారు. జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల పరిస్థితి అత్యంత దయనీయమని మీడియా కథనాలు చెబుతున్నాయి. వైద్య వసతులు పెంచకుండా, వైద్య పరికరాలు, అత్యంత అవసరమైన మందులు, ఆక్సిజన్ వంటివి సమకూర్చుకోకుండా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు. పైన పేర్కొన్నవేవీ చేయలేనప్పుడు, కనీసం వైరస్ వ్యాప్తిని అరికట్టే లాక్ డౌన్​ను కూడా తిరస్కరించటం దుర్మార్గమైన చర్య. లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ మీద, వైరస్ వ్యాప్తి మీద, సామాన్య జీవనం మీద ప్రభావం ఉంటుంది. అందులో అనుమానం లేదు. కానీ, ప్రస్తుతం ఉన్న అతి పెద్ద సమస్య వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గించటం. 15 రోజుల లాక్ డౌన్ ద్వారా ఇది సాధ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, లాక్ డౌన్ వల్ల కలిగే ఇతర ప్రభావాలను తగ్గించడానికి, తెలంగాణ ప్రభుత్వం పథక రచన చేయవచ్చు. సామాన్యులకు ఉపశమనం కలిగించటానికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి నేరుగా బడుగు జీవులను ఆదుకునే చర్యలు చేపట్టవచ్చు. 

హాస్పిటల్​కు వెళ్లాలంటేనే టెన్షన్

రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా సంప్రదింపులతో కూడిన వ్యూహరచన చేయడం లేదు. ఒక వ్యక్తి ఆలోచనల మేరకు స్పందించడం, ఆ వ్యక్తి ఆదేశాల కొరకు వేచి చూడటం, అప్పుడే చర్యలకు పూనుకోవడం వంటి పరిస్థితి ఉండడంతో కరోనా వేగంగా విస్తరిస్తున్నా కూడా సరైన స్థాయిలో, సరైన సమయంలో, సరైన మోతాదులో ప్రతిస్పందన తెలంగాణ ప్రభుత్వం నుంచి లేదు. గత సంవత్సరం నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ వేలాది కుటుంబాలు, ఆదాయం తగ్గి, నిత్యావసరాల ధరలు పెరిగి, అప్పుల పాలైన పరిస్థితుల్లో కరోనా మహమ్మారి రెండోసారి వికృత రూపం చెందడంతో భయానక పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఆర్థికంగా చితికి పోవటంతో, కరోనా అంటే ఎక్కువగా ప్రైవేటు హాస్పిటల్​కు పోతే యెట్లా అనే భయంతో ఉన్నారు. ప్రభుత్వ వైద్యం మెరుగుపరిచే ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి లేదు. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ అరికట్టే ఆలోచన అసలే లేదు. మందులు, ఆక్సిజన్ తదితర అవసరాల కోసం బ్లాక్ మార్కెట్ మీద ఆధారపడే దుస్థితి దాపురించింది. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే పోషకాహారం ఎంతో అవసరం. కానీ, పోషకాలతో కూడిన ఆహారం అందుబాటులో లేని కుటుంబాలు అనేకం. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా బడుగు, బలహీన వర్గాలకు సహాయం చేయలేదు.

ఇది సీఎం కేసీఆర్​కు గొప్ప అవకాశం

సీఎం కేసీఆర్ దక్షత, సామర్థ్యం మీద నమ్మకం ఉన్నవాళ్లు లేకపోలేదు. అయితే, తనను తాను రుజువు చేసుకునేందుకు ఇది ఆయనకు గొప్ప అవకాశం. సామాన్యుల వెతలను తీర్చే వ్యూహరచన చేసి, దానిని అమలు చేసి ప్రజల నీరాజనాలు అందుకునే సమయం వచ్చింది. దానికి అయన చేయాల్సింది నిరంతరం సంప్రదింపులు జరపటం, నిపుణులను కలవటం, వ్యూహాలను అభివృద్ధి చేయటం, సమర్థవంతంగా అమలు చేయటానికి యంత్రాంగాన్ని సమన్వయం చేయటం, స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవటం, క్షేత్ర పరిశీలన ఆధారంగా నిత్యం సమీక్ష చేయటం, నిజాయితీగా పని చేసే ఆఫీసర్లను, ఉద్యోగులను ప్రోత్సహించటం, వారి సలహాలను వినటం, నిధుల కొరత తీర్చటం.. ఇలాంటివి చేస్తే కరోనా మహమ్మారి బారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించవచ్చు. వారి ఆరోగ్య సమస్యలు తీర్చవచ్చు.

లాక్​డౌన్​తో నష్టపోయింది పేదలే

లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయింది సామాన్య జీవులు, పేదలు. చిన్న ఉద్యోగులు, ఇంకా అనేక రకాల జీవనోపాధులు కొనసాగిస్తున్న వారు నష్టపోయారు. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పులు పెరిగాయి. నిరుద్యోగం పెరిగింది. లక్షలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. గత ఏడాది అటువంటి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆలంబనంగా చేసిన ప్రయత్నమేది లేదు. ఇప్పుడు, అవే కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో పాటు కరోనా వైరస్ గుప్పిట్లో పడ్డాయి. వారిని, రెండు విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏ విధంగా వారిని వైరస్ నుంచి బయటపడేయటం, వారి ఆర్థిక ఇబ్బందులను, తిండి సమస్యలను ఎలా తీర్చాలో ఆలోచించి విధాన నిర్ణయాలు ప్రకటించాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఏమీ చేయకపోవటం దురదృష్టకరం.

ఆర్థిక నష్టం తాత్కాలికమే

లాక్​డౌన్ వల్ల ఆర్థిక నష్టం కాబట్టి ఆ ఆలోచన లేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే, గత ఏడాది 2 నెలల లాక్ డౌన్ వల్ల కలిగిన ఆర్థిక నష్టం తాత్కాలికమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దానికి ఉదాహరణ. 2021-22 సంవత్సరానికి 2.30 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ద్వారా ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలోకి వచ్చిన సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది. జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. మార్చి, 2020 నాటికి జీఎస్టీ వసూళ్లు రూ.3,562.56 కోట్లు కాగా, మార్చి, 2021 నాటికి అవి రూ.4,166.42 కోట్లకు పెరగడం తాజా ఉదాహరణ. కేంద్రం నుంచి వాటా రూ.12,692 కోట్లు రావడంతో  రాష్ట్ర ఆదాయం పెరిగింది. మరి, ఇట్లాంటి పరిస్థితిలో, ఒక 15 రోజుల లాక్ డౌన్ వల్ల నష్టం వస్తుందని చెప్పడంలో ఔచిత్యం కనపడటం లేదు. వైరస్ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే, సీఎం ఆర్థిక నష్టం గురించి మాట్లాడటంతో ప్రభుత్వం దృష్టిలో ఉన్న ప్రాధాన్యతలు బహిర్గతమయ్యాయి. ప్రజల ప్రాణాల కంటే రాష్ట్ర ఆదాయం ప్రధానమని ఒక సగటు వ్యాపారి ఆలోచన స్థాయిలో ప్రభుత్వ విధానం ఉండడం శోచనీయం.