
గత నెల రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ సభ జరిగినా, సమావేశం జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు వివరించి చెపుతూ వస్తున్నారు. ఉన్నదాంట్లో సర్దుకోక తప్పదంటూ ప్రజలను ప్రిపేర్ చేస్తూ వస్తున్నారనే చెప్పాలి. బడ్జెట్లో ఫలానా కేటాయింపులు లేవని లేదా తగ్గాయని ఎవరితోనూ అనిపించుకోకూడదనే సీఎం దూరదృష్టి తాజా బడ్జెట్లో కూడా కనిపించింది.
నిజానికి ఈ కాలం బడ్జెట్లకు ‘సాంటిటీ’ లేకుండా పోయిన మాట నిజం. మొక్కుబడి తంతుగా బడ్జెట్లు మారిపోయి చాలా కాలమయింది. కాకపోతే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానంగా మారడానికి గత ప్రభుత్వ నిర్వాకమే కారణమని చెప్పడానికి ఆడిటర్ జనరల్కూడా అక్కరలేదు.
అయితే, గత ప్రభుత్వం సంక్షేమాన్ని మరిచి ఉచిత నగదు పథకాల వల్ల, నిరర్థక అభివృద్ధి వల్ల ఇటు సమాజం ఎదగలేదు, అటు చేసిన అభివృద్ధి ఉపయోగపడింది లేదు. పర్యవసానమే ఇవాళ తెలంగాణ ప్రభుత్వ అడుగంటిన ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. అందుకే, రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ నమూనా ప్రాధాన్యాలను అనుసరించడం మానుకోకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడం సాధ్యంకాని పని.
ఉచిత నగదు పథకాల మూసలోంచి బయటపడి, తెలంగాణ సమాజాన్ని తన కాళ్లపై తాను నిలబడే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిస్తేనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలుగుతారు. అందుకు రేవంత్‌రెడ్డి రాజకీయ సాహసం చేయకపోతే.. అది తెలంగాణకు మరింత అనర్థంగా మారే అవకాశం స్పష్టంగాకనిపిస్తున్నది.
అప్పుడే దారి తప్పింది
దేశంలోనే మిగులు రాష్ట్రంగా ఉండాల్సిన తెలంగాణ ఇవాళ జీఎస్డీపీలో పరిమితులు దాటిన అప్పుల రాష్ట్రంగా ఎందుకు మారింది? అనే కీలక ప్రశ్ననే తెలంగాణ దారి తప్పిందెక్కడో చెప్పగలుగుతుంది. ఉద్యమ పార్టీని కాస్తా ఫక్తు పార్టీగా మార్చుకున్నామని 2014లో కేసీఆర్ ప్రకటించుకున్ననాడే, వచ్చిన తెలంగాణ భవిష్యత్తు దారి తప్పింది.
తెలంగాణ భవిష్యత్తును ఉచితాలతో కట్టిపడేసి, అభివృద్ధిని అవినీతి రాజ్యమేలడంతో అప్పులు పెరిగాయి తప్ప రాబడి పెరగలేదు. సరికదా, జరిగిన అభివృద్ధి ఉపయోగంలోకి వచ్చి.. ప్రజలకు ప్రయోజనం జరిగి.. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి.. ప్రభుత్వానికి రాబడి పెరిగిందా? వెచ్చించిన అప్పుల పెట్టుబడితో సమానంగా ప్రభుత్వానికి ఎందుకు రాబడి పెరగలేదు? కేసీఆర్ పాలనలో దేనికీ జవాబు దొరకదు మరి!
అప్పులు పెరిగాయి, ఆస్తులు నిరర్థకమయ్యాయి
రూ.లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 49శాతం ప్రయోజనం జరిగితే, 51శాతం అది నిరర్థకంగా మారిందని కాగ్ రిపోర్టే చెప్పింది. ప్రభుత్వం ఎక్కడ పెట్టుబడి పెట్టినా నూటికి నూరు శాతం ప్రయోజనం జరిగితేనే దాన్ని అభివృద్ధి అంటాం. పదేండ్లలో జరిగిన అభివృద్ధి పనులలో పాక్షిక ప్రయోజనం, అత్యధికం నిరర్థకంగా మారిన పరిణామాలే అంతటా కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే, జరిగిన అభివృద్ధి ఒక రకంగా గుదిబండలైనాయి.
రెండు పవర్ ప్రాజెక్టులు(యాదాద్రి, భద్రాది) అలాంటివే. పాలమూరు ఎత్తిపోతల అలాంటిదే. చేసిన అభివృద్ధి ప్రణాళికలు, డిజైన్లు ఏఒక్కటీ ప్రామాణికంగా లేకపోవడంతో ఇపుడు పిల్లర్లు కూలడం, పంప్‌హౌస్‌లు మునగడం లాంటి అనర్థాలే.. జరిగిన అభివృద్ధి ఎంత అనర్థంగా మారిందో చెపుతాయి.
అప్పులు చేయడం తప్పుకాదు, అప్పులతో సమానంగా ఆస్తులూ పెరగాలి. పెరిగిన ఆస్తులు నిరర్థకంగా మారితే, చేసిన అప్పులు తీర్చే అవకాశాలు ఉంటాయా? గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఇవాళ రేవంత్ ప్రభుత్వానికి భారంగా ఎందుకు మారాయో వేరే చెప్పనక్కర లేదేమో?
ఉచితాలు, సంక్షేమాల మధ్య గీతను చెరిపేశారు
నిజానికి తెలంగాణను సంక్షేమ తెలంగాణగా మార్చే అవకాశం మొదటి పాలకుడైన కేసీఆర్‌కే ఉండింది. కానీ, ఆయన పథకాలన్నీ ఓటు చుట్టూ తిరిగాయి. ఆ దుష్పలితాన్ని ఇవాళ తెలంగాణ అనుభవిస్తోంది. ఆ దుష్పరిణామమే ఇవాళ దివాలా తీసిన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది.
ఖరీదైన చదువు, ఖరీదైన వైద్యం మధ్యతరగతికి, పేదలకు అందని ద్రాక్షలుగా మారాయి. జరిగిన అభివృద్ధి పనులు అలా ఉంటే, కనీసం ప్రజా సంక్షేమమైనా సరిగా నడిపారా? సంక్షేమాన్ని, ఉచితాలుగా మార్చేసి రాజ్యమేలారు. ఉచితాలకు, సంక్షేమానికి మధ్యన ఉండే సన్నని గీతను చెరిపేశారు. దాంతో సంక్షేమం పడకేసింది. ఉచితాలు ఓట్లుగా మారాయి. పదేండ్ల తర్వాత చూస్తే తెలంగాణ సమాజం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.
ఓటుదే ప్రాధాన్యత
ఉచితాలతో ప్రజల బతుకులకు తాత్కాలిక ఉపశమనాలు కలగొచ్చు. కానీ, సంక్షేమ పథకాలు ఏమయ్యాయి? తమ పిల్లల చదువులు ఏమయ్యాయి? తమ ఆరోగ్యం ఏమైందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కడుపు తరుక్కుపోతది! పదేండ్లలో ప్రాధాన్యాలు దారి తప్పి, సమాజం ఎదుగుదల దెబ్బతిన్నది.
‘ చెప్పనివి కూడా చేశాం’ అనే కేసీఆర్ రోటీన్ డైలాగు ఎంత మోసం చేసిందో ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎగనామం పెట్టి, కల్యాణలక్ష్మి ఇవ్వాలని కేసీఆర్‌ను ప్రజలు కోరారా? ఆరోగ్యశ్రీ బకాయిలకు ఎగనామం పెట్టి, సీఎంఆర్ఎఫ్తో పొలిటికల్ మైలేజీ పెంచుకొమ్మని ప్రజలు చెప్పారా? ఎన్నికల ముందు మాత్రమే (బ్యాలెట్లో గుర్తు కనిపించాలని) ఉచిత కళ్లద్దాల పథకం పెట్టాలని ప్రజలు అడిగారా? ప్రాధాన్యత ఉచితాలకే తప్ప, సంక్షేమానికి ఇచ్చిన జాడ ఎక్కడ? ఓటుదే ప్రాధాన్యత.
సంక్షేమాన్ని మింగేసిన ఉచితాలు
ఏ పేదోడి కుటుంబమైనా, వారి పిల్లలు బాగా చదివితే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదిగి తన కాళ్లమీద తాను నిలబడడానికి ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకం ఉపయోగపడుతుంది తప్ప కల్యాణలక్ష్మి వంటి ఓటు పథకాలతో నిలబడగలదా? పథకాలన్ని ఓటు చుట్టూతిప్పి, తెలంగాణ సమాజాన్ని మార్పులేని సమాజంగా మిగిల్చారు. ఓ వైపు అభివృద్ధి గుదిబండలుగా మారితే, ఇంకోవైపు సమాజాన్ని ఎదిగించాల్సిన సంక్షేమాన్ని ఉచితాలు మింగేశాయి. ఇక పదేండ్ల తెలంగాణలో జరిగిందేమిటో, సమాజం అలాగే ఎందుకు ఉన్నదో అందరూ ఆలోచించాలె.
కేసీఆర్ బాటలో..
వచ్చిన తెలంగాణను కేసీఆర్ ఏబాటలో నడిపారో.. అదే బాటను అనుసరిస్తే తప్ప గెలవలేం అనే ధోరణి ఇవాళ అన్ని పార్టీలకు ఒక అంటురోగంగా మారిపోయింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించింది కూడా కేసీఆర్ నమూనానే. 6 గ్యారంటీల హామీ కేసీఆర్ నమూనాకు తీసిపోదు. అందులో ఆరోగ్యశ్రీ కవరేజీ పది లక్షలకు పెంచడం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, వరి పంటకు500 బోనస్ మాత్రమే సంక్షేమ పథకాలు. మిగిలినవన్నీ ‘ఓటు ఉచితాలు’ తప్ప, సమాజ సంక్షేమాలు కావు.
పరిపాలనకు ఉచితాలే కొలమానమైనాయి!
పదేండ్ల కేసీఆర్ ఉచితాలు, సమాజాన్ని తప్పుదోవ పట్టించాయి. పరిపాలనకు ఉచితాలు మాత్రమే కొలమానం అనే స్థాయికి సమాజాన్ని తీసుకెళ్లాయి. సంక్షేమానికి, ఉచితాలకు ఉండే సన్నని గీతను తిరిగి పునరుద్ధరించే సాహసం ఏ రాజకీయపార్టీ అయినా చేసే అవకాశం ఉందా? అందుకు కారణం ఎవరయ్యా అంటే.. మొదటి పాలకుడైన కేసీఆరే అనేది చారిత్రక నిజం.
తెలంగాణ తన కాళ్లపై తాను నిలబడాలంటే..
కేసీఆర్ పాలనలో అమలు చేసిన ఉచిత పథకాలకు అందరూ అర్హులే. ఎన్నికల్లో గెలవాలంటే అందరినీ అర్హులను చేయాలి మరి! పేదోడు, ఉన్నోడు అనే తేడా లేకుండా ఉచితాలను పప్పుబెల్లాలుగా పంచిన ఘనత కేసీఆర్ పాలనదే మరి! అన్ని పథకాలలో అనర్హులను తొలగించే సాహసం చేసే పాలకుడే తెలంగాణ భవిష్యత్తుకు నిజమైన నిర్మాత కాగలుగుతాడు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇవాళ ఇంతగా దిగజారిందంటే.. పదేండ్ల అప్పులు, పనిరాకుండా పోయిన అభివృద్ధి నిరర్థక ఆస్తులు, ఓట్ల ఉచితాల పుణ్యమే అని తెలియనివారుండరు. తెలంగాణ తన కాళ్లపై తాను నిలబడి, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా మార్చగలగాలంటే, పాలకుడు రాజకీయ సాహసం చేయాల్సిందే.
తెలంగాణ భవిష్యత్తుకు కావాల్సిన ప్రాధాన్యతలు పదేండ్లుగా గాడి తప్పాయి. వాటిని గాడిలో పెట్టే సాహసం చేయకపోతే.. తెలంగాణ భవిష్యత్తును ఊహించుకోవడం సాధ్యంకాదు. 4 ఏండ్ల తర్వాత ఎవరి ప్రభుత్వం వచ్చినా కేసీఆర్ నమూనానే కొనసాగించే అవకాశం ఉంది.
కాబట్టి ఎవరో ఒకరు రాజకీయ సాహసం చేయాలి. ఉచితాలను క్రమేణా తగ్గిస్తూ, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమాలకు ప్రాధాన్యాలను పెంచితే తప్ప తెలంగాణ భవిషత్తును ఊహించుకోలేం. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలెంజ్‌గా తీసుకోగలడా? లేదా కేసీఆర్ నమూనా ఉచితాల వెంటే పరుగెడుతాడా?
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి,పొలిటికల్ ఎనలిస్ట్-