మంచి నీరు లేని ప్రపంచంలో మనగలమా..! మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది..?

మంచి నీరు లేని ప్రపంచంలో మనగలమా..! మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది..?

భూమ్మీద 70 శాతానికిపైగా నీరుంటే అందులో స్వచ్ఛమైన నీరు చాలా తక్కువ, తాగు, సాగునీటి శాతం కేవలం 2.7 శాతం మాత్రమే. ఇందులో 75 శాతం మంచు రూపంలో ఉంటే.. 22 శాతం భూగర్భ జలాల రూపంలో ఉంది. మిగతాది సరస్సులు, నదులు, వాతావరణం. తేమ, చెమ్మల రూపంలో ఉంటుంది. ఈ నీటిలో కూడా మనం ఉప యోగించేది చాలా తక్కువ. భూమి ఏర్పడినప్పుడు మంచి నీరు ఎంత ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది, కానీ, ఆ నీటిని ఉపయోగించుకునే జనాభా మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీనికితోడు పట్టణీకరణ, పారిశ్రామిక కాలుష్యం, మురుగు నీటి సమస్య కూడా స్వచ్ఛమైన నీటికి సవాలుగా మారాయి. 

ప్రస్తుతం వందల కోట్ల మంది సురక్షితమైన నీటికి దూరంగా ఉంటున్నారు. పని చేసే చోట, బడిలో, ఫ్యాక్టరీల్లో ఎక్కడ చూసిన స్వచ్ఛమైన నీటి కొరత కనిపిస్తుంది. రానున్న తరానికి ఇది మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టడం ఖాయమని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమూల్యమైన నీటి విలువ తెలియజేయడానికి, దానిని వృథా చేయకూడదనే అవగాహన కల్పించడానికి ఓ ప్రత్యేకమైన రోజు ఉండాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. 1993 నుంచి ప్రతి ఏటా మార్చి 22వ తేదీని 'ప్రపంచ జలదినోత్సవం'గా నిర్వహిస్తోంది.

ప్రపంచ జల దినోత్సవం లక్ష్యం ఏంటి?

నీటిని 'రీసైక్లింగ్' చేసి శుభ్రంగా మార్చడం ద్వారా నీటి నాణ్యతను పెంచాలని.. నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల ప్రజలకు పరిశుభ్రమైన నీటిని అందించాలనే లక్ష్యాలతో ఐక్యరాజ్యసమితి పని చేస్తోంది. ఇందుకు 2030వ సంవత్సరాన్ని టార్గెట్ గా పెట్టుకుంది. స్వచ్ఛమైన నీటి విషయంలో ప్రజల్ని చైతన్యపరిచేందుకు పర్యావరణ వాదులు, కొన్ని సంస్థలు జల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు.

వరల్డ్ వాటర్ డే థీమ్:

ప్రతీ ఏడాది 'వరల్డ్ వాటర్ డే' కోసం ఐక్యరాజ్య సమితి ఒక థీమ్ ను రూపొందిస్తుంది. 2025కు గానూ ప్రపంచ జలదినోత్సవ నినాదం 'గ్లేసియర్ ప్రిజర్వేషన్'.. అంటే ‘హిమానీ నదాల పరిరక్షణ’ అని అర్థం. అంటే హిమాలయాలు కరిగి మంచినీరు వృధాగా సముద్ర గర్భంలో కలిసిపోకుండా కాపాడుకోవడం. హిమాలయాలు కరిగిపోతే సముద్ర మట్టం పెరిగి ఇప్పుడున్న సగం భూభాగం మునిగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో మంచినీటి సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. 

కర్బన ఉద్గారాల వలన భూగోళం మండుతోంది. ఓజోన్ పొర చిల్లుపడటంతో ఆల్ట్రావాయిలెట్ కిరణాలు భూమిపైకి చొచ్చుకొని వస్తున్నాయి. దీంతో భూతాపం పెరిగి హిమాలయాలు కరిగిపోతున్నాయి. అంతకాకుండా వాతావరణంలో ఉండే కర్బన రసాయనాలు హిమాలయాల్లో చేరి కలుషితం అవుతున్నాయి. హిమానీ నదుల నుంచి వచ్చే నీరు వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. 

ALSO READ | ఎప్పుడైనా ఆలోచించామా.. నీటి బొట్టు విలువెంత అని..! ఇవాళ (మార్చి 22) ప్రపంచ జలదినోత్సవం

అందుకే హిమానీ నదులు కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉంది. వాటిని కాపాడుకోవాలంటే కర్బన ఉద్గారాలను తగ్గంచాలి. గ్రీన్ ఎనర్జీ వైపు ప్రపంచం అడుగులు వేయాలి.  హిమానీ నదుల పరిరక్షణ అనే థీమ్ వెనుక ఇన్ని లక్ష్యాలు దాగి ఉన్నాయి. ఈ లక్ష్యాలను పాటిస్తూ భూతాపం పెరగకుండా, హిమానీ నదులను, హిమాలయాలకు కాపాడుకోవడం ఇప్పుడున్న లక్ష్యం. 

అంతేకాకుండా మంచి నీరు రోజురోజుకూ తగ్గిపోతున్న తరుణంలో.. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నీటి సంరక్షణను జాతి సంస్కృతిగా తీర్చిదిద్దుకోవాలి. నీటి అవసరాలు నానాటికీ అధికమవుతున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ నీటి పొదుపును పాటిస్తామని ప్రతిజ్ఞ చేయాలి.