ప్రైవేటు ఆస్పత్రులకు ట్రేడ్​ లైసెన్స్​ ఏది?

ప్రైవేటు ఆస్పత్రులకు ట్రేడ్​ లైసెన్స్​ ఏది?
  • క్లినికల్​ ఎస్టాబ్లిష్​మెంట్ ​రూల్స్​ ఉల్లంఘిస్తున్న దవాఖానలు
  • రోగుల దగ్గర భారీగా ఫీజులు తీసుకొని రాష్ట్ర సర్కారు ఆదాయానికి గండి కొడుతున్న హాస్పిటళ్లు
  • ట్రేడ్​లైసెన్స్​నుంచి మినహాయించాలంటూ హైకోర్టులో పిటిషన్
  • పట్టించుకోని మున్సిపల్, మెడికల్​ ఆఫీసర్లు
  • కోట్లలో ఆదాయాన్ని కోల్పోతున్న మున్సిపాలిటీలు

మంచిర్యాల, వెలుగు : రాష్ర్టంలోని మెజారిటీ ప్రైవేట్  హాస్పిటళ్లు క్లినికల్​ఎస్టాబ్లిష్​మెంట్​రూల్స్ ను ఉల్లంఘిస్తున్నాయి. ఈ రూల్స్​ ప్రకారం మున్సిపాలిటీల్లో దవాఖానలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ట్రేడ్​లైసెన్స్​ తీసుకోవాలి. కానీ, చాలా హాస్పిటళ్లు ఈ లైసెన్స్​తీసుకోకుండానే నడుస్తున్నాయి. దీంతో మున్సిపాలిటీలు రూ.కోట్లలో ఆదాయాన్ని కోల్పోతున్నాయి. అయినప్పటికీ మెడికల్​ అండ్​ హెల్త్​ డిపార్ట్​మెంట్ ఆఫీసర్లు గానీ, మున్సిపల్​ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు.

లైసెన్స్​ఫీజు పెంచిన సర్కారు

మునిసిపాలిటీల్లో ట్రేడ్​ లైసెన్స్​ ఫీజును పెంచుతూ రాష్ట్ర  ప్రభుత్వం 2020లో జీఓ నంబర్ 417 తెచ్చింది. దీని ప్రకారం ప్రైవేట్  హాస్పిటళ్లు మున్సిపాలిటీకి స్క్వేర్  ఫీటుకు రూ.5 నుంచి రూ.7 చొప్పున చెల్లించి ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలి. బిల్డింగుల పరిమాణాన్ని బట్టి కనీసం రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు, కార్పొరేట్​హాస్పిటళ్లు అయితే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఫీజు చెల్లించాలి. మంచిర్యాల జిల్లాలో మొత్తం 230 ప్రైవేట్  దవాఖానాలు ఉన్నాయి. ఇందులో వందకుపైగా జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. చాలా వరకు ఆస్పత్రులు ట్రేడ్​ లైసెన్స్  తీసుకోలేదు. దీంతో మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి
పడుతోంది.

ALSO READ : గెలుపు కోసం పోరాటం మెజార్టీ కోసం ఆరాటం

కోర్టును ఆశ్రయించిన ఐఎంఏ

ట్రేడ్​ లైసెన్స్​ ఫీజు కట్టకుండా తప్పించుకునేందుకు ఆయా జిల్లాల ఇండియన్  మెడికల్  అసోసియేషన్  (ఐఎంఏ) ఇన్ చార్జులతో పాటు ప్రైవేట్​ హాస్పిటళ్ల నిర్వాహకులు హైకోర్టులో రిట్  పిటిషన్  వేశారు. సర్వీస్​ మోటోతో హాస్పిటళ్లు నిర్వహిస్తున్నామని, బిజినెస్​గా పరిగణించరాదని, ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 417 నుంచి ప్రైవేటు ఆస్పత్రులను మినహాయించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ర్ట ప్రభుత్వం తరపున మున్సిపల్​ డిపార్ట్​మెంట్​ కౌంటర్లు వేయడం లేదు. సంబంధిత అధికారులు కోర్టులో విచారణకూ హాజరుకావడం లేదు. ఇలా ప్రైవేట్  హాస్పిటళ్లు ట్రేడ్  లైసెన్స్  ఫీజులు చెల్లించకపోవడంతో మున్సిపాలిటీలు రూ.కోట్లలో ఆదాయాన్ని కోల్పోతున్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్​మెంట్​రూల్  28(4) ప్రకారం ట్రేడ్​  లైసెన్సులు లేకుండా  కొత్తగా హాస్పిటళ్ల ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వరాదు. పాత దవాఖానాల పర్మిషన్​ను సైతం రెన్యువల్  చేయకూడదు. ఆరోగ్యశ్రీ  ట్రస్టు అధికారులు బిల్లులు ఇవ్వరాదు. ప్రైవేట్​ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బిల్లులు చెల్లించకూడదు. కానీ, సంబంధిత అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ ఇన్సూరెన్సులకు సంబంధించి ట్రేడ్​ లైసెన్స్​లేకుంటే ఐఆర్​డీఏ చర్యలు తీసుకుంటుంది. అలాగే హాస్పిటళ్లలో ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కూడా వీలుకాదు. మరోవైపు మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పాటైన హాస్పిటళ్లు నేటికీ పాత లెక్కల ప్రకారమే ప్రాపర్టీ టాక్స్​కడుతున్నాయి. వీటిని మున్సిపల్ అధికారులు ఆన్​లైన్​లో అప్​డేట్​చేయడం లేదు.

క్రిమినల్​చర్యలు తీసుకోవాలి

ప్రైవేట్​హాస్పిటళ్ల నిర్వాహకులు రోగుల దగ్గర భారీగా ఫీజులు వసూలు చేస్తూ సేవల​పేరిట సర్కారును తప్పుదోవ పట్టిస్తున్నారు. ట్రేడ్  లైసెన్సు తీసుకోకపోతే హాస్పిటళ్లకు పర్మిషన్​ ఇవ్వరాదు. అయితే, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ర్టవ్యాప్తంగా సుమారు రూ.వెయ్యి కోట్ల ఆదాయాన్ని మున్సిపాలిటీలు కోల్పోతున్నాయి. సదరు హాస్పిటళ్లపై ప్రభుత్వం క్రిమినల్​ చర్యలు తీసుకోవాలి. - నయీం పాషా, ఆప్  జిల్లా జనరల్  సెక్రటరీ

మంచిర్యాల జన్మభూమి నగర్​లో ప్రైవేట్​ హాస్పిటల్​ఇది. రెండేండ్ల కిందట భారీ హంగులతో ఐదు ఫ్లోర్లలో నిర్మించారు. కానీ 3,600 స్క్వేర్​ ఫీట్లకు మాత్రమే రూ.14,400 ట్రేడ్​ లైసెన్స్​ఫీజు, గ్రీన్​ఫండ్​ రూ.వెయ్యి మొత్తం రూ.15,400 చెల్లించారు. వాస్తవానికి ఐదు ఫ్లోర్లకు రూ.లక్షపైనే చెల్లించాల్సి ఉంటుందని అంచనా. మంచిర్యాలలోని చాలా ఆస్పత్రులది ఇదే పరిస్థితి.