పెండ్లి అంటే.. నూరేళ్ల పంట. అందుకే పెండ్లి వేడుకను అంగరంగ వైభవంగా చేసుకుంటారు. కానీ.. ఆ వేడుక వల్ల పర్యావరణానికి తీరని నష్టం కలుగుతుంది అంటున్నారు ఈ దంపతులు. అందుకే జీరో వేస్ట్ పెండ్లి చేసుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. తమలాగే పర్యావరణానికి హాని కలగకుండా పెండ్లి చేసుకోవాలి అనుకునేవాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక స్టార్టప్ కూడా పెట్టారు.
ఇండియాలో పెండ్లిళ్లకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ.. మన దేశంలో జరిగే పెండ్లిళ్ల వల్ల కాలుష్యం కూడా పెరిగిపోతుందట! ఎక్స్పర్ట్స్ చెప్తున్నదాని ప్రకారం.. సగటున మూడు రోజుల పాటు జరిగే భారతీయ పెండ్లి వేడుకల వల్ల 800 కిలోల తడి వ్యర్థాలు, 1,500 కిలోల పొడి వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. సింగిల్ యూజ్ డెకరేషన్స్, గిఫ్ట్స్ నుంచి తినకుండా వదిలేసిన ఫుడ్ వరకు.. అన్నీ పర్యావరణానికి ప్రమాదమే. అందుకే జీరో వేస్ట్ పెండ్లి కాన్సెస్ట్‌ని తీసుకొచ్చారు అశ్విన్, నుపుర్ దంపతులు. అలాంటి పెండ్లిళ్లు చేసుకోవాలి అనుకునేవాళ్ల కోసం వాళ్ల స్టార్టప్ ద్వారా గ్రీన్ ఈవెంట్స్, సస్టైనబుల్ వెడ్డింగ్స్ సర్వీసులు అందిస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌కు వాళ్ల పెండ్లితోనే నాంది పలికారు.
మహారాష్ట్రకు చెందిన అశ్విన్ మాల్వాడే మర్చంట్ నేవీలో చీఫ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. కోల్‌కతాకు చెందిన నుపుర్ అగర్వాల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్. ఇద్దరూ పర్యావరణాన్ని కాపాడాలి అనుకునేవాళ్లే. వీళ్లు మొదటిసారిగా ముంబైలోని వెర్సోవా బీచ్‌లో ‘బీచ్ క్లీనప్ డ్రైవ్’ సందర్భంగా కలుసుకున్నారు. వాళ్ల అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డారు. కానీ.. అందరిలా కాకుండా పర్యావరణానికి ఏమాత్రం హాని చేయకుండా పెండ్లి చేసుకోవాలి అనుకున్నారు. అందుకోసం చాలామంది వెడ్డింగ్ ప్లానర్స్‌ని సంప్రదించారు. కానీ.. వాళ్లంతా ఎకో ఫ్రెండ్లీగా చేయడం కష్టమన్నారు. కొందరికైతే అసలు వీళ్లు చెప్పిన కాన్సెప్ట్ కూడా అర్థం కాలేదు. దాంతో వాళ్ల పెండ్లి ఈవెంట్ వాళ్లే చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
తమలాంటి వాళ్ల కోసం..
ఎకో ఫ్రెండ్లీ పెండ్లి చేసుకున్న తర్వాత వాళ్లకు ఒక ఆలోచన వచ్చింది. తమలాగే ప్రకృతిని ప్రేమించేవాళ్ల కోసం ఒక స్టార్టప్ పెట్టాలి అనుకున్నారు. 2020లో గ్రీన్‌మైనా’ పేరుతో ఒక ఈవెంట్ ప్లానింగ్ కంపెనీని పెట్టారు. ఈ కంపెనీ ద్వారా నుపుర్, అశ్విన్ పుట్టినరోజులు, పార్టీలు, కార్పొరేట్ ఈవెంట్లు ఎకో ఫ్రెండ్లీగా చేస్తున్నారు. అంతేకాదు.. ఎకో ఫ్రెండ్లీ పెండ్లి వల్ల కలిగే లాభాలు, పర్యావరణానికి హాని కలగకుండా ఎలా పెండ్లి చేసుకోవాలి అనేదానిపై కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. వీళ్ల స్టార్టప్‌కు అనూహ్య స్పందన లభించింది. దీనిద్వారా బాధ్యతాయుతంగా వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఈ వెంచర్ వల్ల ఇప్పటివరకు 3,000 కిలోల కర్బన ఉద్గారాలను తగ్గించామని వాళ్లు చెప్తున్నారు. అంతేకాదు.. 300కు పైగా చెట్లను నాటారు. మిగిలిన ఫుడ్‌ని వేలాది మందికి పెట్టారు. 8,800 కిలోల వేస్ట్‌ని కంపోస్ట్ చేశారు.
ఎకో ఫ్రెండ్లీ
నుపుర్, అశ్విన్ తమ పెండ్లిని పూణేలో పూర్తి ఎకో ఫ్రెండ్లీగా చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. పెండ్లికి వచ్చినవాళ్లకు సాఫ్ట్ డ్రింక్స్‌కు బదులు ఫ్రెష్ జ్యూస్‌లు ఇచ్చారు. లోకల్‌గా దొరికే పూలతో వేదికను అలంకరించారు. తర్వాత వాటిని కంపోస్టింగ్ చేయించారు. కొంచెం కూడా పొడి వ్యర్థాలు ఉత్పత్తి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పెండ్లి తర్వాత ఊరేగింపు (బారాత్)కు కూడా ఎలక్ట్రిక్ వెహికల్‌నే వాడారు. పెండ్లిలో మిగిలిపోయిన ఫుడ్ వేస్ట్ కాకుండా పేదలకు పంచిపెట్టారు. అంతేకాదు.. పెండ్లికి వచ్చేవాళ్లకు కూడా పర్యావరణానికి హాని చేయొద్దని చెప్పారు. అందుకే అతిథులను విమానాల్లో కాకుండా ట్రైన్లలోనే రావాలని రిక్వెస్ట్ చేశారు. పెండ్లికి రావడం కోసం వాళ్లు చేసిన ప్రయాణం వల్ల ఉత్పత్తి అయిన కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఒక్కో గెస్ట్‌తో ఒక్కో మొక్క నాటించారు. గిఫ్ట్స్‌ని కూడా న్యూస్పేపర్లలోనే చుట్టి తీసుకురావాలని అందరికీ చెప్పారు. నుపుర్ తన తల్లి పాత చీరతో కుట్టిన లెహంగా వేసుకుంది. పెండ్లికి వచ్చిన వాళ్లకు స్టీల్ బాక్సుల్లో స్వీట్లను పంచారు. పెండ్లిలో ఎక్కడా ప్లాస్టిక్ వాడలేదు.