Spiritual: వేదాల్లో విద్య గురించి ఏముంది.. సంతోషంగా .. హాయిగా ఉండాలంటే డబ్బు ఎలా సంపాదించాలి..

Spiritual: వేదాల్లో  విద్య గురించి ఏముంది.. సంతోషంగా .. హాయిగా ఉండాలంటే డబ్బు ఎలా సంపాదించాలి..

అరేయ్​ బాబూ.. చదువుకోండిరా.. లేకపోతే మాలాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.. ప్రతి తల్లి దండ్రులు పిల్లలకు చెబుతుంటారు.  బాగా చదువుకుంటే... పెద్ద ఉద్యోగం వస్తుంది.. డబ్బులు బాగా వస్తాయి.. సుఖంగా.. హాయిగా.. సంతోషంగా గడపవచ్చని చెబుతుంటారు.  అసలు.. డబ్బు.. గురించి..విద్య గురించి మన వేదాల్లో ఏముంది.. రుషులు ఏమని వివరించారో తెలుసుకుందాం.  

చదువు ఎందుకంటే సంపాదించడం కోసం  ముందు వెనుక ఆలోచించకుండా చెప్పేస్తారు. మరికొందరు ఙ్ఞానం కోసం మంటారు. మరి ఙ్ఞానం ఎందుకంటే అది కూడా డబ్బు సంపాదనకే అని చెబుతుంటారు. ప్రస్తుతం విద్య అనేది ధనం సంపాదించడం కోసమే అని భావించడంతో వ్యాపార రంగంగా మారింది.  అందుకే  విద్య విషయంలో రాజకీయనాయకుల ప్రమేయం పెరిగిపోవడంతో కలుషితమయింది. 

వేదాలు.. రుషులు తెలిపిన వివరాల ప్రకారం   ధనం ద్వారా వచ్చే సుఖం కన్నా... ధర్మం ద్వారా లభించే సుఖంలో సంతృప్తి, శాంతి ఉంటాయి. జీవితంలో లభించే సుఖాలకు దూరంగా ఉండమని...  వ్యర్థమైన విరక్తిని బోధించలేదు హిందూ ధర్మం. హాయిగా బ్రతకమంది... ఆనందంగా బ్రతకమంది. అయితే ఆ ఆనందం అర్థవంతం కావాలి. ..ఏ వ్యక్తికీ హాని కలిగించనిదై ఉండాలి. అలాంటి అర్థవంతమైన అవగాహన కలిగించేదే విద్య... ఆ అవగాహనతో ఆర్జించేదే ధనం... ఆ లక్ష్యం కోసం వినియోగం కావడమే దాని ఉద్దేశం... ఆ వినియోగం వల్ల లభించే ఆనందమే జీవిత సార్థకం. విద్యద్వారా అమృతత్వం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి.

చివరకు తల్లిదండ్రులు కూడా విద్య ద్వారా డబ్బును సంపాదించే యంత్రాలుగా పిల్లలను తీర్చిదిద్దే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. కానీ మన ఆర్షధర్మం (ఋషులు ఏర్పరచిన మార్గం) విద్యకు లక్ష్యాలను చాలా చక్కగా వివరించారు. విద్యవల్ల వినయం రావాలి. వినయం అనే మాటకు అణకువ,విధేయత-అనేఅర్థాలే కాక జ్ఞానం అనే అర్థముంది. విజ్ఞానిని వినీతుడు అని అంటారు.

విద్య వల్ల ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఆ ప్రవర్తనకు కూడావినయమనే పేరు. ఇక్కడ వినయ శబ్దానికి ఈ అర్థాలన్నింటినీ తీసుకోవచ్చు. విద్య వల్ల విధేయత, విజ్ఞానం, ప్రవర్తనాసరళి లభిస్తాయి. దాని ద్వారా అర్హత..ఆ అర్హతవల్ల ధనం..ఆ ధనం వల్ల ధర్మం.. ధర్మం ద్వారా సుఖం లభిస్తాయి. 

విద్యకీ.. ధనానికీ మధ్య వినయము అనే వారధి ఉంది.  ధనానికీ... సుఖానికీ మధ్య ధర్మం ఉంది.ఇలాంటి  ముఖ్య విషయాలను గమనించక విద్య నుంచి ధనం.. ధనం నుంచి సుఖం అనే 'జంపింగ్' వ్యవహారం వల్ల వ్యక్తిత్వానికి అవసరమైన వినయం, ,ధర్మం అనే విలువల లేకుండా పోయింది.  ఈ పద్ధతి వ్యక్తినీ, సమాజాన్నీ కూడాక్రమంగా బలహీనపరుస్తుంది.

ఇక్కడ విద్యకి .. ధనానికి లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నాయి.   ధనం వల్ల సంపాదించవలసినది ధర్మం. ధర్మం ద్వారా సుఖాన్ని సంపాదించాలి. ఈవిషయాన్ని విద్యార్థులూ, విద్యాలయాలూ గమనిస్తే విలువలుగల విద్యావ్యవస్థను సాధించవచ్చు. ధనానికి ముందూ వెనకా ఉత్తమ లక్షణాలుంచారు.ఆ లక్షణాల వల్ల వ్యక్తి నియంత్రణ సాధ్యపడుతుంది. సమాజానికి భద్రత ఉంటుంది.

ధర్మాన్ని ఆచరించడానికి తగిన వనరులు లేక చాలామంది అసహాయులైపోతారు.కానీ ధర్మాచరణకు తగిన సంపాదన కలిగి ఉండడం భాగ్యం. ఆ భాగ్యాన్నివినియోగించుకోవడమే ధనాన్ని ధర్మం కోసం ఖర్చుచేయడం. సమాజపు శాశ్వత సౌఖ్యం కోసం పరితపించే బుద్ధి ఉన్నవారు ఈ విధంగా ఆలోచిస్తారు. వ్యక్తి జీవిత మార్గనిర్దేశాన్ని ఇంత సమగ్రంగా బోధించిన మన సనాతనధర్మానికి మోకరిల్లవలసిందే.

విద్యకు ప్రాధాన్యమిచ్చిన గురుపీఠం మనదేశం. భౌతిక సుఖాలను కూడాలక్ష్యపెట్టకుండా అరణ్యాలలో నివాసం చేస్తూ జీవితమంతా జ్ఞాన సముపార్జన కోసం వెచ్చించి మహాతపస్వులు ...విద్యయా అమృతమశ్నుతే...  అంటే విద్య ద్వారా అమృతత్వం లభిస్తుందని బోధించారు. సౌఖ్యాలనూ, సౌకర్యాలనూ పరిగణించకుండా తపస్సులా విద్యాభ్యాసం చేయాలని మన సంప్రదాయం. విద్యను వ్యాపారం చేసే దుష్ట సంస్కృతిలోనే ఈ సుఖసౌకర్యాల ఆలోచనలు పుడతాయి.నిరంతర అధ్యయనం వల్లనే నిరంతర ధర్మం, తద్వారా సుఖం వర్థిల్లుతాయి.సత్యస్పృహతో అసలైన ఆనందాన్ని పొందాలంటే విద్య ధనాల ముందు వెనుకనున్న లక్షణాలను తెలుసుకుని వాటి ప్రకారం నడవాల్సిందేనని వేదాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం విద్య అనేది ధనసంపాదనకే పరిమితం కావడంతో  అలా అక్రమంగా..అన్యాయంగా ధర్మం ప్రకారంగా సంపాదించకపోవడం వల్ల చాలామంది ఎంత సంపాదించినా ఇబ్బందులు పడుతున్నారు.  కాని ఇలాంటి వాస్తవాలను తెలుసుకోలేక.. చెప్పేవారు లేక మనము.. మనతో పాటు పిల్లలు ఎన్నో తప్పులు చేస్తున్నాము.