కేసీఆర్ సంవత్సరకాలంగా బయటకు రాకపోవడానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప శాసనసభకు వెళ్లరా? సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కేసీఆర్ ఇలా ఎలా ఆలోచిస్తారు? ప్రజాతీర్పును మన్నించి ప్రతిపక్షంలోకి వచ్చినవాళ్లు మళ్లీ ఐదు సంవత్సరాలు కష్టపడి ప్రజల మన్నన పొంది తిరిగి అధికారంలోకి రావడానికి పని చేయలేరా? అసలు తాను శాసనసభ ముఖం చూడకూడదని తీసుకున్న కీలక నిర్ణయం వెనుక మతలబు ఏంటనే పశ్న కొనసాగుతూ వస్తున్నది. ఆయనను, ఆయన రాజకీయ జీవితాన్ని గత యాబై ఏండ్ల నుంచి దగ్గరగా గమనిస్తున్న కీలక వ్యక్తులు కూడా కేసీఆర్ రాజకీయ నిష్క్రమణను అంగీకరిస్తున్నారు కూడా. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమని కొందరు, సార్ మౌనం ఇంకెంతకాలమని ఇంకొందరు, ఇంతకీ సార్ బయటకు వస్తరా.. రారా, రేపో మాపో బయటకొస్తారని మరికొందరు... ఇలా పార్టీలో చర్చించుకుంటున్న విషయం అందరికీ విదితమే.
వీటన్నిటికీ సమాధానం లేకపోగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్వయాన ఆయన కొడుకు కేటీఆర్ ఇటీవలే మాట్లాడుతూ ‘ఓడిపోతే రెస్ట్ తీసుకుంటాను అన్నారు..ఇప్పుడు కేసీఆర్ అదే పని చేస్తున్నారు’ కేసీఆర్‌తో ఏం పని? అని కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే బలమైన సంకేతాలు, సందేశాలనిచ్చినట్లయింది. గౌరవప్రద వీడ్కోలూ కోరుకోవడం లేదా?కేసీఆర్ రిటైర్మెంట్ చాలా హుందాగా ఉండాలని, ఉద్యమాన్ని నెరపి, తొలి ప్రభుత్వాన్ని నడిపిన ఆయన రాజకీయ నిష్క్రమణ అచేతనవస్థకు దారి తీయకూడదని ఆంతరంగిక సమావేశాల్లో కేటీఆర్, కవిత చెబుతుంటారు.
అంటే, ఇంకోసారి పార్టీ అధికారంలోకి వస్తే ఆయన్నే సీఎం చేసి ఆ తర్వాత పార్టీని వారసులకు అప్పగించాలని పట్టుబడుతున్నారు. అందుకే తరచూ ఫాంహౌస్‌కు వెళ్లి రాజకీయ చర్చలు జరిపే ప్రయత్నాలను చేస్తున్నా ఆయన ససేమిరా అంటున్నారని కేసీఆర్ ఆంతరంగికులే చెబుతున్నారు. ఎంతసేపు ఓడించిన జనంతో ఇక నాకేంపని అనే ధోరణీనే ఆయన కనబరుస్తున్నారు. కేసీఆర్ బయటకొచ్చే అనువైన వాతావరణం ఉన్నా, ఇప్పుడాయన ఆరోగ్యం బాగానే ఉన్నా, కవిత జైలు నుంచి బయటకొచ్చినా, కేసీఆర్ ఎక్కడా అని అధికార పక్షం నుంచి ఎన్నిసార్లు కవ్వింపు కామెంట్లొచ్చినా, చివరకు కన్న కొడుకు కేసుల్లో ఇరికి జైలు పాలవుతారనే ప్రచారం జరిగినా, తనపై కూడా విచారణ సంస్థల్ని ఉసిగొల్పుతారనే ప్రచారం జరుగుతున్నా, చివరకు పార్టీ సంక్షోభ సమయంలో ఉన్నదని చెబుతున్నా గుంబనంగా ఉంటున్నారే తప్ప కించిత్ కూడా మాట్లాడడం లేదు.
అనధికారిక రిటైర్మెంట్!
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణాంతరం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికీ ఆయన గైర్హాజరయ్యారు. తెలంగాణ కల సాకారానికి కారకుడైన దిగంత మాజీ ప్రధాని మన్మోహన్‌కు నివాళి కూడా అర్పించకపోవడాన్ని యావత్తు తెలంగాణ సమాజం తప్పుపట్టింది. రాష్ట్రంలో అధికార పార్టీ వ్యవహార శైలిపై మాట్లాడే అవకాశాలు, సందర్భాలు, అంశాలు బోలెడున్నా జనంతో నాకేంటనే వ్యవహారశైలిప్పుడు అనేక చర్చలకు దారితీస్తున్నది. స్పీకర్, సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్ వంటి నేతలు శాసనసభకు రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకని ఏకరవు పెడుతున్నా.. కేసీఆర్ మాత్రం తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నారనే చర్చ పార్టీ ఆంతరంగికుల్లో ఉన్నది. అప్పుడప్పుడు పైకి సలహాలు, సూచనలిస్తున్నా ఆయన ఇక దీర్ఘకాలిక రాజకీయాలు చేసే ఉద్దేశ్యంలో లేరని కాలగమన పరిస్థితులు వెల్లడిస్తున్నాయి.
నిర్మాణం లేని పార్టీ
పదేండ్లు అధికారంలో ఉన్నా పార్టీకి నిర్మాణం లేదు. తన మీడియా సంస్థల బలోపేతంపైనా దృష్టి పెట్టలేదు. 2023 అసెంబ్లీ ఫలితాల సమీక్ష, 2024 పార్లమెంట్ ఫలితాలపై సమీక్ష లేదు. ఎప్పుడూ ఓ లూజ్ ఫోరంగా పార్టీ నడించిందే తప్ప సంస్థాగత నిర్మాణం లేకపోవడం ఇప్పుడు పార్టీకి పెద్ద నష్టం. ఇప్పటివరకు పార్టీ
క్యాడర్‌కు పార్టీ పదవులు లేవు. గ్రామశాఖ అధ్యక్షుడి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎలాంటి పదవులు లేకుండా క్యాడర్ మొత్తం కల్లోలంలో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవల కేటీఆర్ ఏసీబీ విచారణ సందర్భంగా మీరంతా గట్టిగా డిబేట్లు చేయాలి.. వ్యాసాలు రాయాలని స్వయాన ఆయనే జూమ్ మీటింగ్‌లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సంభాషణ జరిపితే సదరు నేతలంతా ఏ హోదాలో చర్చించాలి. ఏ పదవులతో రాయాలని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ చీఫ్, సీఎం అభ్యర్థి ఇక కేటీఆరేనా ?
కేసీఆర్ ఇక ఎప్పుడు బయటికి వస్తారనే చర్చపోయి కేటీఆర్‌కే పార్టీ పగ్గాలు గుంబనంగా అప్పగించారనే వాదన బలంగా నడుస్తున్నది. గత ఏడాది కాలం నుంచి పార్టీ కార్యాకలాపాలాల్ని ఆయనే పర్యవేక్షిస్తున్నారు. పార్టీని పూర్తిస్థాయిలో తన కంట్రోల్లోకి తీసుకున్నారు. సీనియర్ నేతలు హరీష్ లాంటి వారు కూడా కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ నాయకత్వాన్ని బలపరచాల్సిన దుస్థితి. పార్టీలో ఇక కేటీఆర్ సుప్రీం అని సీనియర్ నేతలతో కూడా కేసీఆర్ నర్మగర్బంగా చెప్పేస్తున్నారట. అందుకే పార్టీలో ఇప్పుడు కర్త, కర్మ, క్రియ అన్నీ తానేగా వ్యవహరిస్తున్న కేటీఆర్.. నిత్యం ఎమ్మెల్యేలతో, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వంతో టచ్‌లో ఉంటున్నారని చెబుతున్నారు. భావిరోజుల్లో సీఎం అభ్యర్థి తానేనని కూడా ప్రకటించుకునే పరిస్థితి.
పార్టీలో అసంతృప్తి పెరగొచ్చనే భయం..
రాజకీయ వైరాగ్యమా లేక ఇక చాలు ఈ రాజకీయ జీవితమనా ఏమోకానీ కేసీఆర్ మౌనం, పొలిటికల్ రిటైర్మెంట్ వెనకాల బలమైన మతలబే కనిపిస్తున్నదని రాజకీయ పండితుల అభిప్రాయం. కేటీఆర్‌ను అధికారికంగా అధ్యక్షుడుగా ప్రకటిస్తే పార్టీలో అసంతృప్తి రావచ్చనే అనుమానమే కేసీఆర్ తన రిటైర్మెంట్ను అధికారికంగా ప్రకటించలేకపోతున్నాడని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. నిజంగానే కేటీఆర్‌ను అధికారికంగా అధ్యక్షుడిగా ప్రకటిస్తే పార్టీలో అసంతృప్తి పెరిగే అవకాశం లేకపోలేదు. అది పార్టీకి మరింత నష్టం చేసే అవకాశం ఉండనే ఉంటుంది. అందుకే, అనధికారికంగా కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడానికే.. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ తన రాజకీయ మౌనవ్రతం కొనసాగిస్తున్నారని రాజకీయ పండితుల విశ్లేషణ.
కేటీఆర్‌కే అనధికారికంగా అధ్యక్ష హోదాను కట్టబెట్టారనడానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఇటీవల కేటీఆర్ తన ఫ్యామిలీతో దుబాయ్‌కు వెళ్లారు. మర్నాడే మాజీ ప్రధాని మన్మోహన్ మృతి చెందగా ఆయన హుటాహుటిన ఒక్కరోజు కోసం ఢిల్లీకొచ్చి మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి దుబాయ్ వెళ్లేందుకు రెడీ అయ్యారు. కానీ, సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా ప్రత్యేక అసెంబ్లీని సమావేశపరిచి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ వస్తారా, రారా అని గమనించారు. దీంతో కేటీఆర్ చేసేదేమిలేక తన దుబాయ్ పర్యటనను రద్దు చేసుకుని, తిరిగి హైదరాబాద్‌కొచ్చి అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్నారు. అంటే దుబాయ్‌లో ఉన్న కేటీఆర్ ... మన్మోహన్ అంత్యక్రియలకు కేసీఆర్‌ను వెళ్లాలని సూచించవచ్చును. కేసీఆర్, మన్మోహన్‌కు సాన్నిహిత్య సంబంధాల నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లాలని విజ్ఞప్తి చేయవచ్చును. లేకుంటే ఆ బాధ్యతను పార్టీలో మరో కీలక నేత హరీష్‌కు అప్పజెప్పాల్సి ఉండే. కానీ, కేటీఆర్‌నే ఇటు ఢిల్లీకి, అటు అసెంబ్లీకి పంపడంలోని మతలబు ఏంటి? దీన్నిబట్టి పార్టీ పగ్గాలు, పార్టీలో ఏ అంశాన్నైనా తానే మీదేసుకుని కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే.. కేసీఆర్ స్వచ్ఛంద రాజకీయ విరమణ కోరుకున్నట్టుగా అవగతమవుతున్నది.
వెంకట్ గుంటిపల్లి,
తెలంగాణ
జర్నలిస్టుల ఫోరం