రైళ్లల్లో కవచ్ వ్యవస్థ అంటే ఏమిటో తెలుసా.. 

కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవడం అని అర్థం. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) పేరుతో ప్రారంభమైంది. అయితే 2017 నుంచి దీన్ని తొలిసారి అమలులోకి తీసుకువచ్చారు.

ఒడిశాలో జరిగిన దారుణ రైలు ప్రమాదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే కవచ్ ఉండుంటే ఈ రైలు ప్రమాదం జరిగేదే కాదని కొందరు అంటున్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసుకువచ్చిన కవచ్ వ్యవస్థ ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు. భారత చరిత్రలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదంగా నిలిచింది. గతంలో జరిగిన ఏ రైల్వే ప్రమాదంలోనూ ఇంత పెద్ద మొత్తంలో మరణాలు సంభవించలేదు. దీంతో రైల్వే భద్రత, సిగ్నలింగ్ వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రైల్వే బడ్జెట్‭లో సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టెక్నాలజీని అమల్లోకి తీసుకువచ్చారు. ప్రతి ఏడాది బడ్జెట్‭లో దీనికి భారీ కేటాయింపులే చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన తీసుకువచ్చిన ఈ సాంకేతికత రైల్వే ప్రమాదాన్ని ఎందుకు ఆపలేకపోయిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ రైలు ప్రమాదం జరిగిన రూట్లో ఆ టెక్నాలజీ ఉందా అనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి.

ఇంతకీ కవచ్ ఏంటి?

కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవడం అని అర్థం. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) పేరుతో ప్రారంభమైంది. అయితే 2017 నుంచి దీన్ని తొలిసారి అమలులోకి తీసుకువచ్చారు. లోకోమోటివ్‌లు, ట్రాక్‌లు, రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్, ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రతి స్టేషన్‌లలో అమర్చబడిన ఎలక్ట్రానిక్ పరికరాలు, రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరాల ద్వారా ఇది పని చేస్తుంది. 4G LTE ఆధారిత సిస్టంతో అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత సిస్టమ్.. అల్ట్రా-హై రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది.

కవచ్ వ్యవస్థలో ఎన్నో ఉపయోగాలు

రీసెర్చ్‌ డిజైన్ అండ్ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌., భారతీయ పరిశ్రమల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కవచ్ వ్యవస్థలో ఎన్నో ఉపయోగాలున్నాయి. పరిశోధనలు., పరీక్షలు దాటుకుని ఈ రక్షణ వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేశారు. అనేక ట్రయల్స్‌ను కవచ్‌ సమర్ధవంతంగా పూర్తి చేసుకుంది. ప్రయాణంలో ఉండగా రెడ్‌ సిగ్నల్‌ గుర్తించకపోవడం., సిగ్నల్ దాటడం, ఎదురెదురుగా రైళ్లు ఢీ కొట్టే పరిస్థితి ఎదురవడం, పరిమితికి మించిన వేగంతో రైళ్లు ప్రయాణించడం., రైలు వేగాన్ని డ్రైవర్ నియంత్రించకలేక పోవడం వంటి సమస్యలు ఎదురైనపుడు కవచ్ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుంది. తద్వారా రైలు ప్రమాదాలను పూర్తి స్థాయి ఖచ్చితత్వంతో నిరోధిస్తుంది. కవచ్ వ్యవస్థ ఏర్పాటుతో రెండు రైళ్లు ఎదురెదురుగా ప్రయాణించి ఢీ కొట్టే ప్రమాదాలను నివారించవచ్చు.

లోకోపైలట్ కు సూచనలు

రైలు ఢీకొనడానికి ప్రధాన కారణమైన లోకో పైలట్ సిగ్నల్ జంప్ చేసినప్పుడు కవాచ్ హెచ్చరిస్తుంది. సిస్టమ్ లోకో పైలట్‌ను అప్రమత్తం చేయగలదు. బ్రేక్‌లను నియంత్రించగలదు, నిర్ణీత దూరం లోపు అదే లైన్‌లో మరొక రైలును గమనించినప్పుడు స్వయంచాలకంగా రైలు కదలికను నిలిపివేస్తుంది. పరికరం రైలు కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది, లోకోమోటివ్‌లకు సిగ్నల్‌లను పంపుతుంది, ఇది పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా సహాయపడుతుంది.

ఎదురెదురు రైళ్లను ఆపుతుంది

రెడ్‌ సిగ్నల్‌ పడినప్పుడు లోకో పైలట్‌ పట్టించుకోకండా ఆ రైలును అలాగే తీసుకెళ్లినట్లయితే ఈ కవచ్‌ అనే వ్యవస్థ గుర్తించి ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. ట్రాక్‌ బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, అలాగే రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు గుర్తించి రైళ్లను ఆపేలా చేస్తుంది. అంతేకాకుండా వంతెనలు, మలుపుల ఉన్న ప్రాంతాల్లో కూడా రైలు వేగాన్ని తగ్గించేలా చేస్తుంది. ఇప్పుడు ఈ కవచ్‌ వ్యవస్థను ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు.  ప్రభుత్వం తెలిపిన ఈ వివరాల్ని చూసుకుంటే  ప్రమాదం జరిగిన రైల్వే జోన్  పరిధిలో  కవచ్ టెక్నాలజీ లేదని స్పష్టమవుతోంది. అందుకే మూడు రైళ్లు ఢీకొట్టుకున్నట్లు నిపుణులు అంటున్నారు.