24 గంటల ఉచిత కరెంట్​లో నిజాలేంటి?

వ్య వసాయానికి ఉచిత విద్యుత్ పంపిణీ అంశం టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి తెరమీదకు వచ్చింది. తెలంగాణలో 90 శాతం మంది అయిదెకరాల లోపు భూమి గల చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, ఉదాహరణకు మూడెకరాల భూమి ఉన్న రైతు పొలం పారడానికి మూడుగంటల నాణ్యమైన కరెంట్ సరిపోతుందని అమెరికాలో తానా సభలో ఎన్నారైలు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రేవంత్​ సమాధానం చెప్పాడు. బీఆర్ఎస్​ ప్రభుత్వం ఉచిత విద్యుత్​ పంపిణీ పేరుతో.. ఆ భారాన్ని పేదలపై వేస్తున్నారని అన్నారు.  రేవంత్​ వ్యాఖ్యలపై అధికార బీఆర్​ఎస్​ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్​ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ఉచిత విద్యుత్​ పంపిణీకి వ్యతిరేకమని అధికార పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. నిజంగా  24 గంటల ఉచిత విద్యుత్​పై ప్రభుత్వం చెపుతున్నదేమిటి? వాస్తవంలో జరుగుతున్నదేమిటో తెలుసుకుందాం.

వ్యవసాయానికి వాడుతున్న కరెంట్​ ఎంత?

రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం నెల నెలా ఎంత కరెంట్ వాడుతున్నారనే లెక్కలు మాత్రం చెప్పడం లేదు. మొత్తంగా ఓ సంఖ్య చెబుతూ.. సబ్సిడీకి ఇన్ని వేల కోట్లు ఇస్తున్నట్లు టూకీగా సమాధానం చెబుతున్నది. ఇక్కడే అసలు లొసుగులు దాగి ఉన్నాయి. విద్యుత్​ ఉత్పత్తి అయిన దగ్గర నుంచి వినియోగదారుడికి చేరే వరకు పంపిణీలో సాంకేతిక, విద్యుత్ చౌర్యం లాంటి నష్టాలు ఉంటాయి. ఇవిగాక బిల్లులు కట్టకుండా ఏండ్ల తరబడి విద్యుత్ వాడుకుంటున్న పాతబస్తీ లాంటి నష్టాలూ ఎన్నో ఉంటాయి. ఎలాగూ ఏ రైతు ఎంత విద్యుత్​ వాడుకుంటున్నాడో లేదా ఏ ట్రాన్స్​ఫార్మర్​ కింద ఎంత విద్యుత్​ ఖర్చు అవుతున్నదో లెక్కలు లేవు. కాబట్టి విద్యుత్ పంపిణీ నష్టాలను డిస్కంలు.. రైతుల కరెంట్ ఖర్చు ఖాతాలో వేసే అవకాశం లేకపోలేదు. డిస్కంలు వేసే వ్యవసాయ రంగ వినియోగ లెక్కల అంచనా శాస్త్రీయతపైనే ఆధారపడి ఉంటుంది. కానీ కేవలం కొన్ని శాంపిల్​ మీటర్లపై ఆధారపడ్డ వ్యవసాయ వినియోగం లెక్కల్లో కచ్చితత్వం లేదు. డిస్కంలు తమ ఇష్టం వచ్చినట్టు ఈ లెక్కలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఏటా రూ.15 వేల నుంచి 18 వేల కోట్ల రూపాయల వరకు వ్యవసాయ విద్యుత్​కు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. రైతులకు ఉచిత విద్యుత్తు విధానం అమలులో ఉన్నప్పుడు, డిస్కంలకు విద్యుత్ కొనుగోలుకయ్యే ఖర్చులో ప్రధాన భాగం ప్రభుత్వమే 'సబ్సిడీ' రూపంలో భరించాల్సి ఉంటుంది. మిగిలిన భారాన్ని ఇతర వినియోగదారుల నుంచి వారు చెల్లించాల్సిన చార్జీ కన్నా కొంత ఎక్కువ చార్జీ విధించి వసూలు చేస్తారు. ఇలా సాధారణ ప్రజలపై కూడా భారం పడుతుంది. సాధారణంగా డిస్కంలు వ్యవసాయ వినియోగ అంచనాలను ఎక్కువ చేయడానికి మొగ్గు చూపుతాయి. దీనివల్ల వాటికి ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో సబ్సిడీలు వస్తాయి.

డిస్కంలను అప్పుల్లో ముంచి

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌‌ సరఫరాకు సంబంధించి రూ.25 వేల కోట్ల మేర విద్యుత్‌‌ సంస్థలకు సర్కారు బకాయిపడింది. ఐదేండ్లలో రూ.12,500 కోట్లు చెల్లిస్తామని ఈఆర్​సీకి లెటర్​ రాసిన సర్కారు.. మిగతా వాటి గురించి ఊసే ఎత్తడం లేదు. సర్కారు ఆఫీసులకు కరెంట్​ వాడుకున్న బకాయిలు రూ.17,500 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు మరో రూ.10 వేల కోట్లు ప్రభుత్వం డిస్కంలకు బాకీ ఉన్నట్లు తెలుస్తున్నది. నిజానికి 24 గంటల కరెంట్ వాడుకుంటున్నది పెద్దరైతులు, రియల్టర్లు, ఫామ్​హౌజ్​ ఓనర్లు మాత్రమే. మాకు 24 గంటల కరెంట్ కావాలని రాష్ట్రంలో ఏ రైతు డిమాండ్​ చేయలేదు. 8 నుంచి పది గంటల నాణ్యమైన విద్యుత్​ రైతుకు సరిపోతుంది. అయినా కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తుంటే.. మళ్లీ బోర్లు, బావుల ఉచిత విద్యుత్​ కింద ఏటా రూ.14 వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నట్లు? రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిది ద్వంద్వ వైఖరి అని స్పష్టమవుతున్నది. తెలంగాణలో కాంగ్రెస్​కు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక.. ఏదో ఒక రూపంలో ప్రజల దృష్టిని ఆకర్షించుకునేందుకు.. నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. వీటిని బట్టే అర్థమవుతున్నది కాంగ్రెస్​తో బీఆర్​ఎస్ కు​ వణుకు మొదలైందని!

ALSO READ:ఫాక్స్‌‌‌‌కాన్‌‌‌‌ కొత్త పెట్టుబడి రూ.8,800 కోట్లు

57 లక్షల మంది చిన్న రైతులే

తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్​ పంపిణీ అంశాన్ని స్థూలంగా పరిశీలిస్తే రెండు విషయాలు స్పష్టమవుతాయి. ప్రభుత్వం చెబుతున్నట్టుగా రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్​ ఇవ్వడం లేదు, పోని 24 గంటలు ఉచిత విద్యుత్​ ఇచ్చినా.. ఆ విద్యుత్​ పూర్తిస్థాయిలో వాడే రైతులు 10 శాతానికి మించి ఉండరు. ప్రభుత్వ రైతు బంధు 2022 యాసంగి లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులు ఉండగా.. వారి ఆధీనంలో 1.48 కోట్ల ఎకరాల భూమి ఉన్నది. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు 57,60,280 మంది ఉన్నారు. అంటే.. 91.43 శాతం మంది. మరి ఈ 57 లక్షల మంది రైతుల పొలం పారడానికి 24 గంటల ఉచిత విద్యుత్​ను వాడగలరా? 24 గంటలు మోటార్లు నడిచేంతగా వారి బోర్లు, బావుల్లో నీళ్లు ఉన్నాయా? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు.

మీటర్లు పెడతామంటే..

రాష్ట్రంలో పంపుసెట్లు 26 లక్షలు ఉంటే, వాటికి కరెంట్ ఇచ్చే ట్రాన్స్​ఫార్మర్ల సంఖ్య సుమారు 3 లక్షలు. ట్రాన్స్​ఫార్మర్లకు మీటర్లు పెడితే.. వ్యవసాయానికి ఎంత కరెంట్​ ఖర్చు అవుతున్నదీ సులభంగా తెలుస్తుంది. వ్యవసాయ విద్యుత్​ పంపిణీ కచ్చితమైన లెక్కల కోసం కేంద్రం విద్యుత్​ సవరణ బిల్లులో మీటర్లు పెట్టాలని ప్రస్తావిస్తే.. అధికార బీఆర్​ఎస్​ పార్టీ తప్పుడు వ్యాఖ్యానాలతో గందరగోళం సృష్టించింది. రైతులను భయపెట్టింది. రైతుల వాడకం పేరిట, విద్యుత్ చౌర్యాన్ని, ఇతర నష్టాలనూ, భారీ ఖర్చులను వారి మీదకి నెట్టడం రైతు సంక్షేమం ఎలా అవుతుంది? వాస్తవానికి, వ్యవసాయ రంగ వినియోగం ప్రభుత్వాల అంచనాల కన్నా చాలా తక్కువగా ఉంటుంది. చౌర్యాన్ని, ఇతర నష్టాలను వ్యవసాయ వినియోగంలో కలపడంతో ఈ వినియోగం భారీగా కనబడుతున్నది. రాష్ట్రంలో వ్యవసాయరంగ వినియోగం 1763 కోట్ల యూనిట్లుగా తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అంచనా వేసింది. ఒక్కో యూనిట్ సరఫరా ఖర్చు రూ 8.36 అయితే.. వ్యవసాయ విద్యుత్​కు అయ్యే మొత్తం ఖర్చు రూ.14,745 కోట్లు. ఇదంతా ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ఇతర వినియోగదారుల నుంచి క్రాస్-సబ్సిడీల రూపంలో వస్తుంది. ఇంత భారీ మొత్తం రైతుల పేరిట ఎలాంటి శాస్త్రీయ అంచనాలు లేకుండా ఖర్చు పెడుతుండటంతోనే.. తానా సభలో రేవంత్​ ఉచిత విద్యుత్​ పంపిణీ విధానాన్ని ప్రశ్నించారు. రెగ్యులేటరీ కమిషన్2024 నాటికి రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లకు మీటర్లు పెట్టాలని 2022 మార్చిలోనే డిస్కంలకు ఆదేశాలు జారీ చేసినా, ఎందుకు పెట్టడం లేదో రాష్ట్ర సర్కారు సమాధానం చెప్పాలి.

- కమల్ మేడగోని, రాజకీయ విశ్లేషకులు