
తిరుమల అడవుల్లో చిరుతల సంఖ్య పెరిగింది. రక్తం మరిగిన పులులు దాటికి ఓ చిన్నారి భక్తురాలి ప్రాణాలు కోల్పోయింది. నూరేళ్లు నిండకుండానే చిన్నారి వన్యమృగానికి బలైపోయింది. చిరుత దాడికే చిన్నారి లక్షిత చనిపోయనట్లుగా ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది. దీంతో ఆమె తల్లిదండ్రుల రోదన అంతా ఇంతా కాదు.
తిరుమల తిరుపతి దేవాస్థానం, ఫారెస్ట్ అధికారుల తీరును చిన్నారి తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. తమ కూతురి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు. వన్య మృగాలు వరుసగా దాడి చేస్తుంటే అలిపిరి మెట్ల మార్గాన్ని ఎందకు మూసివేయలేదని లక్షిత తల్లి ప్రశ్నిస్తు్ంది. భక్తుల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని మండిపడింది. అయితే వన్యప్రాణులను కట్టడి చేయలేమని టీటీడీ అధికారులు అంటున్నారు.
చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. ఈ ఘటన చాలా దారుణమన్నారు. కాలిబాట మార్గంలో కంచె ఏర్పాటుపై ఫారెస్ట్ అధికారులను నివేదిక ఇవ్వమని ఆదేశించామన్నారు. కాలిబాట నడకన 500 సీసీ కెమెరాల ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. టీటీడీ చైర్మన్‌ను సంప్రదించి కాలిబాట మార్గంలో ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
ఇటీవల చిరుత నోట చిక్కిన చిన్నారి అనూహ్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు. జూన్ నెలలో రాత్రిపూట తిరుమల అలిపిరి నడక దారిలో కొండకు వెళ్తున్న ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది. నడక మార్గంలో వస్తున్న బాలుడిని నోట చిక్కించుకుని అడవిలోకి పరుగులు తీసింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన బాలుడి తల్లిదండ్రులు అప్రమత్తమై చిరుతను వెంబడించారు. బాలుడిని అడవిలోకి లాక్కెళ్లిన చిరుత వెంటే స్థానికులు అరుపులు కేకలతో వెంటపడ్డారు.
అప్పటికే బాలుడిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో స్థానికుల అప్రమత్తత బాలుడి ప్రాణాలు కాపాడింది. బాలుడి తల్లిదండ్రులు, ఇతర భక్తులు, భద్రతా సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన దంపతులు తమ కుమారుడు నాలుగేళ్ల కౌశిక్‌తో కలిసి కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు వెళ్తున్నారు.