భారత రాజ్యాంగం ప్రజలకు ప్రాథమిక హక్కులను కల్పించింది. ఆదేశిక సూత్రాలను నిర్వచించి, సంక్షేమ రాజ్యంగా దేశాన్ని నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై పెట్టింది. ప్రజల సంక్షేమం కోణంలో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలైనా చేపట్టవచ్చని పేర్కొంది. సంపద ఒకే దగ్గర పోగు కాకుండా చూడాలని కూడా రాజ్యాంగం నిర్దేశించింది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు అమలు చేయకపోతే ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న అంశాలను అమలు చేయడం ప్రభుత్వాల నైతిక బాధ్యత. సమాజంలో ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను తగ్గించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగమే చెప్పింది. మనుషుల మధ్య వివక్ష ఏ రూపంలోనూ చూపించ కూడదనేది రాజ్యాంగ స్ఫూర్తి. ఈ సూత్రాలకు అనుగుణంగా అనేక చట్టాలు అమలులోకి వచ్చాయి. చట్టాలకు అనుగుణంగా అనేక ప్రభుత్వ జీవో లు కూడా తయారయ్యాయి. జీవోలను బట్టి ఆయా రాష్ట్రాలు మార్గదర్శకాలు తయారు చేశాయి. ప్రభుత్వం చట్టాలను, హక్కులను అమలు చేయని సందర్భాల్లో ప్రజలు కోర్టుకు వెళ్లినప్పుడు, సుప్రీం కోర్టు కూడా అనేక తీర్పులతో ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసింది. కానీ ప్రభుత్వాలకు ఇవేవీ పట్టడం లేదు . ప్రజల సంక్షేమం తమ బాధ్యత అన్న విషయం మర్చిపోయాయి. చట్టాలు, జీవోలు, మార్గదర్శకాల రూపకల్పన విషయంలో అత్యంత అమానవీయంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలంటే మరింత చులకన భావం కూడా ఉన్నది. ఈ మార్గదర్శకాలను అమలు చేయకపోయినా, ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా ఏమీ కాదనే ధీమా ప్రభుత్వాల్లో పెరిగింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణలో అమలు చేస్తున్న ఆసరా పెన్షన్ పథకం.
రైతులకు పెన్షన్ ఇస్తే తప్పేంటి?
రైతు కుటుంబాల్లో కూడా వరి, పత్తి, పల్లి లాంటి పంటల్లోనే ఎకరానికి నికర మిగులు 6 నెలలకు రూ.15 వేలకు మించి ఉండటం లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. మెట్ట పంటలకు ఆ మాత్రం ఆదాయం కూడా రావడం లేదు . రైతు జీవితం కూడా గౌరవ ప్రదమైన వృత్తే. 60 ఏండ్ల పాటు కష్టపడి పంటలు పండించి తాను బతుకుతూ, దేశానికి అన్నం పెడుతున్నాడు. లక్షల రూపాయల వేతనాలు ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, సంఘటిత కార్మికులకు, ఐదేండ్లు మాత్రమే గుర్తింపు ఉండే ఎమ్మెల్యేలకు(రెండో సారి ఓడినా) కూడా రిటైర్అయ్యాక వేల రూపాయల పెన్షన్ ఇచ్చే ప్రభుత్వాలకు రైతుకు పెన్షన్ చెల్లించడానికి మాత్రం మూడున్నర ఎకరాల భూమిని పరిమితిగా విధించడం కంటే అన్యాయం ఇంకేముంటుంది? గ్రామ స్థాయిలో పరిశీలిస్తే ఎవరు రైతో, ఎవరు పరోక్ష భూస్వామో ఈజీగా తెలిసి పోతుంది కదా ? రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులే ఇవ్వడం లేదు.
కుటుంబాల్లో పిల్లలకు లగ్గాలై, ఉద్యోగాలు చేసుకుంటూ, వేరు కాపురం పెట్టినా ఇంకా తల్లిదండ్రుల రేషన్ కార్డులోనే పేర్లు కొనసాగుతున్నాయి. అటువంటప్పుడు పిల్లల ఆదాయాలను చూసి వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఎగ్గొట్టడం ఎంత వరకు సమంజసం. జీవనోపాధికి స్వయం ఉపాధిని ఎంచుకున్న యువతీ యువకుల కుటుంబాల్లో వృద్ధాప్య పెన్షన్లు రద్దు చేయడమూ సరికాదు. ఈ తప్పుడు మార్గదర్శకాలతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్లు రద్దు చేసింది. దీన్ని తక్షణం ఆపాలె. కుటుంబంలో వృద్ధులు ఎందరున్నా, కుటుంబానికి ఒకటి అని కాకుండా, అందరికీ పెన్షన్ అందించేలా మార్గదర్శకాలను మార్చాలి. పెన్షన్ ఇవ్వడానికి పెట్టిన చివరి కండిషన్ అధికారులు లంచాలు గుంజడానికి తప్ప ఎందుకూ పనికి రాదు. దాన్నీ రద్దు చేయాలి. ఎప్పటికప్పుడు అర్హులుగా మారుతున్న వాళ్లనుంచి దరఖాస్తులు తీసుకోవడానికి వీలుగా గ్రామ పంచాయితీ, పట్టణ, వార్డు స్థాయిలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దరఖాస్తును ఒక నెలలోపు పరిశీలించి ఆమోదించాలి. ఆ మరుసటి నెల నుంచి పెన్షన్ మొత్తాన్ని చెల్లించాలి.
ఆసరా బకాయిలు ఎగ్గొట్టి..
తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత కింద ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి వీలుగా 2014 నవంబర్ 5 న పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జీవో నంబర్17 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులకు రూ.1000 చొప్పున, వికలాంగులకు రూ.1500 చొప్పున పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు కూడా ఆసరా పెన్షన్ కు(రూ.1000-) అర్హులేనని తర్వాత జీవోలు విడుదల చేసింది. తర్వాతి కాలంలో పెన్షన్ మొత్తాన్ని రూ. 2016 (వికలాంగులకు రూ. 3016) చొప్పున పెంచుతూ 2019 మే 28న జీవో ఇచ్చింది. వృద్ధాప్య పెన్షన్ కు 65 ఏండ్ల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గిస్తూ 2021 ఆగస్టు 4న మరో జీవో జారీ చేసింది. వయో పరిమితి తగ్గింపు, పెన్షన్ పెంపు అనేవి టీఆర్ఎస్2018 ఎన్నికల హామీలు. ఎన్నికల్లో విజయం సాధించగానే జీవోలు ఇయ్యాల్సి ఉన్నా.. చాలా ఆలస్యం జరిగింది. పైగా 2018 ఆగస్టు నుంచి 2022 జులై వరకు కొత్త పెన్షన్లను మంజూరు చేయలేదు.పెన్షన్ మొత్తాలను అందజేయలేదు. దీని ప్రకారం 48 నెలల పాటు ప్రతి నెలా 2016 రూపాయల చొప్పున లబ్ధిదారులు పెన్షన్ అందక నష్ట పోయారు. ఒక్కో వ్యక్తీ నష్ట పోయిన మొత్తం రూ. 96,768. అనేక ఆందోళనల తర్వాత 2022 ఆగస్టు నుంచి అమలయ్యే విధంగా కొత్త పెన్షన్లను అందజేస్తున్నారు. నిజానికి ఎన్నికల హామీ ప్రకారం, లేదా కనీసం జీవో విడుదల అయినప్పటి నుంచి అయినా ప్రభుత్వం పెన్షన్ బకాయిలను చెల్లించాల్సి ఉండే. కానీ వాటిని ఎగ్గొట్టింది. అది అనైతికం, చట్ట విరుద్ధం కూడా. 2015లో ఇచ్చిన జీవో లో పెన్షన్ పొందేందుకు కొన్ని అర్హతలు నిర్దేశించారు. వాటి ప్రకారం మూడున్నర ఎకరాలకంటే మాగాణి, ఏడున్నర ఎకరాలకంటే మెట్ట భూములు ఉన్న రైతులు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగులు, ఔట్ సోర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తులు, స్వయం ఉపాధి ఏర్పరుచుకున్నవారు, ఆయిల్ మిల్లు, రైస్ మిల్లు, పెట్రోల్ పంప్ ఓనర్లు, రిగ్గు ఓనర్లు, దుకాణాల యజమానులు, స్వాతంత్ర్య సమర యోధుల పెన్షన్ లేదా ఏదో ఒక ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు, నాలుగు చక్రాలు లేదా అంత కంటే పెద్ద వాహనాలు( లైట్ లేదా హెవీ) ఉన్న వారు పెన్షన్ పొందడానికి అనర్హులు. పెన్షన్ దరఖాస్తు పరిశీలనకు అధికారులు ఇంటికి వచ్చి చూసినప్పుడు ఆ కుటుంబ సభ్యుల లైఫ్ స్టైల్, ఇంట్లో ఉండే వస్తువులు స్థితిని బట్టి కూడా పెన్షన్ ఇచ్చేందుకు నిరాకరించవచ్చు.
కొత్త రూల్స్‌తో నష్టం
పెన్షన్లను ఎగ్గొట్టడానికి ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను అడ్డు పెట్టుకుంటున్నది. 2022 ఆగస్టు నుంచి కొత్తగా10 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని అట్టహాసంగా ప్రకటించుకున్న రాష్ట్ర ప్రభుత్వం, వారిని అర్హులుగా గుర్తిస్తూ కొత్త పెన్షన్ కార్డులను కూడా జారీ చేసింది. కానీ కొంతమంది లబ్ధిదారుల కడుపులో మట్టి కొడుతూ, వారు పెన్షన్ కు అనర్హులని చెప్పి కార్డులను రద్దు చేస్తున్నది. మరీ ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ ఎగ్గొట్టడానికి వివిధ కారణాలు వెతుకుతున్నది. కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండటం, ఏడున్నర ఎకరాల కంటే మెట్ట భూమి కొద్దిగా ఎక్కువ ఉండటం, ఇంట్లో అమ్మాయికో, అబ్బాయికో ప్రైవేట్ ఉద్యోగం ఉండటం లాంటి రూల్స్‌ను అడ్డుపెట్టుకొని పెన్షన్ కార్డులను రద్దు చేస్తున్నది. నిజంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించే వారికి ఎవరికైనా ఇవి అర్థం లేని కారణాలనేనని ఇట్టే అర్థమైపోతాయి. అతితక్కువ వేతనాలతో ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్ సోర్స్ ఉద్యోగాలు చేసే వారి కుటుంబాల్లో వృద్ధులకు పెన్షన్ నిరాకరించడం అన్యాయం. ఇటీవలి కాలంలో ఓలా, ఊబర్ లాంటి కంపెనీలు వచ్చాక చాలా మంది తమ జీవనోపాధి కోసం క్యాబులు కొనుక్కున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులతో నష్టాలను చవి చూశారు. వాటితో పెద్దగా ఆదాయం లేదు. అనేకమంది ఆటో డ్రైవర్స్, స్కూల్ పిల్లలను తీసుకు వెళ్లడానికి కూడా నాలుగు చక్రాల వాహనాలను కొనుక్కున్నారు. ఇప్పుడు ఈ వాహన యాజమానుల ఇండ్లలో వృద్ధాప్య పింఛన్లను రద్దు చేయడం కంటే అన్యాయం మరొకటి ఏముంటుంది? స్టేటస్ సింబల్ గా, సౌకర్యం కోసం కారు కలిగి ఉండటం వేరు, జీవనోపాధి కోసం కారు కలిగి ఉండటం వేరు. ఈ విచక్షణ ప్రభుత్వానికి ఉండాలి కదా? - కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక