కీర్తి చేసిన నేరంలో ఎవరి భాగమెంత?

స్మార్ట్​ఫోన్​ నుంచి బీప్​ వస్తే చాలు… గుండె గుభేల్​మనే పరిస్థితులున్నాయి. న్యూస్​ యాప్​ల నుంచి వచ్చే అలర్ట్​ల్లో ఎలాంటి క్రైమ్​ వార్త చదవాలోనని భయం. ఆస్తికోసం తల్లిదండ్రుల్ని చంపేసిన కొడుకులు, మగపిల్లాడి కోసం కోడలికి నరకం చూపించే అత్తమామలు,  మద్యం మత్తులో హత్యలకు దారితీసే స్నేహితుల గొడవలు, నమ్మించి గొంతుకోసిన ప్రేమికులు, … ఇలా ఏ వార్త చూసినా మానవీయతను చంపేస్తున్న కోణాలే. వీటన్నిటికీ కారణం ఏమిటన్నది విశ్లేషిస్తే… అన్నింటిలోనూ మెయిన్​ రీజన్​ ఒక్కటే… ఇంట్లో కలివిడితనం లేకపోవడం.  పిల్లలకు, పేరెంట్స్​కు మధ్య దూరం.

కీర్తి వార్త రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రేమలోపడిన ఒక టీనేజ్​ అమ్మాయి తల్లిని హత్య చేయడంపై పత్రికలు, పలు రకాల కథనాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ ఉదంతంలో క్రైమ్​ ఎలిమెంట్​ ఎక్కువగా ఉంది. అయితే సమాజం ఆందోళన పడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తండ్రి లారీ డ్రైవర్​ కావడం, తల్లి చుట్టుపక్కలవాళ్లతో చిట్టీల వ్యాపారం చేస్తూ బిజీగా ఉండడం అనేవి కూతురిని ఒంటరిదాన్ని చేశాయి. ఒక్కర్తే కూతురు కావడంతో అడిగినప్పుడు డబ్బులిచ్చి అల్లారుముద్దుగా పెంచారు. ఇవన్నీ చూసి అమ్మాయిని ట్రాప్​ చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. తమ కులానికే చెందిన కుర్రాడి వలలో పడింది కీర్తి. వీళ్ల ప్రేమ వ్యవహారం తెలిసి పెళ్లి సంబంధం కుదిర్చారు. అయితే, జీవితాన్ని ఎంజాయ్​ చేయడం గురించే తెలుసు తప్ప, దానివల్ల ఎదురయ్యే కష్టాలు, ఇబ్బందులు ఆ అమ్మాయికి ఏమీ తెలియవు. టీనేజ్​లో ఇలాంటివి తెలుస్తాయని అనుకోలేం. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడంకోసం మరో తప్పు చేయాల్సి వచ్చింది కీర్తి. గర్భవతినన్న విషయం వెల్లడి కాకుండా అబార్షన్​ చేయించుకోవాలనుకుంది. అమ్మానాన్నలతో మాట్లాడలేదు. ఒకపక్క భయం, మరోపక్క తెగింపు ఆమెను మళ్లీ పక్కదారి పట్టించాయి. అబార్షన్​ అనే మాట వినడమే తప్ప దానికి సంబంధించి ఏమీ తెలీనితనంతో ‘అన్నయ్య’ అని నోరారా పిలిచే వ్యక్తిని ఆశ్రయించింది. వాడు సాయం చేసే క్రమంలో కీర్తిని దగా చేశాడు. జరిగినదంతా అమ్మానాన్నలకు చెబుతానని బెదిరించి, బ్లాక్​మెయిల్​కి దిగాడు.  దాంతో వాడికి కూడా లొంగిపోయింది. చివరకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేద్దామని కొత్త ప్రియుడు చెప్పినా ఒప్పుకునే దశకు వచ్చింది. ఇక్కడ అమ్మాయినే కాదు, అబ్బాయి బ్యాక్​గ్రౌండ్​ చూడడం అవసరం. ఆ వ్యక్తి ఫ్యామిలీకూడా సజావుగా లేదు. తండ్రికి అతని తల్లి రెండో భార్య. వీళ్లిద్దరికీ పుట్టినవాళ్లలో వీడు మూడోవాడు.

తరువాత కొత్త ప్రియుడితో కలిసి తల్లిని చంపేసే లెవెల్​కు వెళ్లిపోయింది. ఇక్కడ ఒక హత్య గురించి మాత్రమే మాట్లాడుకోవడానికి వీల్లేదు. మారుతున్న మన సొసైటీ గురించి మాట్లాడుకోవాలి. చిన్నవయసులోనే శృంగారంవైపు మళ్లిస్తున్న పోర్న్​ వెబ్​సైట్​ల గురించికూడా మాట్లాడుకోవాలి.

ఎలాంటి కంట్రోల్​ లేకుండా సెకన్లలో స్మార్ట్​ఫోన్​లలో ప్రత్యక్షమవుతున్న పోర్న్​ వీడియోలు పిల్లలను ఎలా చెడగొడుతున్నాయో కథలు కథలుగా వింటున్నాం. ఇది తప్పని చెప్పేవాళ్లు ఇంట్లో ఉండరు. ఒకప్పుడు ఇల్లంటే రెగ్యులర్​ డైలీ లైఫ్​ నుంచి రిలీఫ్​నిచ్చేది.  ఉద్యోగ వ్యాపారాల్లో, స్కూలు కాలేజీల్లో, బంధుమిత్రుల సూటిపోటి మాటల్లో ఎదురయ్యే వత్తిడులనుంచి, భయాల నుంచి, బెంగల నుంచి ఇంట్లో ఉపశమనం లభించేది. ఒకరితో ఒకరు షేరింగ్​ అండ్​ కేరింగ్​ పొందేవారు. తమకు ఎదురైన ఇబ్బందుల్ని తల్లిదండ్రులతో, అన్నచెల్లెళ్లలతోనో పంచుకునేవారు. సమస్య లేదా ఇబ్బంది తీవ్రతనుబట్టి ఫ్యామిలీ మెంబర్లు స్పందించేవారు. వాళ్లు ట్రబుల్​ షూటర్లుగా పనిచేసేవారు. దీంతో ఎంత వత్తిడి ఉన్నాగానీ తమ గురించి ఆలోచించి, పరిష్కారం చూపించేవాళ్లున్నారన్న భరోసా ఉండేది. ఇప్పుడు భార్యాభర్తల మధ్యనే మాట ముచ్చట్లు ఉండడం లేదు.  ఆర్థికంగా ఎదగాలన్న తపనతో, కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న కోరికతో డైలీ లైఫ్​లో తీరిక లేకుండా గడుపుతున్నారు. భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలకు, పిల్లలు స్కూళ్లకు వెళ్లిపోతారు. వాళ్లు తిరిగి ఇంటికొచ్చే సమయానికి ఆలనాపాలనా చూసేవాళ్లుండరు. టీవీలకో, స్మార్ట్​ఫోన్లకో, టాబ్​లలో ఆన్​లైన్​ గేమింగ్​కో  అతుక్కుపోయి అమ్మానాన్నలకోసం ఎదురుచూస్తుంటారు. మంచి తిండి, బట్ట, లైఫ్​ కల్పించాలన్న వెంపర్లాటలో పిల్లల ఎదుగుదలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మైక్రో ఫ్యామిలీలు కావడం, అపార్టుమెంట్​ కల్చర్​లో ఇరుగుపొరుగు సంబంధాలే లేకపోవడం పిల్లలపై నెగెటివ్​ ప్రభావం ఎక్కువవుతోంది. కష్టమైనా ఇష్టమైనా, సుఖమైనా సంతోషమైనా, ఇబ్బందయినా ఆటంకాలైనా షేరింగ్​ ఉండడం లేదు. ఒకరికొకరు తోడుగా ఉండడమనే సిస్టమ్​ మానవ సంబంధాలకు చాలా ముఖ్యమంటున్నారు సైకాలజిస్టులు. షేరింగ్​ ఉన్నట్లయితే ఎవరికి ఏ కష్టమొచ్చినా కేరింగ్​ బాగా జరుగుతుందని, ఫ్యామిలీల్లో క్రైమ్​ చొరబడకుండా అడ్డుకోగలుగుతామని సూచిస్తున్నారు.

ఇక్కడ కీర్తి విషయంలో జరిగింది అదే. ఆమెకు తోబుట్టువులు లేరు. ఇంట్లో అమ్మానాన్నలిద్దరూ సంపాదన వేటలో పడి కూతురితో ఎక్కువసేపు గడిపే స్థితిలో లేరు. ఇక, సొంతూరు వదిలిపెట్టి పదేళ్లు కావడంతో బాల్య స్నేహితులంటూ ఎవరూ మిగలలేదు కీర్తికి.  హైదరాబాద్​లాంటి నగరంలో ఉండేవన్నీ తాత్కాలిక బంధాలే. అటు యవ్వన ప్రారంభకాలం, ఇటు కాస్తో కూస్తో డబ్బుకి ఇబ్బందిలేని మిడిల్​ క్లాస్​ జీవితం కీర్తిని తప్పుదారిలోకి తీసుకెళ్లాయి. వయసొచ్చిన అమ్మాయిపట్ల అనునయంగా, స్నేహితురాలిగా ఉండాల్సిన తల్లి పదే పదే తన తప్పులు ఎత్తిచూపుతూ మందలించడంతో చివరికి శత్రువులా కనిపించిందని మానసికవేత్తలు విశ్లేషిస్తున్నారు. కీర్తి తెగువకు ఇదికూడా కారణమంటున్నారు. ఎవరెన్ని చెప్పినా వినలేని స్థితికి ఆమె మానసికంగా వెళ్లిపోయిందని, తల్లిదండ్రులు ఆమె పట్ల షేరింగ్​ అండ్​ కేరింగ్​ ధోరణిలో ఉన్నట్లయితే ఈ దారుణం జరగకపోయి ఉండేదని అంటున్నారు. ఇప్పుడు ఆమె కుటుంబంలో తండ్రి ఒక్కడే ఏకాకిగా మిగిలాడు. జీవితపు మొదటి మెట్టుపైనే తప్పటడుగులు వేసిన కీర్తికి భవిష్యత్తు అనేది లేకుండా పోయిందని సైకియాట్రిస్ట్​లు అంటున్నారు.

గ్రోత్​ కోసం ఉరుకులాడే జీవితాల్లో ఉండేవన్నీ తాత్కాలిక బంధాలే. అటు యవ్వన ప్రారంభకాలం, ఇటు కాస్తో కూస్తో డబ్బుకి ఇబ్బందిలేని మిడిల్​ క్లాస్​ జీవితం కీర్తిని తప్పుదారిలోకి తీసుకెళ్లాయి. వయసొచ్చిన అమ్మాయిపట్ల అనునయంగా, స్నేహితురాలిగా ఉండాల్సిన తల్లి పదే పదే తన తప్పులు ఎత్తిచూపుతూ మందలించడంతో చివరికి శత్రువులా కనిపించింది. మిత్రుల్లా నటించిన ఇద్దరూ ఆమెను స్వార్థంతో వాడుకున్నారని మానసికవేత్తలు విశ్లేషిస్తున్నారు.