- ఎంక్వైరీని సీబీఐకి అప్పగించాలన్న పిల్‌పై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
- రెండు వారాలు గడువిస్తూ విచారణ వాయిదా
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిల్‌పై రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏంటో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ సేకరించిన నిధుల సేకరణకు సంబంధించి దర్యాప్తు అంశంపై కూడా స్పష్టత ఇవ్వాలంది. వీటిపై ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీసు స్టేషన్‌లోని కేసును సీబీఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులివ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ వేసిన పిల్‌ను శుక్రవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్‌ల డివిజన్ బెంచ్ విచారించింది.
మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీల భద్రతకు చర్యలు తీసుకునేలా నేషనల్ డ్యాం సేఫ్టీ కౌన్సిల్‌కు ఆదేశాలివ్వాలని పిటిషన ర్ లాయర్ కోరారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, బ్యాంకుల నుంచి రూ.86 వేల కోట్ల నిధుల సేకరణపై సీబీఐ, ఎస్‌ఎఫ్‌ఓలతో దర్యాప్తు జరిపించాలన్నారు. ప్రభుత్వ వివరణకు 2 వారాల గడువు కావాలని కోర్టును అదనపు ఏజీ ఇమ్రాన్ ఖాన్ కోరారు. దీనికి హైకోర్టు అనుమతిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సింగిల్ జడ్జి జస్టిస్ ఎస్.నంద విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ బి. రాంమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ విచారించే పిల్‌తో జత చేయాలని ఆదేశించారు.