
సమాజంలో అక్కడక్కడా హిజ్రాలు వేధిస్తున్నారని సామాన్యులు ఫిర్యాదు చేయటం చూస్తుంటాం. కానీ.. హిజ్రాలనే ఒక యువకుడు వేధిస్తున్న ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రేమిస్తున్నానని చెప్పి.. పెళ్లి చేసుకోవాలని ఒక యువకుడు వేధిస్తున్నాడని హిజ్రాలు అతని ఇంటిముందు ధర్నాకు దిగటం సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రేమ పెళ్లి పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మంచిర్యాల జిల్లా మందమర్రి లో అజయ్ అనే యువకుని ఇంటిముందు హిజ్రాలు ఆందోళన చేపట్టారు. చందన అనే హిజ్రా తో అజయ్ కి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఫోటోలు, వీడియోలు తీసుకుని తనను పెళ్లి చేసుకోవాలనీ వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడనీ హిజ్రాలు ఆరోపిస్తున్నారు.
అజయ్ కొన్నాళ్లుగా చందన అనే హిజ్రాను వేధిస్తున్నాడని, పెళ్లి చేసుకొమ్మని వెంటపడుతున్నాడని ఆరోపిస్తున్నారు. తిట్టి చెప్పినా, కొట్టి చెప్పినా వదలటం లేదని, చివరికి తమపై బెదరింపులకు పాల్పడుతున్నాడని ఇంటిముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఇంటిముందు బైటాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అక్కడికి చేరుకుని హిజ్రాలకు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.