అధికారంపై కాదు.. అధికారం కోసం.. బీసీల పోరాటం!

ఓట్ల రాజకీయాల్లో ఎంతో  కీలకమైన బీసీలు సీట్ల రాజకీయాల్లో ఎందుకు లేరు? బీసీలు కోల్పోయింది ఏమిటి? దాన్ని ఎలా రాబట్టుకోవాలి? ఒక్కసారి ఆలోచించాలి. బీసీ ఉద్యమ నాయకులు మహాత్మా జ్యోతిభాపూలే, సావిత్రీ భాయి పూలే, సాహుమహరాజ్,  నారాయణగురు, పెరియార్ రామస్వామి  అంతా బీసీలే. బీసీల ఆత్మగౌరవ పోరాట యోధులే. వీరు చేసిన ఉద్యమం ద్వారా చాలా వరకు బీసీ వర్గాల ప్రజల్లో చైతన్యం కలిగింది. దాన్ని గమనించిన ఆధిపత్య వర్గాలు కుట్ర చేసి బీసీ వర్గాలు ఏకం కాకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బీసీ వర్గాల వాళ్లు ఏకం అయితే తమకు అధికారం దూరం అవుతుందనే భయం వారికి పట్టుకుంది. అందుకే బీసీలను అణగదొక్కుతున్నరు. వారికి ఏ అధికారం రాకుండా అడ్డుకుంటున్నరు.


దేశంలో ఉన్న బీసీల్లారా! ఇంకా ఎన్నిరోజులు అధికారం లేని బానిస బతుకులు బతుకుడు ఆలోచన చేయండి. ఆధిపత్య పాలకుల జెండాలు ఇంకా ఎన్నాళ్ళు మోసుడు. బీసీల్లోని అగ్రకులాలు ఐకమత్యంతో పోరాటం చేస్తేనే అధికారం అందుకోవడం సాధ్యమవుతుంది.   దేశ వ్యాప్తంగా ఉన్న బీసీల ఓట్లు బీసీలు మాత్రమే వేసుకున్న రోజున బీసీలకు తప్పకుండా రాజ్యపాలన దక్కుతుంది. అమాయకంగా.. బానిసలుగా ఉన్నంత కాలం మనం ప్రజలు  హక్కులు దక్కించుకోలేం. పాలకులుగా మారాలంటూ బీసీలుగా  పుట్టిన అందరూ మనస్పూర్తిగా కోరుకుంటూ కృషి చేయాలి. ఈ దేశంలో అధికారికంగా  బీపి మండల్ కమిషన్ అప్పటి కుల ఆధారిత  లెక్కల ప్రకారం బీసీ కులాలు జనాభా 52% ఉంది. వాస్తవానికి ప్రస్తుతం 60%  శాతానికి పైగానే బీసీ కులాల ప్రజల జనాభా ఉన్నది. కానీ దేశంలోని ఏ రంగంలో చూసినా 10% శాతం వాటా కూడా ఎందుకు లేదు? ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి.

ఇప్పటికే కోల్పోయింది చాలు..

చరిత్ర తిరగరాయాలంటే బీసీ ప్రజలు చరిత్ర తెలుసుకోవాలి... పరిస్థితులను అర్ధం చేసుకోవాలి. ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రణాళికలు రూపొందించుకోవాలి, ఆచరణలో పెట్టాలి. మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలి. వారు నడచిన బాటలో నడవాలి. ప్రతీ ఒక్కరూ  స్వార్థంతో కాకుండా  బీసీ ప్రజా సమాజం కోసం పోరాడాలి. అధికారం పై పోరాటం కాదు ? అధికారం కోసం పోరాటం చెయ్యాలి. కేసుల్లో ఇరుక్కుని జీవితాన్ని ప్రమాదంలో పడేసుకునే  ఉద్యమాలు కాదు? చేయాల్సింది  బీసీల కోట్లాది ఆస్తిని దోచుకున్న ఆధిపత్య వర్గాల అధికార కుర్చీలను ఎలా చేతిలోకి తెచ్చుకోవాలి అనేది  ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా  ఉంది. ఇప్పటికైనా బీసీ ప్రజలు కోల్పోయింది చాలు. ఇంక త్యాగాలు వద్దు. ఎన్నో ఏండ్ల నుంచి బీసీ ప్రజలుగా ఆధిపత్య వర్గాలకు ఎంత ఇచ్చామో  లెక్కేసుకొని దానికి బారు వడ్డీ,  చక్ర వడ్డీలతో సహా వసూలు చేసుకుందాం. ఇన్ని ఏండ్లుగా బీసీ ప్రజలకు నిశ్శబ్దంగా అన్ని రంగాల్లో జరిగిన నస్టాన్ని అర్థం చేసుకోలేని వారికి ఈ మాటలు అర్థం కాక పోవచ్చు. కానీ ఇకనైనా బీసీ సామాజిక వర్గాల ప్రజలు మేల్కొని సావధానంగా జరిగిన నస్టాన్ని అర్ధం చేసుకోవాలి. బీసీలను మనుషులుగా గుర్తించకున్నా.. లెక్కచెయ్యకున్నా ఆధిపత్య వర్గాల వారికే సేవచేస్తున్నాం. ఈ 75 ఏండ్లు మాత్రమే కాదు ఇంకా ఎన్ని ఏండ్లు అయినా... ఆధిపత్య వర్గాలు తలుచుకుంటే  మన బతుకులు ఇట్టాగే తగులబడుతాయి. వారు తలుసుకుంటే  గంటలో జీవోలు వస్తాయి.

ఇకనైనా మేల్కోండి..

ఇకనైనా బీసీల కోసం, బీసీల అస్థిత్వం కోసం, బీసీల ఉనికికోసం, బీసీల భవిష్యత్తుకోసం, బావి తరాలలో ఆలోచన వచ్చే విధంగా బీసీలు స్వతంత్ర సామాజిక ఉద్యమాలు  చెయ్యాలనే ఆలోచన ఎంత  శాతం బీసీ జనాభా ఆలోచిస్తుంది? బానిసలుగానే ఉండుంటే బాగుందా ? ఆలోచన చేయండి. రాజకీయ అధికారంలో వాటా లేని కులాలు ఒట్టి బానిసలతో సమానం.. అసలు ఈ ఆలోచనలు వస్తున్నాయా?  ఈ విషయం గమనిస్తున్నారా? ఇకనైనా ప్రతి బీసీ బిడ్డ మేల్కొని బీసీలకు రావలసిన రాజకీయ వాటా కోసం చట్ట బద్ధమైన హక్కుల కోసం మేమెంతో... మాకంత. జనాభా ప్రాతిపదికన భారత రాజ్యాంగం ద్వారా చట్టసవరణ చేసి అన్ని రంగాల్లో బీసీ ప్రజల వాటాను బీసీలు హక్కులు పొందేలా రాజ్యాంగంలో పొందుపరిచేదాకా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బీసీ ఉద్యమ సంఘాల నాయకులు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, కవులు, కళాకారులూ దేశ వ్యాప్త ఐక్య ఉద్యమం చేసే దిశగా    ప్రయత్నం కొనసాగించాలని ఆశిస్తున్నా.

రిజర్వేషన్లు అంటేనే విరక్తి..

బీసీ వర్గాలకు రిజర్వేషన్లు.. రిజర్వేషన్లు, అంటూ ఏండ్ల కాలంగా ఏడ్చి ఏడ్చీ ఆధిపత్య వర్గాలు వాళ్ళు 10% రిజర్వేషన్లు కల్పించుకున్నారు. సంతోషం, కానీ 60% ఉన్న బీసీ బిడ్డలకు అలాంటి రిజర్వేషన్ గూర్చి కూడా ఆలోచన చేయలేదు. రిజర్వేషన్లు అంటేనే విరక్తి పుట్టేలా చేసారు. బజార్లు, గల్లీలు, బస్తీలు, పల్లెలు, ఊర్లు, పట్టణాలు అని తేడా లేకుండా పనికోసం వలసబాట పట్టిన బీసీ వర్గాలును ఆయా వృత్తుల వారీ లెక్కిస్తే  దేశ వ్యాప్తంగా 60 % ఉన్నట్టు లెక్కలు తెలిపాయి. గత 75 ఏండ్లుగా మడతలకు మడతలే, కట్టలకు కట్టలే  వీళ్లందరి ఓట్లు దండుకొని, అధికారం అనుభవిస్తున్నాయి కేవలం 10% మాత్రమే ఉన్న ఆధిపత్య వర్గాలు.  వారికే  అధికారం కట్టబెడుతున్నాం. ఈనాడు బీసీ వర్గాల ప్రజలను లెక్కే చెయ్యకుండా.. కనీసం మనుషులుగా కూడా చూడకుండా వాళ్ల మధ్యలో అంతర్గత పోటీ పెడుతూ.. ఒకరినొకరు అవమానాలు చేసుకుంటూ.. గొడవలు పెడుతూ ఉన్న ఆధిపత్య వర్గాలకే సేవచేస్తున్నాం. ఇంకా సేవచెయ్యడానికే  పోటీపడుతున్నాం. ఎవ్వరి హక్కులు వారికే దక్కాలి కదా అంటూ.. ఎంతసేపూ వారి తరఫునే బానిస ఉద్యమాలు చేస్తున్నాం.
- శ్రీనివాస్ తిపిరిశెట్టి, 
ప్రదాన కార్యదర్శి, రాష్ట్ర సంచార జాతుల సంఘం