రాష్ట్రంలో ప్రతి శ్రమ జీవికీ సాంఘిక భద్రత అత్యంత కీలకం. కేవలం భూమిపై పట్టా హక్కులు కలిగిన భూ యజమానులకు, చేనేత కార్మికులకే రైతు బీమా పథకాన్ని పరిమితం చేయకుండా, మొత్తం రాష్ట్రంలో 18- 61 ఏళ్ల మధ్య వయసు గల గ్రామీణ, పట్టణ ప్రాంతాల పేద ప్రజలకు సాంఘిక భద్రత బీమా పథకం ప్రవేశ పెట్టాలి. ఈ బీమా పథకానికి అవసరమయ్యే ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి.
తక్షణమే చేపట్టాల్సిన చర్యలు
కేంద్రం అందించే రసాయన ఎరువుల సబ్సిడీ, పీఎం కిసాన్ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు బంధు, ఉచిత విద్యుత్ పథకాలు వ్యవసాయానికి ఎంతో కొంత ఉపయోగమే కానీ, ఈ పథకాలు మాత్రమే రైతుల ఆన్ని సమస్యలను పరిష్కరించలేవు. మోనో క్రాపింగ్ వైపు రాష్ట్రాన్ని నెట్టకుండా, రాష్ట్ర అవసరాలకు అనుగుణమైన పంటల ప్రణాళిక రూపకల్పన అత్యంత కీలకం. ప్రస్తుత వ్యవసాయ పథకాల అమలు తీరు, భూసారానికి, పర్యావరణానికి హాని చేస్తున్నది. ఈ పథకాలు కొన్ని పంటలకు, కొన్ని ప్రాంతాలకు ఎక్కువ మేలు చేస్తున్నాయి. పంట సాగు ఖర్చులు తగ్గించేలా, రాష్ట్ర ప్రజల, పశువుల ఆరోగ్యాలను కాపాడేలా సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించి అమలు చేయాలి. విద్యుత్ వినియోగం భారీగా ఉంటూ, సాగు నీరు ఎక్కువ అవసరమయ్యే పంటలను ప్రోత్సహించడం మానుకోవాలి. రైతులను ఆదుకోవడానికి పంటల బీమా, పశువుల బీమా పథకాలను వెంటనే తిరిగి ప్రారంభించాలి. కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ రంగ పథకాల అమలులో, లబ్ధిదారుల ఎంపికలో తప్పుడు మార్గదర్శకాల వల్ల నిధుల దుర్వినియోగం కూడా జరుగుతున్నది. వీటిని అరికట్టాలి.
సహకార సంఘాలను బలోపేతం చేయాలి
రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రైతు, మహిళా, వివిధ వృత్తుల వారీ సహకార సంఘాలను, ఉత్పత్తిదారుల కంపెనీలను బలోపేతం చేయాలి. వీటన్నిటి మధ్య రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలి. ఈ సంఘాలకు వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చాలి. కనీసం మూడు ఏళ్ల పాటు ఈ సంఘాల నిర్వహణకు అవసరమైన మానవ వనరుల నియామకాలకు సహకారం అందించాలి. ఈ సంఘాల కార్యకలాపాలపై జీఎస్టీ భారం పడకుండా బడ్జెట్ నుంచి రీయంబర్స్ చేయాలి. పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు,కూరగాయల పంటలకు ప్రోత్సాహం, ఈ పంటల సేకరణ,మార్కెటింగ్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలి.
చిరుధాన్యాల పంటల వైపు ప్రోత్సహించాలి
కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ ఎఫ్సీఐ రాష్ట్రంలో బియ్యం సేకరిస్తున్నది. భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుంది. ఫలితంగా రైతులు, ఏ మాత్రం సాగు నీరు అందుబాటులో ఉన్నా, వరి ధాన్యం సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణిని నిరుత్సాహ పరిచి, రాష్ట్రానికి అవసరమైన మిగిలిన పంటల వైపు రైతులను ప్రోత్సహించడానికి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాల పంటలను మార్క్ ఫెడ్ నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం సేకరించాలి. కూరగాయలకు కేరళ తరహాలో కనీస మద్దతు ధరలను ప్రకటించాలి. సహకార సంఘాలను, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. ఈ సంఘాలకు ప్రాసెసింగ్ యూనిట్లను సమకూర్చాలి. ఈ సంఘాల నుంచి పై ఉత్పత్తులను సేకరించి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, రైతు బజార్ల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు అందించవచ్చు. రైతులకూ, వినియోగ దారులకూ పరస్పర ప్రయోజనకరంగా ఉండే ఈ పద్దతి ప్రభుత్వం పై ఆర్ధిక భారాన్ని కూడా వేయదు . బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మార్క్ ఫెడ్ సంస్థ ఈ వ్యాపారం నిర్వహించవచ్చు. ప్రభుత్వం ఈ రుణాలకు కౌంటర్ గ్యారంటీ ఇవ్వ వచ్చు. 2018-–19 లో సీఏసీపీ సంస్థ సూచించినట్లుగా గ్రామ పంచాయితీ పరిధిలో గిడ్డంగులు, శీతల గిడ్డంగుల నిర్మాణం ఈ లక్ష్యంతో చేపట్టి నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయాలి.
80% స్థానికులకే ఉద్యోగాల కోసం చట్టం తేవాలి
గ్రామీణ యువతీ, యువకులకు స్థానికంగానే నూతన ఉపాధి అవకాశాలు కల్పించడానికి పని హక్కు చట్టం చేయాలి. ఆయా ప్రాంతాలలో ఏర్పడే సంస్థల్లో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించేలా ఈ చట్టంలో నియమాలు పొందు పరచాలి. ఆయా సంస్థల యాజమాన్యాలు, అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా పని గంటలు, కనీస వేతనాలు, సెలవులు, సాంఘిక భద్రత, ఇతర కార్మిక హక్కులు అమలు చేసేలా చూడడానికి కార్మిక శాఖను బలోపేతం చేయాలి.
స్పష్టమైన డిమాండ్లు అవసరం
ఈ డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టినా, మాకు ఎదురయ్యే ఈ ప్రభుత్వాల సమస్యలు మనకు తెలుసు కదా? ఇవన్నీ ఆ ప్రభుత్వాలు అమలు చేస్తాయా ? అని ప్రజలు ఆడగక పోతే, ప్రజా సంఘాలు, ప్రజా పక్ష రాజకీయ పార్టీలు పోరాడకపోతే, ఇవన్నీ సాధించుకోవడం కష్టమన్న అంచనా కూడా మాకు ఉంది. ప్రజల నిజమైన సమస్యలను సరిగా అర్థం చేసుకోలేకపోతే, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు ప్రభుత్వాల ముందు ఏ డిమాండ్లు పెట్టాలో స్పష్టత లేకపోతే, వాటిని ప్రజల్లో చర్చకు పెట్టి, ఇతరుల అనుభవాల నుంచి కూడా సరిచేసుకోకపోతే మనం పదే పదే తప్పులు చేస్తాం. తప్పుడు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టి ఆచరణలో సాధించుకోవడం అసాధ్యంగా మారుతుంది.
గ్రామీణానికి 60శాతం బడ్జెట్ కేటాయించాలి
సహజ వనరులకు ఉన్నట్లు గానే, బడ్జెట్ కేటాయింపులకు కూడా ఖచ్చితమైన పరిమితి ఉంటుంది. ప్రతి ఏటా బడ్జెట్ పరిమాణం పెరగవచ్చు కానీ, రాష్ట్ర పన్ను వసూళ్లు, కేంద్ర గ్రాంట్లు, మొత్తంగా రాష్ట్ర ఆదాయం అనుకున్న స్థాయిలో పెరగక పోవచ్చు. కాబట్టి వివిధ రంగాల ప్రజలు ఆశించినట్లుగా ఆన్ని రంగాలలో బడ్జెట్ కేటాయింపులు పూర్తి స్థాయిలో ఉండక పోవచ్చు. రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగం నిర్మూలన లక్ష్యంతో, నిపుణులైన మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయ కోణంలో ఆలోచించి ఉన్న పరిమిత నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉనికిలో ఉన్న ప్రజా సంక్షేమ చట్టాలను సమగ్రంగా అమలు చేయడం ద్వారా, ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల్లో 60 శాతం కేటాయించడం ద్వారా గ్రామీణ సంక్షోభాన్ని పరిష్కరించాలి. తెలంగాణా రాష్ట్రంలో మొదటి వేతన సవరణ కమిషన్ సిఫారసుల ప్రకారం ప్రభుత్వ శాఖల్లో అమలవుతున్న కనీస వేతనం 19,000 రూపాయలు. ఈ కనీస ఆదాయం రాష్ట్రంలో ఉన్న ప్రతీ కుటుంబానికి అందేలా విధానాలను ప్రభుత్వం రూపొందించాలి.
మేనిఫెస్టోలను ప్రభావితం..
కేవలం మన ప్రతిపాదనలు, మన విజ్ఞాపన పత్రాలు మాత్రమే ఈ ప్రభుత్వాల ఆచరణను, అభివృద్ధి నమూనాను మారుస్తాయన్న భ్రమలో ఉండాల్సిన అవసరం లేదు. సంస్థలు తమ అవగాహనను మెరుగు పరుచుకోవడం, ప్రజల అవగాహనను పెంచడం, బాధిత ప్రజలను ఐక్యం చేయడం, వారి రాజకీయ చైతన్యాన్ని కూడా పెంచడం, డిమాండ్లను సాధించే వరకూ పోరాటాలకు వారిని సన్నద్ధం చేయడం నిరంతరం జరగాలి. ముఖ్యంగా ఆయా రంగాలలో పని చేస్తున్న ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు ఈ బాధ్యత చేపట్టాలి. వాటిపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడగట్టాలి. ఆయా పార్టీలు తమ ఎన్నికల మానిఫెస్టోలో వీటిని చేర్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే , ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీ, ఈ సమస్యలపై, ప్రజా సంఘాలు పెడుతున్న డిమాండ్లపై, చర్చలపై ఒత్తిడికి గురై, తన పార్టీ ప్రణాళికలో, ప్రస్తుత పాలనలో వాటి అమలును భాగం చేసుకుంటే, ఆ మేరకు ప్రజలకు మేలు జరుగుతుంది. మన అంతిమ లక్ష్యం మనం పని చేస్తున్న వర్గాల ప్రజల సంక్షేమం మాత్రమే అయినపుడు, ఈ ప్రక్రియను ఓపికగా ముందుకు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది.
- కన్నెగంటి రవి,
రైతు స్వరాజ్య వేదిక