
దొంగ ఓట్లతో గెలిచానంటూఎమ్మెల్యేనే స్వయంగా చెబితే ఏమౌతోంది.. అతనిపై ఈసీ చర్యలు తీసుకోవచ్చా.. ఎందుకు అనర్హత వేటు వేయకూడదు.. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు.. ఏపీలో జనసేన పార్టీ నుంచి గెలిచిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు చేసిన కామెంట్స్ ఇందుకు నిదర్శనం..
ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. నేను దొంగ ఓట్లతో గెలిచా... నా సొంతూను చింతలమోరులో నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేశారు. అక్కడ ఓట్లు ఉంటాయి. కానీ ఎవరో ఎవరికీ తెలియదు. గతంలో వచ్చిన 800ఓట్ల మెజార్టీ అలాగే వచ్చింది అంటూ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాపాక. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాపాక మాటలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రాపాక జనసేన పార్టీ తరపున ఏపీలోని రాజోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకే అనుకూలంగా ఓటేసినట్లు సమాచారం. ఈ సందర్భంలోనే టీడీపీ తనతోనే బేరసారాలు సాగించిందని.. 10 కోట్ల రూపాయలు ఇస్తామని ఆ పార్టీ నేతలు తనతో బేరం ఆడారని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటును అమ్ముకుంటే 10 కోట్లు వచ్చి ఉండేవంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఓటు అమ్ముకుంటే సమాజంలో పరువు పోతుందనే ఉద్దేశంతో అలా చేయలేదంటూ చెప్పుకొచ్చారు. సిగ్గు శరం వదిలేసి ఉంటే 10 కోట్ల రూపాయలు వచ్చేవంటూ ముక్తాయింపు ఇచ్చారు ఎమ్మెల్యే రాపాక. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ఆయన దొంగ ఓట్లతో గెలిచానంటూ చేసిన వ్యాఖ్యల వీడియో బయటకు రావటం.. సోషల్ మీడియాలో వైరల్ కావటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.