ప్రజలకు సత్వర న్యాయం అందడం లేదనేది అందరూ అంగీకరించే వాస్తవం. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి కోర్టులపై పని భారం బాగా పెరిగింది. జనాభా పెరుగుదల, నాణ్యమైన మానవ వనరుల నిర్మాణం జరగకపోవడం, ఆర్థిక అసమానతలు పెరగడం, వ్యాపార వాణిజ్యాల పెరుగుదల, భూముల ధరలు పెరగడం, పట్టణాలలో జనాభా పెరగడం ఇలా మొదలగు కారణాలు సమాజంలో నేరాల పెరుగుదలకు, కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలని చెప్పవచ్చు.కేసుల సంఖ్య పెరిగినట్లు కోర్టుల సంఖ్య, జడ్జీల, ఇతర సిబ్బంది సంఖ్య పెరగడం లేదనేది కూడా అంగీకరించవలసిన వాస్తవమే. మరి ఈ పరిస్థితుల్లో ఏమి చేయవచ్చు?
నేను జిల్లా జడ్జిగా పనిచేస్తున్న రోజుల్లో మెగా లోక్ అదాలత్‌లను నిర్వహించి వేల సంఖ్యలో కేసులను ఒకేరోజులో పరిష్కరించాం. చిన్న చిన్న తగాదాలతో, తాత్కాలిక ఉద్రేకంతో కొన్ని నేరాలు జరుగుతాయి. నేరాలను రెండు రకాలుగా విభజించారు. రాజీ పడదగిన, రాజీ పడలేని నేరాలు. చిన్న చిన్న నేరాలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, తోసుకోవడం, అసభ్య పదజాలంతో దూషించడం, ఇతరుల భూముల్లోకి, ఇండ్లల్లోకి అక్రమంగా ప్రవేశించడం, ఇలా అనేక చిన్న నేరాలను రాజీపడదగిన కేసుల జాబితాలో సీఅర్పీసీ320(1) సెక్షన్లో చేర్చారు. అటువంటి కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లయితే ఇరుపక్షాల వారిని పిలిపించి లోక్ అదాలత్‌లో రాజీ కుదిర్చి ఆ కేసును మూసివేయవచ్చు. ఇప్పుడున్న క్రిమినల్ (నేర సంబంధ) కేసుల్లో దాదాపు 1/3 వంతు ఇటువంటి కేసులే ఉంటాయి. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వారితో చర్చించి ఇటువంటి కేసుల్లో రాజీ కుదుర్చవచ్చు. ఒక నెల, రెండు నెలల్లో వేల సంఖ్యలో కేసులు మూసివేయవచ్చు.
సివిల్ కేసుల్లో కూడా సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులు కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న తగాదాలు కావచ్చు వీటిని కూడా లోక్ అదాలత్లకు పంపించాలి. ఇరుపక్షాలతో చర్చించి రాజీ కుదిరిచ్చే ప్రయత్నం చేయవచ్చు. ఓపికగా రెండు, మూడు లోక్ అదాలత్ సిట్టింగ్‌లలో రాజీ కుదిర్చే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులకు ఈ పని అప్పగించి వారికి నెలకు కొంత గౌరవ వేతనం చెల్లించవచ్చు.
మూడోరకం కేసులు మోటార్ ప్రమాద కేసులు
వివిధ మోటార్ ప్రమాద కేసుల్లో గాయపడినవారు, చనిపోయినవారి వారసులు తమకు నష్టపరిహారం చెల్లించాలని కేసులు వేస్తారు. ఇటువంటి కేసుల్లో జిల్లా కోర్టు (ట్రిబ్యునల్) ద్వారా అవార్డు వచ్చినా ఇన్సూరెన్స్ కంపెనీ వారు అప్పీలు వేస్తూ సుప్రీంకోర్టు వరకు కేసు తీసుకువెళతారు. అది తేలేసరికి 10,15 సంవత్సరాల కాలం పట్టవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ వారు పెద్ద ఎత్తున వడ్డి కట్టవలసి వస్తున్నది. ప్రమాదం జరిగిన ఆరు నెలలలోపు కేసును లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించగలిగితే ,ఇటు ప్రమాదం వల్ల నష్టపోయిన వారికి తొందరగా నష్టపరిహారం వస్తుంది, అటు ఇన్సూరెన్స్ కంపెనీలకు వడ్డీ భారం తగ్గుతుంది. ఇదివరకు నిర్ణయించిన ఉన్నత న్యాయస్థానాల తీర్పుల మేరకు అందరికీ అంగీకారమైన నష్టపరిహారాన్ని నిర్ణయించడం పెద్ద కష్టమేమీ కాదు.
భూముల కేసులకు ప్రత్యేక ట్రిబ్యునల్ వేయాలె
భూసేకరణ ద్వారా సేకరించిన భూములకు చెల్లించే నష్టపరిహారం కేసులను కూడా పరిష్కరించవచ్చు. భూములు కోల్పోయిన వారికి మరోచోట భూములు ఇవ్వడం లేదా ఆ కుటుంబంలోని వారిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం భవిష్యత్తులో నష్టపరిహారం చెల్లించడానికి బాండ్ ఇవ్వడం ద్వారా ఇటువంటి కేసులను పరిష్కరించవచ్చు. వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఉన్న ఉద్యోగస్తుల లేదా వారి వారసుల క్లైములు, ధరణి వల్ల ఉత్పన్నమైన సమస్యలతో సహా అన్నింటినీ కూడా పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పరిష్కరించవచ్చు. వాస్తవంగా భూమి ఎవరి స్వాధీనంలో ఉందో నిర్ణయించాలి, భూముల సరిహద్దులను నిర్ణయించాలి, ఎవరికి హక్కులు సంక్రమించాయో తీర్మానించాలి. మొదలైన విషయాలను ఎక్కడికక్కడ సర్వేలు నిర్వహించి గ్రామ సభల ద్వారా కూడా పరిష్కరించవచ్చు.
కేసుల రాజీ కోసం రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేయాలి
వాస్తవం చెప్పాలంటే హైకోర్టులలో, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అత్యధిక కేసులు ప్రభుత్వం పైన లేదా ప్రభుత్వం వేసిన కేసులే. కింది కోర్టులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తే అనేకమంది అధికారులు తమకు ఎందుకు ఇబ్బంది అని ఆలోచించి అప్పీలుకు వెళ్ళాలని నోట్ రాస్తారు. దీనితో లక్షలాది రూపాయల ఖర్చు ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులు అన్నింటిని పరిశీలించడానికి న్యాయ నిపుణులతో (రిటైర్డ్ జడ్జిలతో) కమిటీలు వేసి ఆ కేసుల పూర్వాపరాలు పరిశీలించి వివాదం కొనసాగించడం అనవసరమని భావించిన కేసులన్నింటిని ఉపసంహరించుకోవాలి. లేదా రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్ లకు నివేదించాలి. పెన్షన్ తగినంత ఇవ్వలేదని, ప్రమోషన్ సకాలంలో ఇవ్వలేదని, విద్యుత్ బకాయిల లెక్కలు సరిగ్గా చేయలేదని, ఇలా ఎన్నో చిన్న చిన్న క్లైములు ఉంటాయి. భూసేకరణ చట్టం కింద పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లు ఇలా ఎన్నో రకాల కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించవచ్చు. ఇదివరకే తీర్పుల ద్వారా ఉన్నత న్యాయస్థానాలు ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏమి తీర్మానించిందో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఒక కేసును ఎలా పరిష్కరించవచ్చునని ఇరుపాక్షాల వారు చర్చించి రాజీ పడవచ్చు. లేదా కోర్టులే ఉన్నత న్యాయస్థానాల తీర్పు మేరకు ఒక కేసును ఎలా పరిష్కరించవచ్చో నిర్ణయించవచ్చును.
ప్రభుత్వమే ఉపసంహరించుకోవాల్సిన కేసులు..
ఉద్యమాల సందర్భాలలో ఎన్నో కేసులు వేయబడతాయి. ఆ కేసులలో ఏ నేరం జరగకపోవచ్చు. లేదా ఎలాంటి ఆస్తి నష్టం సంభవించి ఉండకపోవచ్చు. అయినా సంవత్సరాల తరబడి ప్రజా ఉద్యమకారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అటువంటి అన్ని రకాల కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవచ్చు. ఇక పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులలో ఆరు నెలలలోగా చిన్న కేసులలో విచారణ పూర్తి కాకపోతే లేదా అవి రాజీ పడదగిన కేసులైతే వాటిలో ఫిర్యాదుదారునికి నోటీసు ఇచ్చి ఉపసంహరించుకోవచ్చు. లేదా కేసును కోర్టులే మూసి వేయవచ్చు. ఈ విధంగా అన్ని రకాల చిన్న చిన్న క్రిమినల్ కేసులను రాజీ పడదగిన క్రిమినల్ కేసులను వెంటనే పరిష్కరించవచ్చు. లేదా ఒక నేరానికి ఎంత శిక్ష వేయవచ్చో అందులో సగం జైలు శిక్ష అనుభవించినట్లైతే అనుభవించిన కాలానికి సరిపడే విధంగా తీర్పు చెప్పి కేసును పరిష్కరించవచ్చు.
కోర్టులను పెంచాలె
ఇక కోర్టుల సంఖ్యను, జడ్జీల సంఖ్యను, కోర్టు సిబ్బందిని పెంచాలి. పేదలకు ఉచిత న్యాయం అందించడానికి జూనియర్ న్యాయవాదులకు నెలకు కనీసం రూ.10,000 ఆర్థిక సహాయం చేయాలి. వారి సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన శిక్షణ తరగతులను ఏర్పాటు చేయాలి.
అవసరమైన లోక్ అదాలత్‌ల బెంచీలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ అధికారులకు, న్యాయ అధికారులకు, ట్రిబ్యునల్ సభ్యులకు, జూనియర్ న్యాయవాదులకు, పోలీసు అధికారులకు కేసుల రాజీ కోసంప్రయత్నించే వారందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ విధంగా చిత్తశుద్ధితో, పట్టుదలతో చేస్తే కనీసం 1/3 వంతు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించవచ్చు.
బ్యాచ్‌లుగా కేసుల పరిష్కారం
ఒకే సమస్య న్యాయ సంబంధమైనది కావచ్చు లేదా వాస్తవ విషయమైనది కావచ్చు అనే కేసులు అనేకం ఉంటాయి. ఉదాహరణకు భూసేకరణ చట్టంలో ఒకే విషయమై వందల కొలది కేసులు, అప్పీళ్లు ఉండవచ్చు. వాటన్నింటిని ఒకే బ్యాచ్ గా చేసి రాజీ ప్రయత్నం చేయవచ్చు. లేదా ఒకేసారి తీర్పు వచ్చేటట్లు చేయవచ్చు. మోటార్ యాక్సిడెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, సింగరేణి కార్మికుల కేసులు, ప్రభుత్వ ఉద్యోగుల కేసులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కేసులు, ఒకే ఉద్యోగ నియామక సంబంధిత కేసులు ఇలా అనేక వందల కేసులను ఒకే బ్యాచ్ గా చేర్చి పరిష్కరించవచ్చు.రెవెన్యూ కేసుల పరిష్కారానికి, భూమి సంబంధిత కేసుల పరిష్కారానికి, ధరణి వల్ల వచ్చిన కేసుల పరిష్కారానికి, న్యాయ నిపణులతో కమిటీలు వేసి త్వరితగతిగా పరిష్కరించవచ్చు. దీనివలన ప్రభుత్వ ఖర్చుల భారం తగ్గుతుంది.
-జస్టిస్ చంద్రకుమార్,
హైకోర్టు జడ్జి (రిటైర్డ్)