వీధి కుక్కలపై ఏం చేద్దాం!

  •     హైకోర్టు ఆదేశాలతో బల్దియా ఆఫీసర్లలో  టెన్షన్​
  •     ప్రస్తుతం గ్రేటర్​సిటీలో సుమారు 5 లక్షల కుక్కలు 
  •     ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు స్పెషల్ హెల్ప్ లైన్ నంబర్  
  •     స్టెరిలైజేషన్ చేస్తున్నా.. పెరిగే సంఖ్యపై తెలుసుకునే ప్రయత్నం
  •     రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కసరత్తు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ సిటీలో వీధి కుక్కలపై ఏం చేద్దామనే డైలామాలో జీహెచ్ఎంసీ పడింది. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలతో అధికారుల్లో  టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పలుమార్లు హైకోర్టు సీరియస్ అయింది. కోర్టులో విచారణ సమయంలో అధికారులు ఏదో ఒక సమాధానం చెబుతూ దాటవేస్తూ వచ్చారు. ఈసారి మాత్రం చేపట్టిన చర్యలపై వివరాలతో తెలపాలని విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. దీంతో కుక్కల దాడులపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు స్పెషల్ హెల్ప్ లైన్ నంబర్ పెట్టేందుకు అధికారులు ఆలోచన చేస్తున్నారు.

ప్రస్తుతం సిటీలో దాదాపు 5 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి.  భవిష్యత్ లో వీటి సంఖ్య పెరగొద్దంటే యానిమల్ బర్త్ కంట్రోల్ సర్జరీలు( స్టెరిలైజేషన్) ఒక్కటే మార్గం. ఇప్పటికే 90 శాతం కుక్కల్లో స్టెరిలైజేషన్ సర్జీలు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.  అయినా కుక్కలు ఎందుకు పెరుగుతున్నాయని ఆరా తీస్తున్నారు. సిటీలో 5 యానిమల్ కేర్ సెంటర్లు ఉండగా..  కాటేదాన్, నల్లగండ్లలో మరో రెండు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్టు చెబుతున్నారు. శివారు ప్రాంతాల్లోనూ రిహాబిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తుంది.  కుక్కలకు ఆ సెంటర్ లో పునరావాసం కల్పించనున్నారు. సెంటర్ కు అనువైన భూమిని వెతికే పనిలో అధికారులు ఉన్నారు. 

ప్రతి ఏటా రూ.11.5 కోట్లు ఖర్చు 

కుక్కలను పట్టుకునేందుకు జీహెచ్ఎంసీ వద్ద 30 వాహనాలు ఉన్నాయి. మరో 20 వాహనాలకు రెంటుకు  నడుపుతున్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబిస్ సర్జరీలు, టీకాల కోసం కుక్కలను వీటిలో సెంటర్లకు తరలిస్తున్నారు. ఇలా గత పదేండ్లలో 7.21 లక్షల కుక్కలను స్టెరిలైజ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకు ప్రతి ఏటా రూ.11.5 కోట్లను ఖర్చు చేసింది. ఇంత చేస్తున్నా కూడా కుక్కల పెరుగుదల ఏ మాత్రం తగ్గడం లేదు. 

ఎన్ జీవోలకు ఇవ్వడంతో వందశాతం రిజల్ట్  

సిటీలో కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ పక్కాగా చేస్తున్నామని జీహెచ్ఎంసీ చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించడంలేదు. ఏటా కుక్కల సంఖ్య తగ్గించేందుకు ఢిల్లీ, జైపూర్, బెంగళూర్, చైన్నై, ముంబై, కొల్ కత్తా వంటి మెట్రో సిటీల్లో  వందశాతం స్టెరిలైజేషన్ పకడ్బందీగా జరుగుతున్నట్లు వెటర్నరీ డాక్టర్లు, డాగ్ లవర్స్ పేర్కొంటున్నారు. ఇందుకు కారణం.. ఎన్​జీవోలకు బాధ్యతలు ఇవ్వడంతోనే రిజల్ట్ వస్తున్నట్లు చెబుతున్నారు. కుక్కలు ఎక్కువగా ఉన్నాయని జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వస్తున్న కాలనీలపైనే అధికారులు దృష్టి పెడుతున్నారు.  దీంతో కంప్లయింట్లు రాని కాలనీల్లో స్టెరిలైజేషన్స్‌‌ సర్జీలు చేయకపోతుండడంతో  కుక్కల సంఖ్య ఎక్కువవుతుంది. 

శివారు ప్రాంతాల్లో దృష్టి పెట్టకపోగా.. 

సిటీ శివారులోని 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల్లో మూడేండ్ల కింద వరకు 2 లక్షల కుక్కులు ఉన్నాయి.   ప్రస్తుతం డబుల్ అయినట్టు పలువురు వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. అడవుల్లో జీవించే కుక్కలు శివారు ప్రాంతాలకు ఎక్కువగా వస్తున్నట్లు పేర్కొంటున్నారు. వీటిద్వారానే క్రమంగా సంఖ్య పెరుగుతుందంటున్నారు. మరోవైపు అధికారులు యానిమల్ బర్త్ కంట్రోల్ పైనా దృష్టి పెట్టడడంలేదు. ఇది కూడా పెరుగుదలకు ఒక కారణంగా ఉంది.