మిడిల్​క్లాస్​కు బడ్జెట్​లో ఏమిస్తారో

ఫ్యామిలీలో కష్టం సుఖం తెలిసిన సగటు ఇల్లాలుకు నమూనాగా కనబడతారు నిర్మలా సీతారామన్‌. మరో కొద్ది గంటల్లో ప్రవేశపెట్టబోయే యూనియన్‌ బడ్జెట్‌ మరి ఏ రకంగా ఉండబోతోందో….నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే గవర్నమెంట్‌కి ఓటర్లు రెండోసారి అధికారమిచ్చారు. అలా ఇలా కాదు. ఫుల్‌ మెజారిటీ ఇచ్చి మోడీ బాధ్యతను పెంచేశారు.  జనం తమ ప్రభుత్వానికి ఇచ్చిన బహుమతికి ‘థ్యాంక్స్‌ గివింగ్‌’గా ఫైనాన్స్‌ మినిస్టర్‌ ఏమేమి తాయిలాలు ఇవ్వబోతున్నారో… ఈసారి బడ్జెట్‌ ప్రెజెంటేషన్‌కి ఇలాంటి చాలా స్పెషాలిటీస్‌ ఉన్నాయి.  మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఫైనాన్స్‌ మినిస్టర్‌ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రపోజ్‌ చేయనున్నారు. ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం ప్రధానమంత్రి ఇందిరా గాంధీ (1970–71) బడ్జెట్‌ను పార్లమెంట్‌లో సమర్పించారు. ఇన్నేళ్ల తర్వాత సాధారణ గృహిణి స్థాయి నుంచి ఫైనాన్స్‌ మినిస్టర్‌ హోదాకి ఎదిగిన నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను చదవబోవడం మరో విశేషం.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎలా ఉండబోతుందన్న  ఆసక్తి అందరి లో కనిపిస్తోంది. ఇదివరకటిలా కాదు. మిడిల్ క్లాస్ ఇంట్లో  పుట్టి బాగా చదువుకుని పై కొచ్చిన ఓ మహిళ తీసుకొస్తున్న బడ్జెట్ ఇది. అందుకే ఈ ఆసక్తి. అందరికీ మేలు జరగాలని పదేపదే అంటుండే నిర్మలమ్మ బడ్జెట్ లో  వెల్ఫేర్ స్కీమ్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారన్న అంచనాలున్నాయి.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న  రాజకీయ పరిస్థితుల మధ్య  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ లో సంక్షేమానికి ప్రయారిటీ ఇవ్వక తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే వెల్ఫేర్ పై  మోడీ ప్రభుత్వం తీసుకునే పాలసీ ఎలా ఉండబోతున్నదన్న   ఉత్కంఠ​ అందరిలో  నెలకొంది.  బడ్జెట్ లో  సామాన్యుడికి మేలు చేసే సంక్షేమ పథకాలు పెద్ద సంఖ్యలో ఉంటాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వెల్ఫేర్ స్కీమ్స్ అమలు కోసం అయ్యే అదనపు ఖర్చుకు ఆదాయాన్ని ఎక్కడ్నుంచి తీసుకువస్తారన్న ప్రశ్న కూడా తెరమీదకు వచ్చింది.

అదనపు ఆదాయం తీసుకురావడం కత్తి మీద సామే

పేద, మధ్య తరగతి ప్రజలకు లాభం కలిగించే సంక్షేమ పథకాలను విస్తరించడానికి అవసరమైన సొమ్మును రాబట్టడం ఆర్థిక మంత్రికి కత్తిమీద సామే. ఖజానా పరిస్థితులను పట్టి  ఫైనాన్స్ మినిస్టర్ ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.

ఒక స్కీమ్ కు మరో స్కీమ్ తో లింక్

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ ఆర్ ఈ జీ ఎస్ ) రెండూ పేదరికాన్ని టార్గెట్ గా చేసుకుని  ప్రవేశపెట్టిన పథకాలే. రైతులకు ఆర్థిక సాయం అందించడానికి పీఎం కిసాన్ స్కీమ్ ను ప్రవేశపెడితే  పల్లె ప్రాంతాల్లో అన్ స్కిల్డ్  వ్యక్తులకు కనీసం 100 రోజుల పని దినాలు కల్పించడానికి ఉద్దేశించిన పథకం. రెండూ చూడటానికి ఒకేలా ఉన్నా  వాటి పని విధానం డిఫరెంట్ గా ఉంటుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టం సక్సెస్ ఫుల్ గా అమలైతే  ఆ ప్రభావం పల్లె ప్రాంతాల్లో ఉత్పత్తులపై పడుతుంది. ‘ ఫార్మ్ ప్రొడక్షన్ ’ పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఫలితంగా చిన్న సన్నకారు  రైతుల సంపద పెరుగుతుంది. ఇలా లాభపడే రైతులు మరెవరో కాదు పీఎం కిసాన్ పథకం లబ్దిదారులే.  చివరకు వ్యవసాయ రంగం క్రైసిస్ నుంచి బయటపడుతుంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఎన్ని ఉన్నా వేటికి ప్రయారిటీ ఇవ్వాలి అని డిసైడ్ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని  వరల్డ్ బ్యాంక్ లేటెస్ట్ గా కేంద్రానికి ఒక సలహా ఇచ్చింది. తమ అవసరాలకు తగ్గట్టు సంక్షేమ పథకాలను అమలు చేసుకునే స్వేచ్ఛ  రాష్ట్రాలకు ఉండాలన్నది వరల్డ్ బ్యాంక్ ఆలోచన.

వెల్ఫేర్ కు టాప్ ప్రయారిటీ 

2014 లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక సంక్షేమం పై దృష్టి పెట్టింది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లాభం చేయడానికి అనేక వెల్ఫేర్ స్కీమ్స్ ను ప్రవేశపెట్టింది. అటల్ పెన్షన్ స్కీం, ఉజ్వల స్కీం, గ్రామోదయ, జన్ ధన్ యోజన ఇందులో ముఖ్యమైనవి. పేద, మధ్య తరగతి వర్గాల ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ( పీఎంఏవై) పేరుతో ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది మోడీ సర్కార్. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో 44 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే పల్లె ప్రాంతాల్లో 1.18 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ‘ స్టార్టప్ ఇండియా మిషన్ ’ ఇది మరో వెల్ఫేర్ స్కీం. స్టార్టప్ కంపెనీలు  ప్రారంభించే యువతకు ఆర్థిక సాయం అందచేయడం ఈ స్కీం ముఖ్యోద్దేశం. లోన్లు ఇవ్వడానికి ఉద్దేశించిన పథకం ముద్ర బ్యాంక్ యోజన. నైపుణ్యం పెంచుకోవడానికి అవకాశం కల్పించే పథకమే ‘ స్కిల్ ఇండియా’. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 11 మంది యువతకు వివిధ రంగాల్లో  స్కిల్ పెంచుకోవడానికి వీలుగా ట్రైనింగ్ ఇచ్చింది కేంద్రం. పేద కుటుంబాలకు చెందిన ఆడవారికి  గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి కేంద్రం ఉజ్వల యోజన ను తీసుకువచ్చింది. కట్టెలతో వంట చేసుకుని నానా ఇబ్బందులు పడే మహిళలకు ఉజ్వల పథకం ఓ గొప్ప రిలీఫ్. ఈ పథకం కింద ఐదు కోట్ల గ్యాస్ కనెక్షన్లను పేద కుటుంబాలకు అందిస్తారు. పేదలందరికీ బ్యాంక్ అకౌంట్లు అందుబాటులోకి తీసుకురావడానికి రూపొందించిందే  ‘ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ’. పేదరిక నిర్మూలనే ఈ స్కీం అసలు టార్గెట్.

సంక్షేమం చుట్టూనే రాజకీయాలు

ప్రస్తుత  రాజకీయాలన్నీ  సంక్షేమం చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోటా పోటీగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. అమలు చేస్తున్నాయి.  ప్రభుత్వాలు మళ్లీ అధికారానికి రావడానికి  చాలా చోట్ల సంక్షేమ పథకాలే కీలకం అవుతున్నాయి. దీంతో   ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా  సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాదు ఏమాత్రం వీలున్నా ప్రజలకు మరింత దగ్గర కావడానికి కొత్త కొత్త పథకాలు అనౌన్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. లెక్కలు తీస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రకరకాల పేర్లతో 400 సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలన్నీ దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఈ వెల్ఫేర్ స్కీమ్స్  అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం పేదరికం ఎక్కువగా ఉన్న బీహార్, చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అందాల్సిన నిధులు అందకపోవడమే. దీనికి కారణం ఈ  రాష్ట్రాలు  ఆదాయంలో వెనుకబడి ఉండటమే. ఆదాయంలో మేజర్ షేర్ ను డెవలప్ మెంటల్ వర్క్స్ కు ఇక్కడి ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. వెల్ఫేర్ స్కీమ్స్ కు ఖర్చు పెట్టేంతటి  సొమ్ము అక్కడి  రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో వెల్ఫేర్ స్కీమ్స్ ఫలాలు అందరికీ అందేలా చేయడానికి వాటిని  రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు  ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్ . అయితే ఈ పని చాలా నేర్పుగా, జాగ్రత్తగా జరగాల్సిన అవసరం ఉంది.

టాయిలెట్ల నిర్మాణం, గ్యాస్ సిలిండర్లు హిట్

మోడీ ప్రభుత్వం మొదటి టర్మ్ లో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. వీటిలో పల్లె ప్రాంతాల్లో హౌసింగ్, టాయిలెట్ల నిర్మాణం, ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ల పంపిణీ ముఖ్యమైనవి. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కు ప్రజల్లో ఆదరణ కూడా పెరిగింది. సంక్షేమ పథకాలను యూపీఏ ప్రభుత్వం కూడా అమలు చేసింది. అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. యూపీఏ వెల్ఫేర్ స్కీమ్స్  అన్నీ ‘ ఎన్ టైటిల్ మెంట్ ’ దిశగా ఉంటే ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ‘ ఎంపవర్ మెంట్ ’ దిశగా ఉంటున్నాయి.  రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టే బడ్జెట్ లో వెల్ఫేర్ స్కీమ్స్  రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయన్నది చూడాల్సిందే. బడ్జెట్ ప్రతిపాదనలే  రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక పరిస్థితిని శాసించబోతున్నాయి.

మధ్యతరగతి నేపథ్యంగల నిర్మలపై అందరికీ ఎన్నో ఆశలు… 

..ఇంటి ఖర్చుపై భారం వేయరని కోట్లాది ఇల్లాళ్లు

..ట్యాక్స్‌ రిలీఫ్‌ ఇస్తారని ఇప్పుడిప్పుడే అర లక్ష జీతానికి ఎదిగిన మిడిల్‌క్లాస్‌ ఉద్యోగులు

..వ్యవసాయంలో లాభాలపై రైతులు

..స్టార్టప్‌లకు ఇన్సెంటివ్‌లు పెంచుతారని అమెచ్యూర్‌ ఇండస్ట్రియలిస్టులు

..ప్రతి ఒక్కరికీ 100 రోజుల పని కల్పిస్తారని ఉపాధి కూలీలు

..ప్రధాని మోడీ చెప్పిన జల సంకల్ప్‌ స్కీమ్‌తో నీటి ఎద్దడి తీర్చాలని గ్రామీణులు… ఇలా అన్ని వర్గాలూ ఆశగా చూస్తున్నాయి.