మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్పై మంత్రులు ఏమన్నారంటే..

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్పై మంత్రులు ఏమన్నారంటే..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనను సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరులు ప్రతిపాదించడంతో బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. 

ఈ సందర్భంగా మంత్రులు చేసిన కీలక వ్యాఖ్యలు:

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క:

స్పీకర్ పై ఏహ్య భావంతో మాట్లాడటం తగదని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై మండి పడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ‘‘స్పీకర్ ను అవమానించేలా మాట్లాడతారా.. ఇదేనా మీ నాయకుడు నేర్పిన గౌరవం.. మీ సంస్కారం చూస్తుంటే బాధగా ఉంది.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాదలు కాపాడాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని, సభ్యుడిని రద్దు చేయాల్సిందిగా స్పీకర్ ను కోరారు. సభ్యత్వం రద్దుపై ఎథిక్స్ కమిటీకి పంపుతామని భట్టీ అన్నారు. 

Also Read : సభలో బీఆర్ఎస్ ఆందోళన

మంత్రి శ్రీధర్ బాబు:

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చైర్ ను భయపెట్టే ధోరణిలో మాట్లాడారని, పదేండ్లు మంత్రిగా పనిచేసి. సీనియర్ అయి ఉండి ఇలా మాట్లాడటం తగదన్నారు. జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలని, స్పీకర్ పై అమర్యాద కరంగా మాట్లాడిన సభ్యుడిని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. 

మంత్రి సీతక్క:


 దళిత స్పీకర్ ను బీఆర్ఎస్ పదేపదే అవమానిస్తోందని.. దళితులను అవమానించడమే బీఆర్ఎస్ పని అని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి సీతక్క. అట్టడుగు వర్గాల ప్రజలు ఇప్పుడిప్పుడే అధికారంలో భాగస్వామ్యం అవుతున్నారని, అది చూసి తట్టుకోలేక అవమానకరంగా మాట్లాడుతున్నారని అన్నారు. నువ్వు స్పీకర్.. స్పీకర్ లా కూర్చోవడమే నీ పని.. వేరే అధికారాలు లేవు’’ అని ఏక వాక్యంతో సంభోదించడం ఎత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. స్పీకర్ కు విశేషమైన అధికారాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొన్ని వర్గాలకు, కొన్ని కుటుంబాలకు మాత్రమే గౌరవం ఉంటుంది అన్నట్లుగా.. మీకు గౌరవం లేదన్నట్లుగా ‘‘నీకు.. నీకు.. అని ఏకవచనంతో మాట్లాడారు.
నిన్న కూడా గవర్నర్ ను కాంగ్రెస్ కార్యకర్త అన్నారు.. ఇది ఏ రకమైన సంస్కృతి’’ అని సీతక్క మండి పడ్డారు. జగదీశ్ రెడ్డి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రతిపాదించారు. 

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి:

సభలో స్పీకర్ ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అహంకారంతోనే జగదీశ్ రెడ్డి వ్యవహరించారని మండిపడ్డారు. ‘‘దళితులంటే బీఆర్ఎస్ కు గౌరవం లేదు.. స్పీకర్ వ్యవస్థను, పార్లమెంటరీ వ్యవస్థను అవమానించేలా మాట్లాడిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలి’’ అని స్పీకరర్ ను కోరారు మంత్రి ఉత్తమ్. 

మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతిపాదనతో జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. సస్పెండ్ అయిన సభ్యుడు వెంటనే బయటకు వెళ్లాలని సూచించడంతో సభలో కాసేపు నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన:

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై బీఆర్ఎస్ నేతలు సభలో ఆందోళనకు దిగారు. జగదీశ్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. అధికార పక్షం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆపార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఉరిశిక్ష వేసే వారికి కూడా చివరికోరిక ఏంటని అడుగుతారని, ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. 

ఆల్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్లను పిలిచి సభలో జగదీష్‌రెడ్డి మాట్లాడిన వీడియో ప్లే చేయాలని అంతకు ముందు హరీశ్ రావు డిమాండ్ చేశారు. జగదీష్‌రెడ్డి నిజంగా తప్పు మాట్లాడి ఉంటే విచారం వ్యక్తం చేస్తామని, సభ్యులు తప్పులు మాట్లాడారని భావిస్తే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటామని అన్నారు. ముందు సభ నడపండి అని విజ్ఞప్తి చేశారు.