సిటిజన్ షిప్ యాక్ట్ సపోర్టర్స్ ఏమంటున్నారంటే?

సిటిజన్​షిప్ యాక్ట్ దేశ రాజకీయాలను ఊపేస్తోంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొన సాగుతున్నాయి.  పౌరసత్వ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతి రేకమని ప్రతిపక్షాలు అంటుం టే… చరిత్రలో జరిగిన పొర పాట్లను సరిదిద్దుకోవడానికే చట్టం తీసుకువచ్చామంటు న్నారు అధికార పార్టీ నాయకులు.  చట్టాన్ని సమర్ధించేవారు చేస్తున్న వాదనలు ఇలా ఉన్నాయి..

దేశ విభజన తరువాత కోటి మందికిపైగా సరిహద్దులు దాటి అటూఇటూ మారారు. ఇందులో భాగంగా  మనదేశానికి చెందిన చాలా మంది ముస్లింలు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ దేశాలకు వెళ్లారు. అక్కడ ఉన్నవి ముస్లిం ప్రభుత్వాలే. ఇలా ఇండియా నుంచి ఈ మూడు దేశాలకు వలస వెళ్లినవాళ్లు ముస్లింలు కాగా, అక్కడే స్థిరపడిన ఇతర మతాలవాళ్లు మైనారిటీలుగా మారారు. ముస్లిం ప్రభుత్వాల పాలనలో ఇండియన్ మూలాలున్న ఈ మైనారిటీలు మతపరంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ కష్టాలు తట్టుకోలేక, ఇబ్బందులు పడలేక చాలామంది ఇండియాకు తిరిగి వచ్చేశారు. ఇలా  2014  డిసెంబర్ 31కు ముందు వచ్చిన ఆరు మతాలకు చెందిన నాన్​–ముస్లిం (హిందు, సిక్కు, బౌద్ధ, జైన్​, పార్శీ, క్రిస్టియన్లు)లకు సిటిజన్​షిప్​ ఇవ్వాలని మోడీ సర్కారు నిర్ణయించింది. వీళ్లు మన దేశంలో ఆరేళ్లపాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటే వారికి న్యాయం చేయడానికి ఉద్దేశించిందే సిటిజన్​షిప్ అమెండ్​మెంట్​ యాక్ట్ (సీఏఏ). ఈ మూడు ముస్లిం దేశాల్లోనూ ఇండియన్ మూలాలున్న మైనారిటీలకు చట్టపరంగా ఆశ్రయం కల్పించడం, వారికి సిటిజన్ అనే హోదా ఇవ్వడమే పౌరసత్వ చట్టం అసలు ఉద్దేశమంటున్నారు అధికార పార్టీ నాయకులు. అయితే సిటిజన్​షిప్ యాక్ట్​లో  ముస్లింల పట్ల వివక్ష చూపారన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం.

ఇక్కడి ముస్లింలకు సంబంధమే లేదు

సిటిజన్​షిప్ అమెండ్​మెంట్​ యాక్ట్ ఇండియాలో ఎప్పటి నుంచో ఉన్న ముస్లింలకు వ్యతిరేకమన్న ప్రచారం  జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఇదొక అపోహ మాత్రమే అంటున్నారు ఎనలిస్టులు. పౌరసత్వ చట్టానికి, ఇక్కడి ముస్లింలకు ఏమాత్రం సంబంధం లేదు. ఈ దేశంలో పుట్టి పెరిగిన ముస్లింలు తాము ఇక్కడివాళ్లమేనని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. పౌరసత్వ చట్టం మనదేశంలోని ముస్లింలకు వ్యతిరేకమన్నది కేవలం కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు కావాలని చేస్తున్న ప్రచారమేనంటున్నారు ఎనలిస్టులు.

వేరే దేశాల్లోని ముస్లింల కోసం సెక్షన్‑ 6

పాకిస్థాన్​, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్​లలో మతం కారణంగా కష్టాలు పడ్డ మైనారిటీలకు న్యాయం చేయడానికి ఉద్దేశించిన ఒక ప్రత్యేక చట్టం సీఏఏ. దీనిలో ప్రస్తావించిన ఆరు మతాలకు చెందినవాళ్లలో ముస్లింలు లేకపోవడాన్ని ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ఇండియన్ సిటిజన్​షిప్ ఇవ్వడానికి ఉద్దేశించింది కాదు ఈ చట్టం. వేరే దేశాల్లోని ముస్లింలు ఎవరైనా మన దేశ సిటిజన్​షిప్ పొందాలంటే దానికి ప్రత్యేక చట్టాలున్నాయి. సిటిజన్​షిప్ యాక్ట్ సెక్షన్–6 కింద వాళ్లు అప్లయ్ చేసుకోవచ్చు, పౌరసత్వం పొందవచ్చు. ప్రభుత్వం తెచ్చిన సిటిజన్​షిప్ అమెండ్​మెంట్​ యాక్ట్​కి దీనితో సంబంధం లేదు.

మూడు దేశాల్లోని ముస్లింలు కూడా అప్లయ్ చేయొచ్చు 

పైన చెప్పిన మూడు దేశాల్లోని ముస్లింలకు మౌలికంగా సిటిజన్​షిప్ యాక్ట్ వర్తించదు. అయితే, ఈ మూడు దేశాల్లోని ముస్లింలకు ఇండియన్​ సిటిజన్​షిప్​ ఎప్పటికీ దొరకదు అనడం కూడా కరెక్ట్ కాదు. వేరే దేశాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వడానికి సంబంధించి మన దేశంలో ఆల్రెడీ కొన్ని చట్టాలున్నాయి. ఈ చట్టాల ప్రకారం వాళ్లు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

అక్రమ వలసదారుల తరలింపు అంశం  చట్టంలో లేదు 

ఆ మూడు ముస్లిం దేశాల్లోని ఆరు మతాలకు చెందిన మైనారిటీలకు (నాన్​ ముస్లింలకు) ఇండియన్​ సిటిజన్​షిప్ ఇచ్చే అంశానికే మాత్రమే కొత్త సవరణ చట్టం పరిమితం.  కొన్నేళ్లుగా ఇక్కడ అక్రమంగా వలస వచ్చిఉంటున్న  ముస్లింల ప్రస్తావన అమెండ్​మెంట్​ యాక్ట్​లో ఎక్కడా లేదు. ఈ యాక్ట్ ను అడ్డం పెట్టుకుని సరైన పత్రాలు లేకుండా మన దేశంలో అక్రమంగా ఉంటున్న ముస్లింలను పంపేస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటున్నారు నిపుణులు.

హిందువులైనా ఆరేళ్లపాటు ఉంటేనే పౌరసత్వం

‘సిటిజన్​షిప్ అమెండ్​మెంట్​ యాక్ట్ హిందువులకు పూర్తిగా అనుకూలంగా తయారుచేసిన చట్టం’ అని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ దేశాల నుంచి వచ్చిన మైనారిటీలు (ఆరు మతాలకు చెందినవాళ్లు) మనదేశంలో కనీసం ఆరేళ్ల పాటు ఉండాలి. అప్పుడే వారికి సిటిజన్​షిప్ ఇస్తారు. హిందువులు సహా ఆరు మతాలకు చెందినవారు తప్పనిసరిగా ఇక్కడ కనీసం ఆరేళ్ల పాటు ఉన్నట్లుగా ఆధారాలు చూపాలి. గతంలో కనీసం 11 ఏళ్ల పాటు ఉంటేనే సిటిజన్​షిప్ ఇచ్చేవారు. ఈ రూల్​ను మార్చారు. ఇప్పుడు ఆరేళ్లు ఉంటే చాలంటున్నారు. హిందువుల విషయంలోనూ రూల్స్ ఇంతే కచ్చితంగా ఉన్నాయి.

షియాలను ఎందుకు మినహాయించారంటే…?

షియా, అహ్మదీయ, హజారస్ …వీళ్లంతాముస్లింలే. ముస్లింలలోని వేర్వేరు జాతులకు చెందిన వారు. మతపరంగా షియా, అహ్మదీయ జాతులకు ప్రత్యేక గుర్తింపు అంటూ ఏమీ లేదు. అందరినీ ముస్లింలుగానే గుర్తిస్తారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ దేశాల్లో వీరిని మైనారిటీల కింద చూడరు. అందరినీ ముస్లింలుగానే చూస్తారు. ముస్లింలు అయినంతమాత్రాన మతపరంగా వీళ్లు ఇబ్బందులు పడటం అనేది ఉండదు. ఈ కారణంతోనే ముస్లింలలోని వేర్వేరు జాతులుగా భావించే షియా, అహ్మదీయ, హజారస్ వర్గాలను  సిటిజన్​షిప్ యాక్ట్ నుంచి మినహాయించారు.

బలోచ్, రోహింగ్యాల సంగతేంటి?

బలోచ్, రోహింగ్యాలు కూడా ఇస్లాంలోని వేర్వేరు జాతులకు చెందినవాళ్లే. అయితే, బలోచ్ వర్గీయులు ఇండియాకి లేదా మరో దేశానికి వలస రావాలని కోరుకోవడం లేదు. బలూచిస్తాన్ ప్రాంతంలో తమ కంటూ ఒక ప్రత్యేక దేశం కావాలన్నది వారి డిమాండ్. అందుకే  ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేస్తున్న బలోచ్ లను సిటిజన్​షిప్ అమెండ్​మెంట్​ యాక్ట్ నుంచి మినహాయించారు. ఇక రోహింగ్యాల పరిస్థితి పూర్తిగా డిఫరెంట్. మయన్మార్ మిలటరీపై దాడులు చేశారన్న ఆరోపణలు రోహింగ్యాలపై ఉన్నాయి. మిలటరీ ప్రతిదాడులకు పాల్పడడంతో వీళ్లు మయన్మార్ విడిచిపెట్టి పారిపోయారు. అంతేకాదు, మయన్మార్​లో హిందువులపై కూడా రోహింగ్యాలు దాడులు చేసినట్లు చరిత్ర చెబుతోంది. రోహింగ్యాలకు టెర్రరిస్టు యాక్టివిటీస్​తో సంబంధాలున్న సంగతి అనేక సంఘటనల్లో బయటపడింది. దీంతో దేశ భద్రతకు డేంజర్​గా మారే అవకాశాలున్న రోహింగ్యాలను సిటిజన్​షిప్ యాక్ట్ నుంచి మినహాయించారు.

ఆర్టికల్–14ను ఉల్లంఘించలేదు

ఈ యాక్ట్ రూపొందించడంలో చట్టం ముందు అందరూ సమానులేనన్న ఆర్టికల్–14ను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందన్న ఆరోపణ వినిపిస్తోంది.  ఇది అపోహ మాత్రమే. సిటిజన్​షిప్ యాక్ట్​కు ఆర్టికల్–14తో ఎలాంటి పేచీ లేదు. మన దేశ ప్రజలందరికీ జీవించే హక్కును ఆర్టికల్–21 కల్పిస్తోంది. సిటిజన్​షిప్ యాక్ట్​లోని ఆర్టికల్–21ని ఎక్కడా టచ్ చేయలేదు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. ప్రజలు జీవించే హక్కుకు సంబంధించిన ప్రస్తావన కొత్త చట్టంలో లేదు. మనదేశానికి వలసవచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి సంబంధించి చేసిన చట్టమే సిటిజన్​షిప్ యాక్ట్.

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీయలేదు 

రాజ్యాంగ స్ఫూర్తిని ఈ యాక్ట్ దెబ్బతీస్తోందన్న ప్రచారం ఒక అపోహ మాత్రమే అంటున్నారు దీన్ని సమర్ధించేవారు.  పౌరసత్వ చట్టాన్ని నూటికి నూరుశాతం రాజ్యాంగబద్ధంగానే రూపొందించారంటున్నారు. పౌరులందరికీ అన్ని విష యాల్లో ఒకే రకమైన చట్టా లు వర్తించవు. మతం ఆధా రంగా పెళ్లి వంటి విషయాల్లో ఒక్కో కమ్యూనిటీకి ఒక్కో చట్టం అమల్లో ఉందన్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్న మాట వాస్తవమే. ఈ వ్యతిరేకతకు కారణాలు వేరేగా ఉన్నాయి. ప్రతిపక్షాలు, లెఫ్ట్ పార్టీలు ప్రస్తావిస్తున్న అంశాలు ఈ వ్యతిరేకతకు కారణం కాదు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినవాళ్లు ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు, సహజంగా ఈశాన్య రాష్ట్రాలు చాలా చిన్నవి. అక్కడి వారి ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి. దీంతో మూడు ముస్లిం దేశాల నుంచి వలస వచ్చిన వాళ్లకు సిటిజన్​షిప్ ఇవ్వడం వల్ల  అంతంతమాత్రంగా ఉన్న  తమ ఉద్యోగ అవకాశాలు, కల్చర్ దెబ్బతింటుందన్న భయాందోళనలు ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ఉంది. ముఖ్యంగా అస్సాం ప్రజల్లో ఈ భయాందోళనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బ్యాక్ డ్రాప్​లో ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మైనారిటీల్లో భయం పుట్టించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​ గురించి తప్పుడు సమాచారమిస్తున్నారు. కొన్ని శక్తులు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి. మైనార్టీలు ఈ ఉచ్చులో పడకూడదు. ఇల్లీగల్​ ఇమ్మిగ్రెంట్లకు అమెరికా సహా ఏ దేశమైనా రెడ్‌ కార్పెట్‌ వేయదు. మన దేశం ధర్మశాల కాదు. ఈ చట్టం మన ప్రజలకు సంబంధించింది కాదు. పాక్‌, బంగ్లా, అఫ్ఘానిస్థాన్​ దేశాల్లోని మైనారిటీలు ఎక్కడికీ వెళ్లలేరు కాబట్టి, వారు ఇండియాకి వస్తే సిటిజన్​షిప్​ ఇస్తున్నాం.

‑ నితిన్​ గడ్కరీ, కేంద్ర మంత్రి