యూఎస్ చైనా టారిఫ్ వార్ ఎఫెక్ట్: ఈ వారం పెరగనున్న మార్కెట్‌‌‌‌ వోలటాలిటీ

యూఎస్ చైనా టారిఫ్ వార్ ఎఫెక్ట్: ఈ వారం పెరగనున్న మార్కెట్‌‌‌‌ వోలటాలిటీ
  • సోమవారం, శుక్రవారం సెలవు

న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్‌‌‌‌ను  యూఎస్–-చైనా టారిఫ్ వార్ పరిణామాలు, విప్రో,  ఇన్ఫోసిస్ క్యూ4 రిజల్ట్స్ ప్రభావితం చేయనున్నాయి. గ్లోబల్‌‌‌‌  మార్కెట్  ట్రెండ్స్,  విదేశీ పెట్టుబడిదారుల కదలికలపై ట్రేడర్లు దృష్టి పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఫారిన్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐలు) ఈ నెలల ఇప్పటివరకు నికరంగా రూ.31,575 కోట్లను ఇండియన్ మార్కెట్ల నుంచి విత్‌‌‌‌డ్రా చేసుకున్నారు. కాగా,  డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం, గుడ్ ఫ్రైడే కారణంగా శుక్రవారం స్టాక్ మార్కెట్‌‌‌‌కు సెలవు.  “ఈ వారం గ్లోబల్, ఇండియన్ మార్కెట్లలో వోలటాలిటీ కనిపించొచ్చు.  

చైనా–యూఎస్ మధ్య ట్రేడ్‌‌‌‌ వార్ ఇప్పటికే త్రీవమైంది. మార్కెట్లలో గందరగోళం ఏర్పడింది.  దేశీయంగా చూస్తే హోల్‌‌‌‌సేల్‌‌‌‌, రిటైల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ నెంబర్లు ఈ వారం విడుదల కానున్నాయి.  గ్లోబల్‌‌‌‌గా యూఎస్, యూకే,  చైనా తమ మాక్రో ఎకనామిక్ డేటాను  విడుదల చేయనున్నాయి” అని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా తెలిపారు. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ మొదటి వారంలో 70 కి పైగా దేశాలపై ప్రతీకార సుంకాలు వేశారు. 

ఆ తర్వాత చైనా మినహా చాలా దేశాలకు “ప్రతీకార సుంకాల”పై 90 రోజుల విరామాన్ని ప్రకటించారు. అమెరికా వేస్తున్న 145 శాతం టారిఫ్‌‌‌‌కు  ప్రతిగా చైనా కూడా యూఎస్ దిగుమతులపై టారిఫ్‌‌‌‌ను 125 శాతానికి పెంచింది. తాజాగా చైనాతో (20 శాతం టారిఫ్‌‌‌‌ కొనసాగుతుంది)  సహా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న స్మార్ట్‌‌‌‌ఫోన్లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు వంటి ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్‌‌‌‌లకు టారిఫ్‌‌‌‌ల నుంచి అమెరికా ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 

ఈ అంశాలపై మార్కెట్లు మంగళవారం స్పందించనున్నాయి. మరోవైపు  విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తమ మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌ (క్యూ4) ఫలితాలను ఈ వారం ప్రకటించనున్నాయి.  కిందటి వారం  సెన్సెక్స్ 207 పాయింట్లు (0.27 శాతం) తగ్గగా,  నిఫ్టీ 76 పాయింట్లు (0.33 శాతం) నష్టపోయింది.