భార్యను రేప్ చేయించిన కేసులో.. ఫ్రాన్స్ వ్యక్తికి 20 ఏండ్ల జైలు

భార్యను రేప్ చేయించిన కేసులో.. ఫ్రాన్స్ వ్యక్తికి 20 ఏండ్ల జైలు
  • మొత్తం 72 మందితో 92 సార్లు అఘాయిత్యం
  • మరో 50 మందిని దోషులుగా తేల్చిన కోర్టు

పారిస్: భార్యకు డ్రగ్ ఇచ్చి ఆమె స్పృహ తప్పిపడిపోయాక పలువురితో అత్యాచారం చేయించిన భర్త కేసులో ప్రాన్స్ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. ఆమె భర్త డొమినిక్ పెలికాట్ (72)తో పాటు రేప్ చేసిన మరో 50 మందిని దోషులుగా ప్రకటించింది. సొంత భార్య పట్ల పాశవికంగా ప్రవర్తించిన డొమినిక్ పెలికాట్ కు 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మిగతా దోషులకు విధించిన శిక్షపై స్పష్టత లేదు. అయితే దోషుల్లో లారీ డ్రైవర్లు, జవాన్లు, ఫైర్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, వ్యవసాయ కూలీలు, సూపర్ మార్కెట్ వర్కర్, జర్నలిస్టు, నిరుద్యోగ యువకులు ఉన్నారు.

అసలు ఏం జరిగిందంటే..?
ఫ్రాన్స్ లోని మోంట్ వెంటౌక్స్ పర్వతాల దిగువన ఉన్న  మజాన్ గ్రామంలో  డొమినిక్ పెలికాట్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయిన డొమినిక్..రాత్రి పూట భార్య తినే ఫుడ్ లో సీక్రెట్గా  డ్రగ్స్ కలిపి తినిపించేవాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక ఇంటికి కొందరిని పిలిచేవాడు. వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే సీక్రెట్ కెమెరాలతో రికార్డు చేసేవాడు.

2011 నుంచి 2020 మధ్య దాదాపు పదేండ్ల పాటు తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులతో రేప్ చేయించాడు. అయితే, 2020లో డొమినిక్ ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ కొందరు మహిళలను వారికి తెలియకుండా వీడియో తీశాడు. అది గమనించిన సెక్యూరిటీ గార్డ్ అతనిడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

దర్యాప్తులో భాగంగా..పోలీసులు అతడి ఫోన్, కంప్యూటర్ సెర్చ్ చేయగా.. భార్యపై అతడి అకృత్యాలు బయటపడ్డాయి.  అతని కంప్యూటర్ డ్రైవ్‌లలో 20 వేలకు పైగా మహిళల ఫొటోలు, భార్యపై అత్యాచారం వీడియోలను చూసి పోలీసులే షాక్ అయ్యారు.

డొమినిక్ తన భార్యపై మొత్తం 72 మందితో 92 సార్లు అత్యాచారం చేయించినట్లు వీడియోలతో  తేలింది. నిందితుల వయసు 22 నుంచి 70 ఏండ్ల  మధ్యలో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అయితే 72 మందిలో 51 మందినే గుర్తించామని..మిగిలిన వారి ఆచూకీ లభించలేదని చెప్పారు. విచారణలో భాగంగా డొమినిక్  నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు వీడియోల ఆధారంగా డొమినిక్ తో పాటు మరో 50 మందిని దోషులుగా తేల్చింది.