హైదరాబాద్లో రోజుకు 4 నుంచి 6 గంటలే నిద్ర..కారణాలేంటి.?

 హైదరాబాద్లో రోజుకు 4 నుంచి 6 గంటలే నిద్ర..కారణాలేంటి.?

సాధారణంగా ఉద్యోగాలు చేసేవాళ్లు వీకెండ్స్​లో ఎంజాయ్​ చేయాలి, సరదాగా ఫ్రెండ్స్​, ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్లాలి అనుకుంటారు. కానీ.. హైదరాబాద్‌‌‌‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో డేటా అనలిస్ట్‌‌‌‌గా పనిచేస్తున్న కార్తికేయ మాత్రం నిద్ర పోవాలి అనుకుంటాడు. కార్తికేయ మాత్రమే కాదు.. ఇలాంటివాళ్లు ఎంతోమంది ఉన్నారు. దానికి కారణం.. మిగతా రోజుల్లో సరిపడా నిద్ర లేకపోవడమే. 

కమ్యూనిటీ ఫోరమ్ లోకల్ సర్కిల్స్ చేసిన స్టడీ ప్రకారం.. దేశంలో దాదాపు 59 శాతం మంది రోజుకు ఆరు గంటల కంటే తక్కువ టైం నిద్రపోతున్నారు. వాళ్లలో 23శాతం మంది వీకెండ్స్​లో ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల స్లీప్​ లాస్​ని భర్తీ చేసుకోకుంటున్నారు. మిగతావాళ్లు మాత్రం నిద్ర సరిపోక రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సర్వే దేశవ్యాప్తంగా 348 జిల్లాల్లో 43,000 మందిపై చేశారు. ఇందులో పాల్గొన్న హైదరాబాదీలు కూడా నిద్ర సరిపోవడంలేదనే చెప్పారు. సిటీలో దాదాపు 48 శాతం మంది రోజుకు నాలుగు నుండి ఆరు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. వాళ్లలో 34 శాతం మంది స్లీప్​లాస్​ని భర్తీ చేసుకోలేకపోతున్నారు. 

కారణాలేంటి? 

నిద్ర సరిపోకపోవడానికి కారణాలు ఏంటంటే.. నిద్రవేళల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు వాష్‌‌‌‌రూమ్‌‌‌‌కి వెళ్లాల్సి రావడమే అని 37 శాతం మంది చెప్తున్నారు. మరికొందరు ఇంటి పనుల వల్ల ఆలస్యంగా పడుకోవడం, మరుసటి రోజు ఉదయం త్వరగా నిద్రలేవాల్సి రావడం, మొబైల్ కాల్స్, మెసేజ్​లకు రిప్లైలు ఇవ్వడంతో ఆలస్యమవడం, దోమలు వల్ల నిద్ర పట్టకపోవడం... ఇలా రకరకాల కారణాలు చెప్పారు. ఎక్స్​పర్ట్స్​ మాత్రం అన్ని వయసుల వాళ్లకు ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలంటున్నారు. అయితే.. పెరిగిన పనిభారం వల్ల కొందరికి ఏడు నుండి తొమ్మిది గంటల నిద్ర కచ్చితమైన అవసరంగా మారింది. ఒకేసారి మొత్తం నిద్ర కోటాను పూర్తి చేయలేనప్పుడు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు రెండు విడతలుగా పగటిపూట రెండు గంటలు, రాత్రి ఆరు గంటలు నిద్రపోవాలి.