హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు తమ పదేండ్ల పాలనలో రైతులను నిండా ముంచి.. ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీ భవన్లో కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌పై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయాలపైనా బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
వడ్లకు రూ.500 బోనస్‌పై బీఆర్ఎస్ నాయకులు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న బియ్యం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయని, ఇక్కడ సన్న బియ్యం సాగును ప్రోత్సహించడానికే సర్కారు బోనస్‌ను ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. అన్ని వడ్లకూ బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ధరణి, భూ రికార్డుల ప్రక్షాళనలో బీఆర్ఎస్ నేతలు భూములను దోచుకున్నారని, ధరణిలో లక్ష ఎకరాలను దోచుకొని వాటిని నిషేదిత జాబితా నుంచి తొలగించి వారి పేర్ల మీదకు మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ దోపిడీ గురించి చెప్పాలంటే చాలా ఉందని, చెప్పమంటే హరీశ్ రావుకు చెప్తామని కోదండరెడ్డి తెలిపారు. ప్రభుత్వం ధరణిపై కమిటీ ఏర్పాటు చేసిందని, సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.