చైనా బార్డర్​ చట్టంతో మనకు ముప్పెంత?

అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి సంక్లిష్టమైన ప్రక్రియల్లోశాంతి చర్చలతోపాటు యుద్ధ సన్నద్ధత చర్యలు ఏకకాలంలో జరగడం ఒకటి. ఇవి రెండూ బ్యాలన్స్​ అయినప్పుడే నిజమైన శాంతి సాధ్యపడుతుంది. ప్రస్తుతం ఇండియా, చైనా ఈ దిశగానే ముందుకు సాగుతున్నాయి. దేశ ప్రయోజనాలు ముడిపడి ఉన్నపుడు, ఏ దేశం కూడా వెనకడుగు వేసే పరిస్థితి లేనప్పుడు శాంతి చర్చలు సత్ఫలితాలు ఇస్తాయని లేదంటే దేశాలు తమ వాదనలపై వెనక్కి తగ్గుతాయని అనుకోవడానికి వీలు లేదు. సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరు పక్షాల దూకుడు చర్యలు ఇప్పట్లో ముగిసేలా లేవని ఇండియా, చైనా చర్యలు సూచిస్తున్నాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘ వివాదానికి, ఉద్రిక్తతలకు మనమంతా సిద్ధంగా ఉండాలి.

అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషణలో వాస్తవికవాదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దాని ప్రకారం ప్రతి దేశం తన సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ప్రయోజనాలు దేశ సార్వభౌమ, ఆర్థిక, భద్రతా విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వివిధ దేశాల ప్రయోజనాలు పరస్పరం పోటీ పడుతూ, వాటి వల్ల ఏర్పడే ఫలితాలను ఎదుర్కొంటూ, తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా పావులు కదుపుతాయి. చదరంగం లాంటి ఈ ఆట ఎల్లప్పుడూ దేశాల మధ్య కొనసాగుతూ ఉంటుంది. ఈ ఆటలో గెలుపు ఓటములు, ఆట ముగియడానికి నిర్ణీత సమయం, స్నేహితులు, -ప్రత్యర్థులు అంటూ ఎవరూ ఉండరు. ప్రతి దేశం తాను గెలవడానికి అనేక పావులను వాడుతూ ఉంటుంది. వాటిలో మీడియా, మిలిటరీ, పార్టీ, ప్రజలు ఇలా దేశంలోని వివిధ వర్గాలను సమన్వయం చేసుకుంటూ దీర్ఘకాల వ్యూహంతో ముందుకు వెళ్తేనే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నేండ్లుగా ఇండియా, చైనా మధ్య కొనసాగుతున్న వ్యవహారాలను పరిశీలిస్తే ఇవన్నీ అర్థమవుతాయి.

బార్డర్​లో పెరుగుతున్న చైనా దూకుడు
జనవరి ఒకటిన గాల్వాన్ లోయలో చైనా జెండాను ప్రదర్శించిందంటూ ఆ దేశ మీడియా ప్రసారం చేసింది. అటు తర్వాత పాంగంగ్ త్సో సరస్సుపై చైనా బ్రిడ్జి కడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీనికి ప్రతిస్పందనగా గాల్వాన్​ లోయలో జవాన్లు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసినట్టు మన మీడియాలో ఫొటోలు వచ్చాయి. అంతకు ముందు 2021 అక్టోబర్  23న చైనా వివాదాస్పదమైన సరిహద్దు భూభాగాల చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. అంతేకాదు గత ఏడాది అక్టోబర్ 14న భూటాన్ తో సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఇండియన్​ బార్డర్​లో అన్ని వసతులతో కూడిన 600పైగా గ్రామాలను చైనా నిర్మించిందని అమెరికాకు చెందిన ప్లానెట్ లాబ్స్ అనే సంస్థ వెల్లడించింది. ఈ వార్తలన్నీ ఇండియాను కలవరపాటుకు గురిచేసేవే. అయితే చైనాలో పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ప్రతిచర్యలు రూపొందించుకుంటూ వెళ్తే చైనాను ఎదుర్కోవడం మనకు పెద్ద సమస్య కాదు.

బార్డర్​లోని తెగల్లో విధేయతను పెంచడానికే
2014లో జిన్​పింగ్ ప్రకటించిన నేషన్ పాలసీ ప్రకారం చైనీయుల్లో దేశభక్తి, విధేయతను పెంచే విధానాలను చైనా రూపొందించింది. అందులో భాగంగా టిబెట్, క్సిన్జియాంగ్ లాంటి ప్రావిన్సుల్లోని తెగల్లో చైనా పట్ల విధేయతను పెంచాలని భావించింది. అయితే భాషపరంగా, సామాజిక, సాంస్కృతిక, చారిత్రిక పరంగా చైనాతో సంబంధం లేని ఈ తెగల్లో దేశభక్తిని పెంచడం అంత సులభం కాదు. ముఖ్యంగా 14 దేశాలతో 20 వేల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతాల్లో నివసిస్తున్న 30 తెగల్లో దేశం పట్ల విధేయత లేకపోతే, ఆయా దేశాలతో ఘర్షణలు తలెత్తినప్పుడు చైనాకు నష్టం కలుగుతుందని ఆ దేశం ఆందోళన. ఈ విషయం గుర్తించిన చైనా 2017లో సరిహద్దుల అభివృద్ధి, సరిహద్దు ప్రజలను సుసంపన్నం చేయడానికి చర్య అనే విషయాన్ని తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, స్థానిక ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ స్థానిక ప్రజలను అభివృద్ధి పనుల్లో, స్థానిక సమస్యల పరిష్కారాల్లో, అభివృద్ధికి కావలసిన నిర్ణయాల్లో భాగస్వామం కల్పిస్తాయి. ఈ విధానానికి కొనసాగింపుగా 2021 ల్యాండ్ బార్డర్ యాక్ట్ కు మరింత పదును పెట్టి, స్థానిక పౌర ప్రభుత్వాలకు మరిన్ని బాధ్యతలు అప్పజెప్పింది. దాని ప్రకారం సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, అన్ని వసతులతో కూడిన గ్రామాల నిర్మాణం, సరిహద్దుల రక్షణలో ప్రజలను భాగస్వాములను చేయడం స్థానిక ప్రభుత్వాల బాధ్యత. అంటే పార్టీ, ప్రభుత్వం, సైన్యం, ప్రజలు సరిహద్దులను రక్షించే ముఖ్య పాత్రను పోషిస్తారు. బాధ్యతను పంచుకోవడం ద్వారా ఉమ్మడి జాతీయ గుర్తింపును నిర్మించడం అనేది ఈ మొత్తం ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశం. అయితే ఈ చర్యలు ఇతర దేశాలతో శాంతిపూర్వక సరిహద్దులు ఉన్నప్పుడు అంతర్గత వ్యవహారంగా చూస్తారు కానీ, సరిహద్దు వివాదాలు ఉన్నప్పుడు వీటిని ఏకపక్ష, దుందుడుకు చర్యలుగానే అంతా చూస్తారు.

బహుముఖ వ్యూహంతో ముందుకు..
2014 నుంచి జరిగిన సంఘటనలను, అమలు చేస్తున్న విధానాలను గమనిస్తే, సరిహద్దుల విషయంలో చైనా బహుముఖ వ్యూహాన్ని రూపొందించినట్టు గుర్తించవచ్చు. 1. సరిహద్దులపై ఏకపక్షంగా తన వైఖరిని తెలియజేయడం, దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను నిర్మించడం, 2. చైనా వాదనల్లో స్థానికులను ఏకం చేయడం, 3. సైనిక, పౌర సంబంధాలను నిర్మించడం, 4. కమ్యూనిస్టు పార్టీ దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని చైనీయుల్లో ప్రచారం చేయడం ఇందులో ముఖ్యమైనవి. సరిహద్దు మౌలిక వసతుల అభివృద్ధి వల్ల స్థానికులకే కాకుండా, వివిధ దశల్లో ఉన్న షాంఘై సహకార సంస్థ, చైనా-ఆసియాన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా, లాంకాంగ్ నది-మెకాంగ్ సహకారం, మధ్య ఆసియా ప్రాంతీయ ఆర్థిక సహకారం, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి వాటికి కూడా మేలు కలుగుతుందని తద్వారా దీర్ఘకాల ప్రయోజనాలు నెరవేరతాయని చైనా భావిస్తోంది. ఈ విధానాల ఫలితంగా సరిహద్దు ప్రాంతాలకు ఆర్థిక ప్రయోజనాలే కాకుండా సాంస్కృతిక, సాంకేతిక మార్పిడి ద్వారా ఏర్పడే ప్రయోజనాలు కూడా అందుతాయనేది చైనా భావన. కానీ, అదే సమయంలో ఏకపక్షంగా, బలవంతంగా తీసుకునే చర్యలు ఏ మేరకు సక్సెస్​ అవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

చైనాకు ధీటుగా  ఇండియా ప్రాజెక్టులు
చైనా దూకుడు చర్యలను ఎదుర్కొనేందుకు ఇండియా కూడా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు బలోపేతం చేసే దిశగా పయనిస్తోంది. 2005లో ఇండియా, చైనా బార్డర్ రోడ్స్(ICBR) మొదటి దశ కింద 3,323 కిలోమీటర్ల పొడవుతో 73 సరిహద్దు రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. 2021లో ICBR ఫేజ్ టూ కింద 6,700 కిలోమీటర్ల పొడవైన మరో 104 సరిహద్దు రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులను జతచేసింది. ఈ రోడ్లను కేంద్ర హోం శాఖకు చెందిన బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్మెంట్ ఫండ్ నిర్వహిస్తోంది. దీనితోపాటు రక్షణ శాఖ నేతృత్వంలో ఎంపవర్​ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే దర్బుక్-–షాయోక్-–దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్, రోహ్తంగ్ పాస్ టన్నెల్ లాంటి పనులు పూర్తయ్యాయి. నిర్మాణంలో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టుల్లో అరుణాచల్ ప్రదేశ్​లోని సెలా టన్నెల్, బ్రహ్మపుత్ర నది కింద రోడ్డు-కమ్-రైల్ సొరంగం, లడఖ్​లోని ఉమ్లింగ్ లా పాస్ వద్ద 19 వేల అడుగుల ఎత్తులో ఉన్న చిసుమ్లే-డెమ్చోక్, డోక్లాం సమీపంలోని డోక్లా ప్రాంతానికి చేరుకోవడానికి ఫ్లాగ్ హిల్-డోక్లా రహదారి ముఖ్యమైనవి. తాను సరిహద్దులను పటిష్టపరుచుకుంటూ ఇండియా చేస్తున్న పనులను అనుమానంతో చూడటం వల్లే చైనాతో ఇండియాకు చిక్కులు వచ్చి పడుతున్నాయి. పైకి ఇండియా తనకు పెద్ద సమస్య కాదనట్టు చైనా వ్యవహరిస్తున్నా ఇప్పటికీ తన ప్రధాన ప్రత్యర్థిగానే భావిస్తోంది. అందుకే నేపాల్, భూటాన్ పట్ల సరిహద్దు వివాదాల్లో మెతక వైఖరి అవలంబిస్తూ ఇండియా పట్ల కఠినంగా ఉంటోంది. దక్షిణ చైనా సముద్రంపై, వియత్నాంతో మితృత్వంపై ఇండియా అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూనే, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహా సముద్రంలో తన స్థావరాల ఏర్పాటుకు శ్రీలంక, మాల్దీవ్స్, పాకిస్తాన్ తో సంబంధాలను పెంచుకుంటూ ఇండియాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది.

- డా. గద్దె ఓంప్రసాద్, అసిస్టెంట్​ ప్రొఫెసర్, సెంట్రల్​ యూనివర్సిటీ, సిక్కిం