UPS పెన్షన్ అప్డేట్: 8వ వేతన కమిషన్ ప్రకారం పెన్షన్ ఎంత పెరగొచ్చు..?

ఆర్థిక సంవత్సరం–2026 కోసం కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, పెన్షనర్లు, ట్యాక్స్ పేయర్స్ నుండి మొదలుకొని సామాన్య పౌరుడు బడ్జెట్ గురించి అంచనాలు పెంచుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పై ఆశలు పెంచుకున్నారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (Unified Pension Scheme) ప్రకారం.. 8వ వేతన సంఘం(8th Pay Commission) సిఫార్సుల ప్రకారం ఈ సారి పెన్షన్ ఎంత పెరగొచ్చుననే అంచనాలు వేస్తున్నారు.

మోడీ ప్రభుత్వం 8వ వేతన సంఘానికి ఆమోదం తెలిపడంతో 1.2 కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ సారి ఉపశమనం కలగనుందని అంటున్నారు. 2025 బడ్జెట్ మరికొద్ది రోజులలో ప్రవేశపెట్టనుండటంతో ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలు తీపికబురు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Unified Pension Scheme అంటే ఏమిటి?

పాత, కొత్త పెన్షన్ స్కీములను కలుపుకొని ఏర్పాటు చేసినదే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ 1 ఏప్రిల్, 2025 నుండి అమలు కానుంది. దీనిప్రకారం ఫ్యామిలీ పెన్షన్, గ్యారంటీడ్ పెన్షన్, కనీస పెన్షన్ లు అమలు కానున్నాయి. దీని ప్రకారం ఉద్యోగులకు రిటైర్మెంట్ కంటే 12 నెలల ముందు బేసిక్ శాలరీ ఆధారంగా 50 శాతం పెన్షన్ ఎమౌంట్ ఇస్తారు. 25 ఏండ్లు కేంద్ర ప్రభుత్వానికి సేవ చేసినందుకు అమలు చేస్తారు. యూపీఎస్ పెన్షన్ అందుకోవాలంటే కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. దీని ప్రకారం 10 వేల రూపాయలను కనీస పెన్షన్ గా అందుకుంటారు. 


ఒకవేళ సదరు పెన్షనర్ మరణిస్తే.. 60 శాతం పెన్షన్ అమౌంట్ ను కుటుంబానికి అందజేస్తారు. 

 8వ వేతన కమిషన్ ప్రకారం యూపీఎస్ పెన్షన్ ఎంత ఉండొచ్చు..?

8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం పెరిగే పెన్షన్ ఫిట్ మెంట్ పై ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే ఈసారి ఫిట్ మెంట్ 1.92 నుంచి 2.86 మధ్యలో ఉంటుందని, దీని ప్రకారం ఇప్పుడున్న పెన్షన్ 9 వేల రూపాయల నుంచి పెరిగి.. రూ. 17,280 నుంచి రూ. 25,740 మధ్యలో ఉంటుందని చెబుతున్నారు. 

అనుకున్నట్లుగానే ఫిట్ మెంట్ 2.86 వరకు పెంచితే.. ఉద్యోగుల జీతం, పెన్షన్ 186 శాతం పెరగనున్నాయి. 

యూపీఎస్ ప్రకారం ఉద్యోగులకు కనీస శాలరీ ఎంత ఉండొచ్చు?

ఫిట్ మెంట్ 2.86 వరకు పెరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడున్న బేసిక్ శాలరీతో పోల్చితే డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫిట్ మెంట్ 2.86 ప్రకారం ఉద్యోగుల బేసిక్ పే 51,480 రూపాయలకు పెరగనుంది. ప్రస్తుతం బేసిక్ పే 18 వేల రూపాయలుగా ఉంది. అదే మాదిరిగా పెన్షన్ 9 వేల రూపాయల నుంచి 25,740 రూపాయలకు పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.