వరల్డ్ కప్ నుండి పాక్ తప్పుకుంటే.. ఏం జరగనుంది?

వరల్డ్ కప్ నుండి పాక్ తప్పుకుంటే.. ఏం జరగనుంది?

వన్డే వరల్డ్ కప్ 2023లో పాక్ పాల్గొంటుందా! లేదా. గత నాలుగు రోజులుగా క్రికెట్ అభిమానులను వేధిస్తోన్న ప్రశ్న ఇదే. వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలవ్వగానే.. ఆహా లక్ష మంది నడుమ ఇండియా- పాక్ మ్యాచ్ అంటూ అందరూ సంబరపడిపోయారు. కానీ తీరా చూస్తే.. ఈ టోర్నీలో పాక్ పాల్గొనటమే అనుమానంగా మారింది.

రెండ్రోజుల క్రితం పాక్ క్రీడా మంత్రి ఇషాన్ మజారీ మాట్లాడుతూ.. 'ఆసియా కప్ 2023లో పాల్గొనటానికి భారత జట్టు తమ దేశానికి రాకపోతే.. పాక్ జట్టును వన్డే ప్రపంచకప్ ఆడేందుకు భారత్ పంపబోమని తెలిపారు. అంతేకాదు ఆసియా కప్ మ్యాచులు ఎలాగైతే తటస్థ వేదిక మీద నిర్వహించాలని చూస్తున్నారో.. వరల్డ్ కప్‌లో పాక్ మ్యాచ్‌లను అలానే నిర్వహించాలని పట్టుబట్టారు'. దీంతో ఈ వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పాల్గొంటుందా! లేదా అన్న ప్రశ్న తలెత్తింది.

పాక్ ప్లేస్‌లో స్కాట్లాండ్

ఈ టోర్నీ నుండి పాక్ తప్పుకుంటే మరో జట్టుకు అవకాశం ఇస్తారు. అంటే జింబాబ్వే వేదికగా జరిగిన క్వాలిఫయర్ మ్యాచుల్లో 3వ స్థానంలో నిలిచిన జట్టును ఎంపిక చేస్తారు. ఆ లెక్కన స్కాట్లాండ్‌కు అదృష్టం దక్కనుంది. అదే జరిగితే అహ్మదాబాద్ వేదికగా లక్ష మంది నడుమ ఇండియా-స్కాట్లాండ్ మ్యాచ్ చూడొచ్చు. ఇది అభిమానులకు తీవ్ర నిరాశే.

బీసీసీఐ vs పీసీబీ

పాక్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్ నుంచి టీమిండియా వైదొలగడమే ఇందుకు ప్రధాన కారణం. వాస్తవానికి ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. అయితే భద్రతను సాకుగా చూపుతూ పాక్‌లో టోర్నీ నిర్వహిస్తే భారత జట్టు పాల్గొనబోదని బీసీసీఐ స్పష్టం చేసింది. తటస్థ వేదికల్లో అయితే ఆడతామంటూ హైబ్రిడ్ మోడల్‌ తెరమీదకు తెచ్చింది. ఇప్పుడు పీసీబీ అదే అస్త్రాన్ని వాడుతోంది. పాక్ వరల్డ్ కప్ మ్యాచులకు తటస్థ వేదికలు చూడమంటోంది.

ప్రతి విషయంలో బీసీసీఐ చెప్పనట్టే జరుగుతోందన్నది పీసీబీ వాదన. ప్రపంచ క్రికెట్ బోర్డులో బీసీసీఐ అత్యంత ధనిక బోర్డు అన్న విషయం అందరికీ విదితమే. ఇండియాతో మ్యాచ్ అంటే.. అన్ని బోర్డులకు కాసుల పంటే. అందుకే ఏ క్రికెట్ బోర్డు బీసీసీఐకి ఎదురుచెప్పడం లేదు. ఐసీసీ సైతం తలుపుతోంది. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఒకే తాటిపైకి రావటమే ఈ సమస్యకు పరిష్కారం. మరి  స్కాట్లాండ్‌కు అదృష్టం వరిస్తుందో.. లేదంటే పాక్ మనసు మార్చుకుని భారత్ వచ్చి ప్రపంచ కప్ ఆడుతుందో అన్నది తెలియాలంటే వేచి చూడాలి.