ఆధ్యాత్మికం: స్వార్థం.. వ్యామోహాన్ని వీడకపోతే ఏమవుతుందో తెలుసా..

ఆధ్యాత్మికం: స్వార్థం.. వ్యామోహాన్ని వీడకపోతే  ఏమవుతుందో తెలుసా..

సమాజం ఎటు పోతుందో ఎవరికి అర్దం కావడం లేదు.  నేను.. నా కుటుంబం... నాపిల్లలు.. ఇలా స్వార్థం.. వ్యామోహం పెరిగిపోతుంది.  దీంతోఆధునీక సమాజంలో  మిగతావారిని ముంచైనా సరే మనవారు సంపదల్లో, సౌకర్యాల్లో తేలాలని తాపత్రయపడుతున్నారు. నిజానికి మనవారంటూ ఎవరూలేరని తెలుసుకుంటే అడ్డదారులు తొక్కి అందలాలు ఎక్కే సాహసం ఎవరూ చేయలేరు. పాపాలు చేసి కూడబెట్టిన సొమ్ములో వాటాలు పంచుకునేందుకే పరివారమంతా ముందుంటారు. కానీ, పాపాల ఫలితంగా వచ్చే కష్టనష్టాల్లో మాత్రం ఏ ఒక్కరూ భాగస్వాములు కాలేదు. 

మన ద్వారా ఈ ప్రపంచంలోకి ప్రవేశించిన బిడ్డలను  అనాథలుగా, అభాగ్యులుగా చేయమని రాముడి భక్తుడైన రామదాసు ఉద్దేశం కాదు. కానీ, పరివారం కోసం కొంత పరిమితిని విధించుకోవడం అవసరమన్నారు. ధనం  కూడబెట్టి వారికి అతి భద్రత కల్పించి.. వాళ్లను సుకుమారంగా తయారు చేసేకంటే, సాహసవంతులుగా చేయాలి. మనవారిని మించి పరిథిని విస్తరించుకోవాలి. నిస్వార్థంతో సమాజానికి మనవంతు సేవ చేస్తే, ఆ పుణ్యఫలంగా పరమాత్మ మనల్ని భద్రంగా కాపాడతాడు.   ఇదంతా స్వార్థాన్ని వీడితేనే చేయగలము.

దశరథరామా... తల్లిదండ్రులు... కొడుకులు, భార్య అనే వారు కాలానుగుణంగా జీవితం మధ్యలో వచ్చినవారు మాత్రమే.. అలాంటి వారితో  శాశ్వతంగా సంబంధం కలిగి ఉండరు. ఎందుచేతనంటే  ఒకడు పుట్టినప్పుడు..  మరణించినప్పుడు పాపపుణ్య ఫలములను అనుభవించేటప్పుడు  తానొక్కడే కానీ, అయినవాళ్లంతా  రావడం.. పోవడం కానీ జరగదు.  కాబట్టి అలాంటి వాళ్లతో సంసార జీవితం అక్కర్లేదు. నీవు నాతో లీలలు, మాయలు చేయక నిజంగా సంసారం నుంచి తప్పించి కాపాడుమా అని భక్తరామదాసు.. దాశరథీ శతకం లో ఉంది. 

Also Read :- అఖాడాలు కుంభమేళాకు ఇలా వీడ్కోలు పలుకుతారు

కానీ ఈ రోజుల్లో విశాలహృదయాలు కుచించుకుపోతున్నాయి. మన బిడ్డలు బంధువులు తప్ప పరాయివారెవరూ మనకు కనిపించడం లేదు. మన కళ్ల ముందు ఎందరో అనాథ పిల్లలు ఆకలితో అలమటిస్తున్న మనం కనికరించడం లేదు. మన పిల్లలకు మాత్రం జీర్ణం చేసినా సరే.. కుక్కి కుక్కి మరీ తినిపిస్తూ ఉంటాం. ఇలా అన్ని విషయాల్లో స్వార్థంగా ఉండటం వల్ల  వచ్చే ఫలితాలు భగవంతుడు చివరి రోజుల్లో చూపిస్తున్నాడు. ఒంటరిని చేసి ఆడిస్తున్నాడు.

సొంత ప్రయోజనానికే.. 

చుట్టాలు.. దొంగలు, కొడుకులు.. అప్పులవాళ్లు..  భార్య ముక్తిని దూరం చేసేవారు... సంపదలు నిలకడలేనివని గ్రహించాలి. శరీరం స్థిరం కాదు.. ఇతరులు తమ ప్రయోజనం కోసమే మన దగ్గరకు వస్తారు  అని శ్రీమద్భాగవతంలో బలిచక్రవర్తి తన తాత ప్రహ్లాద మాటలను గుర్తు చేసుకుంటాడు. ఇలా స్వార్థపూరిత బంధాలను దాటుకుంటూ విస్తరించినప్పుడే మన జీవితానికీ శ్రమకూ, సంపాదనకూ సార్థకత.  సనాతన సాహిత్యంలో సంసారమోహవు తెరలను తుంచే ప్రయత్నంలో చాలా కఠినంగా హెచ్చరికలు చేశారు. 

ఇలా చెప్పిన రుషులకు.. పండితులకు.. పెద్దలకు .. అలాంటి వాళ్లందరికీ కుటుంబ వ్యవస్థపై నమ్మకం లేకకాదు! దాన్ని నిరసిస్తూ కాదు. కుటుంబం... సంసారం పేరుతో మనిషి తన పరిధిని కుచించుకుంటూ, స్వార్థపరుడిగా మారే ప్రమాదముందని ముందే ఊహించారు. అందుకే సంకెళ్లను ఛేదించే లక్ష్యంతో మేలుకొలుపు పాడారు. కేవలం కుటుంబ సంక్షేమమే మన లక్ష్యం కాకూడదనీ, పరమాత్మ సంబంధమైన భక్తి మార్గంలో పయనించాలనీ హితవు పలికారు. 

-వెలుగు, లైఫ్​–