రాగద్వేషాలు, భావోద్వేగాలు రాజకీయాలను శాసిస్తాయా? పూర్తిగా కాకున్నా కొంత ప్రభావితం చేస్తాయి. కానీ, అన్నివేళలా ఒక్కరీతిన ఉండవు. జనం దృష్టిలో హేతుబద్ధమైతేనే ఏ రాగద్వేషాలైనా, భావోద్వేగాలైనా ఓట్ల కిందకు మారి ఎన్నికల ఫలితాలను, రాజకీయాలను ఆ మేర ప్రభావితం చేస్తాయి. ఉద్యమమైనా, అవినీతిపై దర్యాప్తులు -అరెస్టులైనా, ఆ వంకతో రాజకీయ కక్షసాధింపులైనా, దానికి ప్రతిఘటనైనా.. సందర్బాన్ని బట్టి ఫలితం అనుకూలమో, ప్రతికూలమో కావచ్చు! పాలకపక్షాల అతిచర్యలు ‘రాజకీయ కక్ష సాధింపు’గా వికటించినట్టే, సానుభూతి ఆశతో చేసే అవతలిపక్షం వెకిలి చేష్టలు విరుద్ధ ఫలితాలిచ్చినా ఆశ్చర్యం లేదు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేస్తే తెలంగాణలో రాజకీయంగా ఏమౌతుంది? కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేస్తే ఏపీ రాజకీయాలపై ప్రభావమేంటి ? కొన్నాళ్లుగా ఇదీ తెలుగునాట ఆసక్తికర చర్చ! కేసుల పురోగతి, రాగల పరిణామాల ప్రభావం సగటు ఓటరుపై ఏ మేరకు ఉంటుంది? ఓటరును నిజంగా ప్రభావితం చేసే అంశాలేంటి? ఎన్నికలకు ఎంత ముందు ఓటరు నిర్ణయం తీసేసుకుంటాడు? ఇవన్నీ ఆసక్తిగొలిపే విషయాలని విశ్వసనీయత కలిగిన సంస్థల సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. సీఎస్‌డీఎస్– లోక్‌నీతి సర్వే ఫలితాలే ఇందుకు నిదర్శనం.
మోకాలు బోడిగుండు లింకు ఒప్పరు
‘వాస్తవాలను100 నుంచి జీరోకి, అబద్ధాలను జీరో నుంచి100కి తీసుకురావడానికి దర్యాప్తు సంస్థ యత్నిస్తోంద’ని సీబీఐ విచారణ నుంచి బయటకు వస్తూ, మీడియాతో అవినాశ్‌రెడ్డి అన్నారు. ‘తెలంగాణ తలవంచదు’ అని ఇప్పుడు కవిత అంటున్నారు. కవిత మీది అభియోగాలకు ‘తెలంగాణ’ కు ఉన్న సంబంధమేమిటి? అని చూస్తారు జనం. ఇది కొత్త కాదు, పైగా అంతటా ఉన్నదే! అదానీ కంపెనీల షేర్ మార్కెట్ తప్పిదాలను హిండెన్‌బర్గ్ ఎత్తిచూపితే, ఫలితంగా స్టాక్ సంపద ఘోరంగా హరించుకుపోతే.. ‘ఇది భారత్‌పై దాడి’ అనడం లాగే ఉంటుంది ఇది కూడా! కవితకు నోటీసులు కక్షసాధింపే అని బీఆర్‌ఎస్ అంటే, ఎక్కడో ఢిల్లీ లో లిక్కర్ స్కామ్‌కు పాల్పడి తెలుగువారి పరువు తీశారని బీజేపీతో సహా ఇక్కడి విపక్షాలంటున్నాయి. దీన్ని ప్రజలెలా చూస్తారన్నదాన్ని బట్టే రాగల ఎన్నికలపై ఈ పరిణామాల ప్రభావం ఉంటుంది. భావోద్వేగాలతో ముడిపడిన అంశాల్లో లోగడ ప్రజలిచ్చిన తీర్పులు, రాజకీయ ఆరోపణల్ని బట్టి కాకుండా... ఆయా పరిణామాల్లోని హేతుబద్ధతని బట్టే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏం జరిగినా... అది తెలంగాణపై దాడి అనేవారు. అప్పట్లో జగన్‌పై ఏ విమర్శ వచ్చినా.. వైఎస్ పైన, ఆయన కుటుంబంపైన దాడిగా లెక్కించే వారు. ఎమర్జెన్సీ దాష్టీకాలకు వ్యతిరేకంగా ఇందిరను ఘోరంగా ఓడించిన దేశ ప్రజలే, జనతాపార్టీ కప్పల తక్కెడ పాలన నచ్చక, సానుభూతి భావోద్వేగాలతో ఆమెకే తిరిగి పట్టం గట్టారు. యూపీఏ సర్కారు భాగస్వాములైన రాజా, కనిమోలిలను అవినీతి కేసుల్లో అరెస్టు చేసినా... సానుభూతి డీఎంకే కు లాభించలేదు. సీబీఐ అరెస్టు చేసిన జగన్‌కి అనుకూలంగా ఉప ఎన్నికల్లో గట్టి తీర్పిచ్చిన తెలుగువారు, 2014 లో ఆ పని చేయలేదు. అదే 2019లో 151/175తో ఆయనకు పట్టంగట్టారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి అరెస్టయి – విడుదలయ్యాక, ఆయన పేరు మారుమోగుతున్నపుడు 2018 ఎన్నికల్లో, సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనే ప్రజలు ఓడించారు. అతన్నే 2021 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలిపించారు. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర ఇలా.. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ భావోద్వేగాలు వేర్వేరు సందర్భాల్లో విభిన్నంగా ప్రతిఫలించాయి.
ప్రభావాలు వేరు...
ఓటు వేసే ముందు, ఓటరు తీసుకునే నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలు, వ్యక్తులు, ఇతరేతర కారకాల గురించి ‘అభివృద్ధి సమాజాల అధ్యయన కేంద్రం’ (సీఎస్‌డీఎస్-లోక్‌నీతి) సర్వే జరిపింది. సగటు ఓటరు.. ఎలా నిర్ణయిస్తారు? ఎప్పుడు నిర్ణయిస్తారు? ఏమేమీ ప్రభావాలు పనిచేస్తాయి? ఎవరి సలహా – సంప్రదింపులతో ఓటేస్తారు? అనే పలు ప్రశ్నలతో ఇటువంటి సర్వేలు 2009, 2014, 2018, 2019 ఎన్నికల ముందు, తర్వాత అఖిల భారత స్థాయిలో, ప్రత్యేకంగా తెలంగాణలో ఆ సంస్థ జరిపింది. వివిధ అంశాలకు ఓటర్లు వేర్వేరుగా స్పందించారు. సగటు మేధావుల పరికల్పనలకు భిన్నమైన వాస్తవాలు ఈ సర్వేల్లో వెలుగు చూశాయి. అప్పటికప్పటి భావోద్వేగాల కన్నా నిలకడ నిర్ణయాలే ఎక్కువ. ఇతరేతరుల కన్నా.. జీవిత భాగస్వాముల, కుటుంబ సభ్యుల ఉమ్మడి నిర్ణయాలదే ఓటింగ్‌లో కీలకపాత్ర. మత-, కుల పెద్దల మాట, గ్రామ ముఖ్యుల, నాయకుల సలహా – సూచనల ప్రభావం ఎంతో తక్కువ అని తేలింది. మెజారిటీ సందర్భాల్లో ఓటు ఏ పార్టీకి అనేది తగినంత ముందుగానే, ప్రచారం కన్నా ముందే నిర్ణయం జరిగిపోతుందని ఓటర్ల మాటల్ని బట్టి వెల్లడైంది. పార్టీ కోణం, అభ్యర్థిని బట్టి.. ఇలా ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారమే అత్యధిక సందర్భాల్లో ఓటింగ్ జరుగుతుందని ఓటర్లు స్పష్టం చేశారు. అందుకే, రాజకీయ ప్రచారకులు ఓటర్లను ప్రభావితం చేసే ఏ ఒక్క కారకాన్నీ సంపూర్ణంగా నమ్ముకోలేరు, ఇది కఠిన వాస్తవం!
ఇప్పటికైతే సాధారణమే!
ఏ భావోద్వేగాలు, తీవ్ర రాజకీయ ప్రభావాలు లేని1989 నాటి లాగా, అతి సాధారణ ఎన్నికలే ఈసారి(2023) అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. మధ్యలో జరిగిన అన్ని ఎన్నికలూ ఏదో ఒక ప్రభావకాంశానికి లోబడి జరిగాయి. అంతకు ముందరి రెండు ఎన్నికలూ అలాంటివే! 1983లో కాంగ్రెస్‌కు వ్యతిరేక ప్రభంజనం వల్ల... తొమ్మిదినెలల తెలుగుదేశాన్ని శీర్షభాగాన ఉండి నడిపిన ఎన్టీఆర్ విజయదుందుభి మోగించారు. 1985 ఎన్నికలు, నాదెండ్ల భాస్కరరావు – గవర్నర్ రామ్‌లాల్‌లు, నాటి సర్కార్ అక్రమ కూల్చివేతను ప్రతిఘటించిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమ ప్రభావంతో జరిగాయి. 1994 ఎన్నికలపై సారా, మద్య వ్యతిరేకోద్యమ నీడలు పరుచుకుంటే, 1999 ఎన్నికలు, ఒక ఓటుతో కేంద్రంలో సర్కారు పోగొట్టుకున్న వాజ్‌పేయిపై సానుభూతి పవనాల్లో జరిగాయి. 2004 ఎన్నికల్ని డా.వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రభావితం చేస్తే, అదే రాజశేఖర్‌రెడ్డి జనరంజక పాలనని... విపక్షాలన్నీ ‘మహాకూటమి’గా జట్టుగట్టి ఎదిరించడాన్ని జనం అంగీకరించక, 2009 ఎన్నికల్లో వైఎస్సార్ మళ్లీ గెలిచారు. ఇక రాష్ట్రవిభజన తర్వాత తొలి ఎన్నికలు 2014లో తెలంగాణ కొత్త రాష్ట్రపు భావోద్వేగాలు బలంగా ఉంటే, 2018లోనూ కొంతమేర పనిచేశాయి. ముఖ్యంగా, తెలంగాణ కాంగ్రెస్ చంద్రబాబు నేతృత్వపు టీడీపీతో జట్టుగట్టడానికి వ్యతిరేకతను కేసీఆర్ సమర్థంగా వాడుకోవడం వల్ల సెంటిమెంట్ కొంత పనిచేసింది. కానీ, ప్రస్తుత ఎన్నికలు 1989 లాగా... సాదాసీదా ఎన్నికలే!
తాము నమ్మేదాన్ని బట్టే....
కవిత, అవినాశ్‌రెడ్డిలు ప్రజాప్రతినిధులే కాకుండా తెలుగు రాష్ట్రాల సీఎంల కుటుంబ సభ్యులు కావడం ఈ ముచ్చట్లు, చర్చలకు కారణం. ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును, అటు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును కేంద్రం ఆధ్వర్యంలోని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. లిక్కర్ స్కామ్‌లో హవాలా, మనీ లాండరింగ్ వ్యవహారాలుండటంతో ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వపు ప్రభుత్వం ఉంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో... బీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలు అధికారంలో ఉన్నాయి. రాజకీయ కుటుంబీకులతో ముడివడి ఉన్నందున రెండూ వివాదాస్పద కేసులుగానే ప్రచారం జరుగుతోంది. నెలలుగా దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ – ఈడీలు రెండు కేసుల్లోనూ పురోగతితో దూకుడు పెంచాయి. ఒకట్రెండు రోజుల్లో కీలక పరిణామాలకు ఆస్కారం ఉండటంతో చర్చ వేడందుకుంది. విచారణల క్రమంలో... వారిని అరెస్టు చేస్తారా? చేస్తే ఏంటి? అసలు అరెస్టు చేయరా? చేయకపోతే ఏంటి? స్థూలంగా ఇదీ, తెలుగునాట సాగుతున్న చర్చల సారం. అవినీతి దర్యాప్తులు, హత్య కేసు పరిశోధనలన్నీ రాజకీయ కక్షసాధింపులు అనడానికి లేదు. అలా అని, దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో అధికార పక్షాలు కక్షసాధింపులకే పాల్పడటం లేదని కితాబివ్వడానికీ లేదు. రెండూ ఉంటాయి. ఎప్పుడు? ఏది? జరుగుతోందో ఆయా కేసుల నేపథ్యాన్ని, దర్యాప్తు తీరుని బట్టి ప్రజాక్షేత్రం గ్రహిస్తుంది.
- ఆర్. దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ