సిటీ వరదల్లో ఉంటే మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నరు: రేవంత్​

బాధితులకు రూ.10 వేల సాయం ప్రకటించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు
: నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ ప్రజలు అల్లాడుతున్నా.. మంత్రి కేటీఆర్ వారి గోసను పట్టించుకోకుండా పత్తా లేకుండా పోయారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయిందన్నారు. గురువారం ఆయన కేటీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. ‘‘మీ చావు మీరు చావండి అంటూ ప్రజలను వదిలేసి.. మీరు మాత్రం పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నారు. నిస్సిగ్గుగా బాధ్యతల నుంచి పారిపోతున్నారు. ఫామ్​హౌస్ లో మీ నాన్న.. పార్టీల్లో మీరు సేద తీరుతూ ప్రజలను వరదల్లో ముంచేశారు’’ అని ఫైర్ అయ్యారు. సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్​ను విశ్వనగరంగా మార్చామని తండ్రీకొడుకులు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచమంతా హైదరాబాద్​ వైపు చూస్తున్నదంటూ ఉద్దెర ముచ్చట్లు చెప్తుంటారన్నారు. వర్షాలు పడితే నగర ప్రజలు బయటకు వచ్చేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్నారన్నారు. ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియక ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని తిరిగే పరిస్థితిని కల్పించారంటూ మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు రూ.10 వేల సాయం ప్రకటించాలన్నారు. దినసరి కూలీలను ఆదుకోవాలని కోరారు. రోడ్లను వెంటనే బాగు చేయాలని డిమాండ్​ చేశారు.

ట్రాఫిక్ జామ్​లు ఎందుకైతున్నయ్
హైదరాబాద్​ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్భాలు పలికిన తండ్రీ కొడుకులు.. సిటీని నరకకూపంగా మార్చారని రేవంత్ ఫైర్​ అయ్యారు. వాళ్లు చెప్పినట్టు అభివృద్ధి చేసి ఉంటే ఐటీ కారిడార్ నుంచి హయత్​నగర్ దాకా ట్రాఫిక్​జామ్​లు ఎందుకు అవుతున్నాయని ప్రశ్నించారు. ‘‘ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. ఫ్లై ఓవర్ల కింద అండర్​పాస్​లలో నీళ్లు నిండిపోయి వాహనాలు వెళ్లలేకపోతున్నాయి. స్ట్రాటజిక్ రోడ్లు అంటూ మీరు చేసే హడావుడి అంతా డొల్ల అని తేలిపోయింది’’ అని ఆరోపించారు.

మీ కమీషన్ల కక్కుర్తే కారణం
చిన్న వర్షానికే సిటీ అతలాకుతలమైతున్నదని రేవంత్ అన్నారు. కుండపోత వానొస్తే పరిస్థితేంటో తలచుకుంటేనే భయం వేస్తున్నదన్నారు. కమీషన్లు, డబ్బుల కక్కుర్తితో రూల్స్​కు విరుద్ధంగా భారీ భవనాలకు అనుమతులివ్వడం, నాలాలు, చెరువులు కబ్జా అవుతున్నా పట్టించుకోకపోవడం వల్లే సిటీ మునిగిపోతున్నదన్నారు. హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు యథేచ్ఛగా భూములు, చెరువులు కబ్జా పెట్టి అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని ఆరోపించారు. ఆ అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన మంత్రి కేటీఆర్.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్​ ప్రకటించినా.. ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. 

ALSO READ:వణికించిన కడెం.. దేవుడే కాపాడాలన్న మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

పార్టీ ఫిరాయింపుల పనుల్లో ఉన్నరు
భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని కాంగ్రెస్ నాయకులకు రేవంత్ సూచించారు. గురువారం పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో కలిసి కేడర్​తో జూమ్​ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. వరదలు వస్తున్నా ప్రజల కష్టాలను పట్టించుకోని సీఎం కేసీఆర్​.. రాజకీయాలు చేస్తూ పార్టీ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి వరద సాయం వచ్చేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. హైదరాబాద్​లో కాంగ్రెస్ పార్టీ ఓ కంట్రోల్ రూమ్​ను ఏర్పాటు చేసిందని, వరద బాధితులకు పునారావాస సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నదన్నారు. వర్షాలు, వరదల వల్ల ప్రియాంక గాంధీ సభను వాయిదా వేస్తున్నామని తెలిపారు.