
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏప్రిల్ 2న విదేశాలకు వేయనున్న టారిఫ్ విషయంలో కీలక ప్రకటన చేయనున్నారని ఇటీవల వైట్ హౌస్ ప్రతినిధి ప్రకటించారు. ఎక్కడా కూడా వ్యాపార వాణిజ్య సంబంధాలపై కాంప్రమైజ్ లేదని తెలిపారు. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ ఇప్పుడు గతం కన్నా చాలా పరేషాన్లో ఉన్నారు.
ఏప్రిల్ 2న ఎలాంటి ప్రకటన రానున్నదో ఎవరికి అంతుచిక్కని పరిస్థితి నెలకొని ఉంది. ఎలాన్ మస్క్ సృష్టి అయిన గ్రోక్తో ఇప్పటికే పరేషాన్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ రెండు తర్వాత పరిస్థితిని అంచనా వేసేటట్లు లేదు. అమెరికాలో ఉంటున్న విదేశీయులే కాకుండా మొత్తం ఇతర దేశాలలోనూ కలకలంగా ఉంది. ఒకవైపు టారిఫ్ పెంపును ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమెరికా ఆర్థిక పరిస్థితిని బాగుచేయడానికి వెనకడుగు వేసే పరిస్థితి లేదని స్పష్టంగా పేర్కొంటున్నారు.
లక్షల మంది లీగల్ స్టేటస్ క్యాన్సిల్
5.30 లక్షల మంది లీగల్ స్టేటస్ క్యాన్సిల్ నిర్ణయంతో అమెరికాలోని మనవాళ్లలో అభద్రత పెరిగింది. దేశంలో తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికాను దాదాపు 5.30 లక్షల మంది వీడనున్నారు. వీరందరూ క్యూబా, హైతీ, వెనెజులా తదితర దేశాలకు చెందిన పౌరులు. దాదాపు ఒక నెలలో వారిని దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం శుక్రవారం తెలిపింది. ఏప్రిల్ 24తో వారి లీగల్ స్టేటస్ రద్దు అవుతుందని వెల్లడించారు. ----అమెరికా మద్యం మీద భారత్ 150 శాతం టారిఫ్ పెడితే మేం వారి వ్యవసాయ ఉత్పత్తుల మీద 100 శాతం టారిఫ్ పెడతామని అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి పేర్కొన్నారు. భారత్ సహా ఇతర దేశాలపై టారిఫ్ తదితర విషయాలు చెప్పడానికి ఏప్రిల్ 2న వైట్ హౌస్ కు రావాలని పాత్రికేయులకు ఆహ్వానం పలికారు.
ట్రంప్ హెచ్చరికలు
ఇప్పుడు ఏప్రిల్ 2న పెద్ద ఎత్తున ఇందుకోసం పత్రికా సమావేశాన్ని కూడా వైట్ హౌస్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈలోపు విపక్షాలను పిలిచి వారి సలహాలు తీసుకోవాలి. పీఎం నరేంద్ర మోదీ ఈ సంకట పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడేయాలి. కనీసం ఇప్పుడైనా కలిసి పని చేయాలి.
ఉదాహరణకు పీవీ నరసింహారావు పీఎంగా ఉన్నపుడు పాకిస్తాన్ ఇండియాపై మానవ హక్కుల ఉల్లంఘనలు ఆరోపణలు చేసింది. ఆ సమయంలో ఒక ప్రతినిధి వర్గంను పంపించింది. అప్పుడు దానికి మాజీ ప్రధాని వాజ్పేయి నాయకత్వం వహించారు. అప్పుడు విదేశాంగ మంత్రిగా సల్మాన్ ఖుర్షీద్, జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఫరూక్ అబ్దుల్లా కూడా బృందంలోఉన్నారు. చాలా విషయాలు అంతర్జాతీయ, జాతీయపరంగా సమస్యల పరిష్కారానికి అఖిలపక్షం అంతా కలిసి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి.
అమెరికా వైఖరితో ప్రమాదం
ప్రస్తుతం అమెరికా వైఖరి భారతదేశానికి ప్రమాదకరంగా తయారైంది. మన ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసే ఆలోచనలు మాత్రమే కాదు. వ్యవసాయ రంగంపైన కూడా భారీగా భారం వేసే పరిస్థితి కనిపిస్తున్నది. మద్యం ధరలు పెంచితే దానికి వ్యవసాయ రంగం ఉత్పత్తులతో ముడి వేయడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి విషయాలపై వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సహా అందర్నీ చర్చలకు ఆహ్వానించాలి.
తప్పనిసరిగా ఇది మన దేశ ప్రతిష్టకు, ఆర్థిక పరమైన విషయానికి సంబంధించింది కాబట్టి అందరూ కలిసి వస్తారు. ఎవరి సలహాలు వారు ఇస్తారు. వాటిని పాటించాల్సిన బాధ్యత విస్మరించరాదు. నరేంద్ర మోదీ 11ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా విపక్షాలతో ఆయన మంచిగా ఉన్న సందర్భం లేదు. అయినప్పటికీ విషయం చాలా తీవ్రమైంది. కాబట్టి, విపక్షాలు కూడా విషయంపై సీరియస్గా స్పందించాలి.
- ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్-