అక్షర ప్రపంచం: సైకో డైరెక్టర్ హిచ్ కాక్ గురించి తెలియనిది ఇంత ఉందా ?

అక్షర ప్రపంచం: సైకో డైరెక్టర్ హిచ్ కాక్ గురించి తెలియనిది ఇంత ఉందా ?

హిచ్ కాక్ సైకో డైరెక్టర్! అంటే ‘సైకో’ అనే సినిమా తీసిన డైరెక్టర్ అని  కాదు. దర్శకుడిగా సైకో అని! ఆయన అలా ప్రవర్తించి ఉండకపోతే  హిచ్ కాక్ 125వ జయంతి సందర్భంగా దాదాపు పాతికమంది దర్శకులు ఒక చోట ఏకీకృతం కారు. ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకుని ఉండరు. నిజానికి వీళ్ళు ఇలా కలవడానికి, హిచ్ కాక్ గురించి మాట్లాడుకోవడానికి ఓ రీజన్ ఉంది. అదే ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్ కాక్’ అనే పుస్తకం. హిచ్ కాక్ డైరెక్ట్ చేసిన తొలి చిత్రం ‘ది ప్లెజర్ గార్డెన్’ విడుదలై 2025కి వందేళ్ళు అవుతుంది.

ఈ సందర్భంగా సీనియర్ సినీ పాత్రికేయులు, నంది అవార్డు గ్రహీత, సినీ పాటల, మాటల రచయిత పులగం చిన్నారాయణ, రైల్వే ఉన్నతాధికారి సాహితీ పిపాసి రవి పాడి కలిసి ‘మాస్టర్ ఆఫ్‌‌ సస్పెన్స్ హిచ్ కాక్’ అనే పుస్తకాన్ని వెలువరించారు. 45మంది తెలుగు సినీ దర్శకులు, ఏడుగురు రచయితలు, పది మంది పాత్రికేయులు రాసిన వ్యాస సంకలనం ఇది. హిచ్ కాక్ సినిమాలతో ప్రేరణ పొంది ‘అన్వేషణ’ వంటి అద్భుతమైన సినిమాను తెరకెక్కించిన వంశీ, కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్‌‌ అడ్రస్​​గా నిలిచిన పూరి జగన్నాథ్‌‌, ‘కళ్ళు’ వంటి అద్భుత చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు

సినిమాటోగ్రాఫర్ ఎం.వి. రఘు, సెన్సిబుల్ కంటెంట్​ను సిల్వర్ స్క్రీన్ మీదకు మళ్ళించడంలో దిట్ట అయిన ఇంద్రగంటి మోహనకృష్ణ, రీమేక్ సినిమాలను సైతం తనదైన శైలిలో అద్భుతంగా ప్రెజెంట్ చేసే దర్శకుడు హరీశ్ శంకర్... ఇలా రాసుకుంటూ పోతే పెద్ద జాబితానే అవుతుంది. తెలుగు సినిమాతో పాటే పుట్టి, పెరిగి, భారతీయ సినిమాపై చెరిగిపోని సంతకం చేసిన దిగ్దర్శకులు సింగీతం శ్రీనివాసరావు.. హిచ్ కాక్ మూవీస్ లో మాస్టర్ పీస్ అనిపించుకున్న ‘రియర్ విండో’ను విశ్లేషించారు.

కామెడీ అండ్ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన రేలంగి నరసింహారావు తన టేస్ట్ కు తగ్గట్టుగా హిచ్ కాక్ తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామా ! ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ గురించి రాశారు. ‘హను-మాన్’ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘ఫ్యామిలీ ప్లాట్’ మూవీ గురించి వివరించారు. అంతేకాదు.. ఈయన చిత్రాలను పాపులర్, కమర్షియల్, సెన్సిబుల్, సెన్సేషనల్, అప్ కమింగ్ డైరెక్టర్స్, రైటర్స్ ఎలా చూశారు? ఏలా విశ్లేషించారు? అనేది ఈ పుస్తకం చదివితే అర్థం అవుతుంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే... ప్రతి దర్శకుడు, ప్రతి రచయిత, ప్రతి పాత్రికేయుడు... హిచ్ కాక్​తో మమేకమై వీటిని రాశారు. 

ఇందులో మొక్కుబడి వ్యాసం ఒక్కటీ లేదు! సహజంగా ఇలాంటి పుస్తకాలు ఆయా వ్యక్తుల గొప్పతనాన్ని కీర్తించడానికే పరిమితం అవుతాయి. కానీ ఇందులో కొందరు జర్నలిస్టులు రాసిన వ్యాసాలు... వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ హిచ్ కాక్​ను నగ్నంగా నిలబెట్టాయి! ఓ మీడియేటర్ గా, వ్యాపారవేత్తగా.. విభిన్న కోణాల్లో హిచ్ కాక్ ఏమిటనేది తెలియచేశాయి. ఓ రకంగా హిచ్ కాక్​కు ఎలాంటి హంగులు, రంగులూ అద్దకుండా... బ్లాక్ అండ్ వైట్​గా ఆ వ్యాసాలు పొట్రేట్ చేశాయి. దాంతో ఈ గ్రంథానికి ఓ సంపూర్ణత్వం వచ్చింది. ఇక భారతీయ సినీ సంగీత విశ్లేషకులుగా వి.ఎ.కె. రంగారావు రాసిన వ్యాసం ఈ పుస్తకానికి ఓ ప్రత్యేకతను తీసుకొచ్చింది.

హిచ్ కాక్ సినిమాల గురించి దర్శకులు రాస్తే... ఆయన సినిమాలను, వ్యక్తిత్వాన్ని, ఆయన కెరీర్ సాగిన విధానాన్ని రచయితలు, పాత్రికేయులు తమ వ్యాసాలలో పొందుపరిచారు. హిచ్ కాక్ తన లాంగ్ కెరీర్ లో రాసింది ఒకే ఒక్క షార్ట్ స్టోరీ. సినిమాల్లోకి రాకముందు, ఇరవై యేళ్ళ వయసులో ఆయన రాసిన 'గ్యాస్' అనే ఆ మినీ కథకూ ఇందులో చోటు కల్పించారు.

హిచ్ కాక్ గురించి తెలియని వారు ఉండరు. అయితే... ఈ పుస్తకం చదివిన తర్వాత హిచ్ కాక్ గురించి మనకు తెలియనిది ఇంత ఉందా? అనే సంభ్రమకు గురౌతారు. సినిమాల విశ్లేషణలతో పాటు అనుబంధంగా ఇచ్చిన 'ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు...' చదివితే హిచ్ కాక్ టైంలో సినిమా నిర్మాణం ఎలా ఉండేది? సెన్సార్ పరంగా ఎలాంటి ఇబ్బందులను వారు ఎదుర్కొన్నారు? ఏ సినిమా నిర్మాణం ఎలా జరిగింది? వాటి తెర వెనుక కథ ఏమిటీ? అనేది అర్థమౌతుంది. ఈ పుస్తకం ఆసాంతం చదివిన తర్వాత మనం ఎంతో ఇష్టపడి చూసిన పలు చిత్రాలకు హిచ్ కాక్ సినిమాలే కదా ప్రేరణ! అనిపిస్తుంది.

కొందరు దర్శకులు ఆ విషయాన్ని తమ వ్యాసాలలో ఒప్పుకున్నారు కూడా! లాస్ట్ బట్ నాట్ లీస్ట్.... ఈ పుస్తకానికి ముందుమాట ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాశారు. ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన మల్లాది... హిచ్ కాక్ ను ఎంతగా ఔపోసన పట్టారో వారి మాటలు చదివితే అర్థమైపోతుంది.

ఈ పుస్తకంలోని ప్రతి పేజీ... ప్రతి వాక్యం... దీని సంకలన కర్తలు పులగం చిన్నారాయణ, రవి పాడి కష్టాన్ని, ఇష్టాన్ని తెలియచేస్తాయి. హిచ్ కాక్ అభిమానులే కాదు.. సినిమాను ఇష్టపడేవారు, సినిమా రంగానికి చెందిన వివిధ శాఖల వారు కొని చదివి దాచుకోవాల్సిన పుస్తకం ఇది.

ఇంతకూ హిచ్ కాక్  మనల్ని వదిలి వెళ్ళిపోయి 44 సంవత్సరాలైనా ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే... ముందు చెప్పినట్టు ఆయనో సైకో డైరెక్టర్! అన్నారు పూరి జగన్నాథ్‌‌. ‘‘అందరూ హిచ్ కాక్​ను గొప్ప పదాలతో పిలుస్తారేమో, పోలుస్తారేమో కానీ నేను మాత్రం ‘సైకో’ అనే పిలుస్తాను.

అంటే అలా వ్యవహరించి ఉండకపోతే, మనం ఈరోజు ఇంతలా ఆయన గురించి మాట్లాడేవాళ్ళం కాదు, గుర్తుంచుకునే వాళ్ళం కాదు. ఒక సైకోలా బతికితే అసలు నిన్ను మర్చిపోరు అనేది నా నమ్మకం'' అన్నారాయన. 

నిజమే...వరల్డ్ సినిమాను తాను ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా శాసించిన అతి కొద్ది మంది దర్శకులలో హిచ్ కాక్ ఒకరు. ఎందుకంటే ఆయన ‘సైకో’ మూవీ డైరెక్టర్ కాబట్టి! – కార్తికేయ