50-30-20 రూల్ ఫాలో అవండి.. మీ జీతం డబ్బులు ఇలా సేవ్ చేసుకోండి..

50-30-20 రూల్ ఫాలో అవండి.. మీ జీతం డబ్బులు ఇలా సేవ్ చేసుకోండి..

పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి.  ఖర్చులు ఆకాశాన్ని  అంటుతున్నాయి. నిత్యావసర  వస్తువుల ధరలు  జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నాయి.  స్కూలు ఫీజులు, పెట్రోల్ ధరలు,  వైద్య ఖర్చులు ఇవన్నీ మన బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను దాటి ముందుకు దూసుకెళ్తున్నాయి.  అయితే,  ఆదాయం మాత్రం ఈ ఖర్చులతోపాటు  సమానంగా పరుగెత్తడం లేదు. ఇలాంటి సమయంలో ఆర్థిక స్థిరత్వం సాధించడం  కష్టమైనా అసాధ్యం మాత్రం కాదు.  డబ్బు పట్ల క్రమశిక్షణ, సరైన ఆలోచనలతో  మన లక్ష్యాలను చేరుకోవచ్చు. మీ ఆదాయంలో  కొంతభాగాన్ని కచ్చితంగా పొదుపు చేయండి. నెలకు కనీసం 10-20 శాతం సైడ్‌‌‌‌‌‌‌‌కి పెట్టండి. ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్ బాండ్స్ లేదా రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌లో  పెట్టుబడి పెట్టడం ద్వారా ఆ పెట్టుబడి భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో మంచి ఫలితాలను ఇస్తుంది.

బడ్జెట్‌‌‌‌‌‌‌‌కి  కట్టుబడి ఉండడం అనివార్యం. 50-–30-–20 నియమాన్ని అనుసరించండి. అంటే 50 శాతం అవసరాలకు,  30 శాతం కోరికలకు, 20 శాతం పొదుపు/పెట్టుబడులకు కేటాయించండి.  ఖర్చులను  స్పష్టంగా గుర్తించడానికి  యాప్‌‌‌‌‌‌‌‌లు లేదా  స్ప్రెడ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌లు ఉపయోగించండి.  ఎమర్జెన్సీ కోసం సన్నద్ధం అవ్వాలి.  కనీసం 6 నెలల ఖర్చులను ఎమర్జెన్సీ ఫండ్‌‌‌‌‌‌‌‌గా కలిగి ఉండటం ఎంతో అవసరం.  అలాగే  హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరి.  కనీసం 10 లక్షల రూపాయల కవరేజితో  కుటుంబానికి పాలసీ తీసుకోండి.  అలాగే టర్మ్  ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా భవిష్యత్ రక్షణను కల్పించుకోండి.

రిస్క్​లేని పెట్టుబడులను అన్వేషించాలి
పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక దృష్టితో ముందుకు వెళ్లండి. SIPల ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడి పెడితే సగటున 12-–15% రాబడి పొందవచ్చు.  గోల్డ్ బాండ్స్, గోల్డ్ ETFలు, లేదా మంచి లొకేషన్‌‌‌‌‌‌‌‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా లాభదాయకం.  రిస్క్‌‌‌‌‌‌‌‌ ఉన్నా సరే,  ఓపికగా వేచి చూస్తే ఫలితం ఉంటుంది. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా రిస్క్‌‌‌‌‌‌‌‌ లేకుండా మంచి వడ్డీని అందిస్తుంది.  క్రెడిట్ కార్డ్ అప్పులు, అధిక వడ్డీ రేట్ల అప్పులు మీ ఆర్థిక ప్రణాళికను తలకిందులు చేయవచ్చు. మొదటగా ఇవి క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. అవసరమైతే తక్కువ వడ్డీ ఉన్న లోన్‌‌‌‌‌‌‌‌లను ఎంపిక చేసుకోండి.  పర్సనల్  ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌లో అవగాహన చాలా ముఖ్యం.

ఆర్థిక విజ్ఞానం పెంచుకోవాలి
‘రిచ్ డాడ్  పూర్ డాడ్’,  ‘మనీ మాస్టర్ ది గేమ్’ వంటి పుస్తకాలు చదవడం ద్వారా ఆర్థిక విజ్ఞానం పెరుగుతుంది.  పాడ్‌‌‌‌‌‌‌‌కాస్ట్‌‌‌‌‌‌‌‌లు, ఆర్థిక బ్లాగులు చదవడం కూడా సహాయపడుతుంది. అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్‌‌‌‌‌‌‌‌ను సంప్రదించండి. ఒకే ఆదాయ మార్గం మీద ఆధారపడకుండా కొత్త అవకాశాలను అన్వేషించండి.  ఫ్రీలాన్సింగ్,  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ కోర్సులు, చిన్న వ్యాపారాలు వంటి మార్గాల్లో ఆదాయం సంపాదించండి. ఇవి మీ పెట్టుబడుల బలాన్ని పెంచుతాయి.

డబ్బును గౌరవించండి
ప్రతి ఖర్చు ముందు ఒకసారి ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు, త్వరగా డబ్బు రెట్టింపు అవుతుందన్న స్కీమ్‌‌‌‌‌‌‌‌లను నమ్మవద్దు.  డబ్బును భయపెట్టే శత్రువుగా కాకుండా  సహాయపడే స్నేహితుడిగా భావించండి.  దాన్ని గౌరవించండి,  సద్వినియోగం చేసుకోండి.  ఆర్థిక స్థిరత్వానికి మార్గదర్శకంగా మార్చుకోండి. డబ్బు సరైన రీతిలో ఉంటే, అది మీకు భద్రతను, బలాన్ని, నమ్మకాన్ని అందిస్తుంది. ఇప్పుడే  డబ్బుతో  మైత్రిని కుదుర్చుకోండి. 

-శ్రీనివాస్ గౌడ్ ముద్దం