ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి కన్నా సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో రూమర్స్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. కరోనా గురించి లేని పోని అసత్య ప్రచారాలు ఎక్కువయ్యాయి. దీంతో వీటికి చెక్ పెట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు నేరుగా వాట్సాప్ కంపెనీ నేరుగా రంగంలోకి దిగింది. రూమర్స్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఫార్వార్డ్ మెసేజ్ లను ఒకేసారి ఎక్కువ మందికి పంపే వీలు లేకుండా కోత విధించింది. ఒకసారి ఒకే వ్యక్తికి మాత్రమే ఫార్వర్డ్ మెసేజ్ ను పంపేలా మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనను మంగళవారం (ఏప్రిల్ 7) నుంచే అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
ఆల్రెడీ ఐదుగురికి పంపిన తర్వాత…
ఫార్వార్డ్ మెసేజ్ ఒకసారి ఒకరికి మాత్రమే పంపే నిబంధనను అమలులోకి తేవడంపై వాట్సాప్ ఓనర్ ఫేస్ బుక్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. వాట్సాప్ సృష్టి వెనుక ఉద్దేశం పరస్పరం వ్యక్తుల మధ్య మంచి చాటింగ్ కోసమని తెలిపింది. అయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు డైలీ విష్, పండుగ సందర్భాల్లో శుభాకాంక్షలు, ఇతరత్రా ఫార్వార్డ్ మెసేజ్ లు పంపుకోవడం మంచిదే. కానీ తరచూ వాట్సాప్ లో ఫేక్ న్యూస్ షేర్ అవుతుండడంతో దీన్ని కట్టడి చేసేందుకు దృష్టి పెట్టింది ఆ కంపెనీ. 2018కి ముందు 256 మందికి ఒకే మెసేజ్ ను ఒక్కసారిగా ఫార్వార్డ్ చేసే వీలుండేది. ఆ పరిమితిని 20 చాట్స్ కి మాత్రమే ఒక్కసారిగా పంపేలా మార్పులు చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ 20 నుంచి ఇంకా తగ్గించి ఐదుగురికి మాత్రమే షేర్ చేయగలిగేలా షరతులు విధించింది. అయితే ఇప్పుడు కరోనాపై లేనిపోని అవాస్తవాలు వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతుడడంతో దాన్ని కట్టడి చేసేందుకు ఇప్పుడు మళ్లీ కండిషన్స్ లో మార్పు చేసింది. ఫార్వార్డ్ మెసేజ్ ఒకసారి ఒకరికి మాత్రమే పంపేలా షరతు విధించింది. అయితే ఒక మెసేజ్ ను తొలుత ఫార్వార్డ్ చేసే వాళ్లు మామూలుగానే ఐదుగురికి పంపొచ్చు. అయితే ఆ మెసేజ్ అప్పటికే ఐదు సార్లు వేర్వేరు వ్యక్తులకు ఫార్వార్డ్ అయిన తర్వాత మరో వ్యక్తి దాన్ని ఫార్వార్డ్ చేసే ప్రయత్నం చేస్తే అది ఒకసారి ఒకరికి మాత్రమే పంపే వీలుంటుంది.
ఈ లెక్క ఎలా..?
ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు ఎంత ఎక్కువగా షేర్ అయినా దాన్ని మొదట షేర్ చేసిన వారిని గుర్తించవచ్చు. పైగా ఆ మెసేజ్ ను ఓపెన్ గా ఎక్కువ మంది చదవడం కూడా వీలవుతుంది. దాని ద్వారా ఏదైనా రూమర్స్ స్ప్రెడ్ అయితే దాన్ని క్రియేట్ చేసిన వాళ్లను సైబర్ పోలీసులు సులభంగా గుర్తించగలుగుతారు. అయితే వాట్సాప్ అనేది ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్. దీని వల్ల ఆ మెసేజ్ వెళ్లిన యూజర్లు తప్ప కంపెనీ కూడా వాటిని చదవలేదు. అయితే యూజర్లు ఎన్ని మెసేజ్ లు పంపుతున్నారు? ఎంత మందికి పంపుతున్నారు? ఎన్ని సార్లు ఫార్వార్డ్ అవుతుందన్న విషయాలను వాట్సాప్ లెక్కించగలదు. పైగా ఫార్వార్డ్ మెజేస్ లను యారో మార్కింగ్ కూడా చేస్తోంది. దీని ద్వారా ఒక మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వార్డ్ అయిందన్న విషయాన్ని గుర్తించి ఐదు సార్లు అంతకు మించి ఎక్కువ సార్లు ఫార్వార్డ్ అయిన మెసేజ్ లను యూజర్లు ఒకేసారి ఒక్కరికి మాత్రమే పంపేలా లిమిట్ చేస్తుంది వాట్సాప్.